Share News

వేరు శనగ రైతులు దగా

ABN , Publish Date - Jun 05 , 2025 | 11:29 PM

వేరు శనగ రైతులు దగా

వేరు శనగ రైతులు దగా

రాయితీ వేరుశనగ విత్తన సేకరణలో భారీ దోపిడీ

రైతు నుంచి కాకుండా వ్యాపారుల నుంచే కొనుగోలుకు ఏపీ సీడ్స్‌ నిర్ణయం

రైతులకు ఇచ్చేది క్వింటం రూ.6,500

ఏపీ సీడ్స్‌ వ్యాపారులకు రూ.9,300

క్లీనింగ్‌, రవాణా ఖర్చులు పోను క్వింటంపై వ్యాపారులకు రూ.2వేలు లాభం

ఉమ్మడి జిల్లాలో 11,108 క్వింటాళ్ల కొనుగోలుకు ఏపీ సీడ్స్‌ సిద్ధం

మారెప్ప. క్రిష్ణగిరి మండలంలోని మల్యాలకు చెందిన ఇతడు గత రబీలో గాజులదిన్నె జలాశయం కింద వేరుశనగ పంటను రెండెకరాల్లో సాగు చేశాడు. కర్నూలు మార్కెట్‌ యార్డుకు రెండు రోజుల క్రితం పంట దిగుబడిని అమ్మేందుకు తెచ్చాడు. వ్యాపారులు కేవలం రూ.6,500 ధర మాత్రమే ఒక క్వింటానికి చెల్లించారు. ప్రస్తుతం ఏపీ సీడ్స్‌ సంస్థ వేరుశనగ విత్తనకాయలను కొనుగోలు చేసేందుకు నిర్ణయించింది. క్వింటానికి రూ.9,300 చెల్లిస్తామని ప్రకటించింది. ఈ విషయం తెలిసి రైతు ఏపీ సీడ్స్‌ అధికారులను కలిశాడు. తన వద్ద నాణ్యమైన వేరుశనగ కాయలు ఉన్నాయని, ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనాలని కోరాడు. అయితే.. తాము కొనే అవకాశం లేదని అధికా రులు చెప్పడంతో మరో దారి లేక కర్నూలు మార్కెట్‌ యార్డులోనే విక్రయించాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని వేరుశనగ రైతులందరి దుస్థితి ఇది.

కర్నూలు అగ్రికల్చర్‌, జూన్‌ 5 (ఆంధ్రజ్యోతి): జూన్‌ నుంచి మొదలయ్యే ఖరీఫ్‌లో రైతులకు విత్తనం కోసం 40 శాతం సబ్సిడీపై నాణ్యమైన వేరుశనగ కాయలను పంపిణీ చేయాలని ఏపీ సీడ్స్‌ సంస్థ నిర్ణయించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు క్వింటానికి రూ.9,300 చెల్లించాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూలు జిల్లాకు 9,099 క్వింటాళ్లు, నంద్యాల జిల్లాకు 2,009 క్వింటాళ్లు రాయితీపై అందించాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అనుమతి ఇచ్చింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాబోయే ఖరీఫ్‌లో దాదాపు 90వేల హెక్టార్లలో వేరుశనగ పంటను సాగు చేస్తారని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఇంత విస్తీర్ణంలో పంట సాగుకు దాదాపు 20వేల నుంచి 30వేల క్వింటాళ్ల విత్తనాలు అవసరం అవుతుంది. అయితే ప్రభుత్వం ఎప్పుడూ ఇంత పెద్దమొత్తంలో విత్తనాలను రాయితీపై రైతులకు అందించేందుకు శ్రద్ధ చూపలేదు.

వ్యాపారుల దోపిడీ

గత వైసీపీ ప్రభుత్వంలో రాయితీపై రైతులకు వేరుశనగ కాయలను అందించాలని తీసుకున్న నిర్ణయం అమలు కాలేదు. వాస్తవానికి ఏపీ సీడ్స్‌ సంస్థ అధికారులే రైతులకు మూల విత్తనాన్ని (ఫౌండేషన్‌ సీడ్స్‌) అందించి వారికి సరైన సూచనలు ఇచ్చి విత్తనోత్పత్తి చేయించాలి. ఆ విత్తనాలను ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులకు పంపిణీ చేయాల్సి ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆ విధానానికి తూట్లు పొడిచేశారు. కనీసం మార్కెట్‌ యార్డుల్లో రైతులు తెచ్చిన నాణ్యమైన వేరుశనగ కాయలను కొనుగోలు చేసి మళ్లీ రైతులకే ఖరీఫ్‌లో రాయితీపై అందించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉన్నా, ఆ విధానానికీ స్వస్తి చెప్పేశారు. వ్యాపారులైతే తమకు పెద్దమొత్తంలో కమీషన్లు అందిస్తారనే ఉద్దేశంతో వారికే విత్తన సేకరణ అధికారాన్ని కట్టబెట్టారు. ఇది ప్రభుత్వానికి పెద్దఎత్తున భారం కావడమే కాకుండా రైతులకు కూడా ప్రభుత్వం అందించే 40 శాతం సబ్సిడీ వల్ల ఏ మాత్రం ప్రయోజనం కలగలేదు. వ్యాపారులు ఏపీ సీడ్స్‌ క్వింటానికి అందిస్తున్న రూ.9,300లో భారీ ఎత్తున మూటగట్టుకునేందుకు నాసిరకం విత్తనాలను సేకరించే కార్యక్రమాన్ని ప్రస్తుతం చేపడుతున్నారు. కర్నూలు జిల్లాతో పాటు తెలంగాణలోని వనపర్తి, గద్వాల ప్రాంతాల్లో రైతుల నుంచి వేరుశనగ కాయలను క్వింటానికి రూ.6వేల నుంచి రూ.6,500 చెల్లించి నెల కిందటే గోదాముల్లో దాచారు. ప్రస్తుతం ఏపీ సీడ్స్‌ సంస్థ క్వింటం విత్తనానికి రూ.9,300 ధర చెల్లించేందుకు నిర్ణయించడంతో తమ జేబులు నిండినట్లేనని ఆశ పడుతున్నారు. విత్తనాల క్లీనింగ్‌, రైతు సలహా కేంద్రాలకే చేర్చేందుకు రవాణా తదితర ఖర్చులన్నీ కలిపి క్వింటానికి రూ.1000 దాకా ఖర్చు వస్తుందని వారు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం చెల్లించే రూ.9,300 ధరతో పోలిస్తే రవాణా ఖర్చులు రైతులకిచ్చే రూ.6500 పోను తమకు ఒక క్వింటంపై రూ.2వేల దాకా మిగులుతుందని ఆశిస్తున్నారు. ఉమ్మడి జిల్లాకు కేటాయించిన 11,108 క్వింటాళ్ల వేరుశనగ విత్తనాల వల్ల కేవలం ఒక నెలలోనే దాదాపు రూ.2 కోట్లు మిగుల్చుకునే అవకాశం వారికి ఏర్పడింది. రైతులతో కొనుగోలు చేసింటే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి విత్తన సేకరణలో భారం తగ్గడమే కాకుండా రైతులకు మంచి ధర చెల్లించే అవకాశం ఉండేది. కూటమి ప్రభుత్వం తమ నుంచి రాయితీ విత్తనాలు కొనుగోలు చేస్తుందని రైతులు ఎంతగానో ఆశించారు అయితే ఏపీ సీడ్స్‌ సంస్థ రాష్ట్ర అధికారులు తీసుకున్న నిర్ణయం వారిని నిరాశపరిచింది.

రైతుల నుంచి ఎందుకు కొనరు?

గత వైసీపీ ప్రభుత్వం మా పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనీసం ఈ ప్రభుత్వమైనా రాయితీపై అందించే విత్తనాలను మా నుంచే కొంటుందేమో అని ఆశపడ్డాం. నేను ఏపీ సీడ్స్‌ అధికారులకు ఫోన్‌ చేసి వేడుకున్నా. నిబంధనల ప్రకారం రైతుల నుంచి కొనుగోలు చేయడం లేదని సమాధానం ఇచ్చారు. వాస్తవంగా ఏపీ సీడ్స్‌ అధికారులు మాకు మూల విత్తనాన్ని అందించి, మాచేత నాణ్యమైన విత్తనోత్పత్తి చేయించాలి. వాటిని ఆ సంస్థే కొనాలి. ఆ లక్ష్యానికి ఏపీ సీడ్స్‌ సంస్థ ఎప్పుడో నీళ్లొదిలింది. మరో దారి లేక నేను మార్కెట్‌యార్డుకు తీసుకువచ్చి తక్కువ ధరకే వేరుశనగ కాయలను వ్యాపారుల చేతుల్లో పెట్టాను.

- లక్ష్మీనారాయణ, మన్నెకుంట

నిబంధనల ప్రకారమే కొంటున్నాం

నిబంధనల ప్రకారం ప్రభుత్వ ఆదేశాలపై ఆర్గనైజర్ల నుంచి వేరుశనగ విత్తనాలను సేకరిస్తున్నాం. విత్తనాల క్లీనింగ్‌, రవాణా ఖర్చులు మొదలైన వాటిని పరిశీలించి ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఽసేకరణ ధరను నిర్ణయిస్తుంది. ఎవరైనా వ్యాపారులు నాసిరకం విత్తనాలను రైతులకు అంటగట్టే ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటున్నాం.

- ధనలక్ష్మి, ఏపీ సీడ్స్‌ మేనేజర్‌

Updated Date - Jun 05 , 2025 | 11:29 PM