Share News

కందుల కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌

ABN , Publish Date - Dec 14 , 2025 | 11:59 PM

): కందిరైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కేంద్ర సంస్థ నాఫెడ్‌ మద్దతు ధరకు రైతుల నుంచి కందులు సేకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది.

కందుల కొనుగోళ్లకు గ్రీన్‌ సిగ్నల్‌
రైతులు అమ్మకానికి తెచ్చిన కందులు

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): కందిరైతులకు కేంద్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. కేంద్ర సంస్థ నాఫెడ్‌ మద్దతు ధరకు రైతుల నుంచి కందులు సేకరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొద్ది రోజుల్లో కందుల కొనుగోళ్లకు డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా చర్యలు తీసుకునేందుకు మార్క్‌ఫెడ్‌ సంస్థ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే కందులు పండించిన రైతులు తమ వివరాలను గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు కర్నూలు జిల్లా మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌ రాజు తెలిపారు. గత ఖరీ్‌ఫలో ఉమ్మడి జిల్లాలో దాదాపు 3 లక్షల ఎకరాల్లో కంది పంటను రైతులు సాగు చేశారు. కేంద్ర ప్రభుత్వం క్వింటం కందులకు రూ.8వేలు మద్దతు ధరగా ప్రకటించింది. ప్రస్తుతం కర్నూలు మార్కెట్‌ యార్డులో రూ.6,500 నుంచి రూ.7వేలు మాత్రమే వ్యాపారస్థులు రైతులకు చెల్లిస్తున్నారు. మరో వైపు తేమ పేరుతో 2 నుంచి 4 కిలోలు తరుగు కింద తీస్తుండటంతో రైతులు కొనుగోలు కేంద్రాలు ఎప్పడు చేస్తారోనని మార్క్‌ఫెడ్‌ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

కందుల కొనుగోలుకు ఏర్పాట్లు చేస్తున్నాం

కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ మద్దతు ధరకు రైతుల నుంచి కందుల కొనుగోలు చేపట్టాలని అనుమతి ఇచ్చింది. కొనుగోళ్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే విధి విధానాలు జారీ చేసే అవకాశం ఉంది. డీసీఎంఎస్‌ కేంద్రాల ద్వారా కందులను కొనుగోలు చేసేందుకు చర్యలు చేపడతాం. రెండు, మూడు రోజుల్లో గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో కందులు పండించిన రైతులు తమ వివరాలను నమోదు చేసుకునేందుకు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. రైతులు త్వరపడి వ్యాపారస్థులకు తక్కువ ధరకే కందులను అమ్ముకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.

- రాజు, మార్క్‌ఫెడ్‌ మేనేజర్‌

Updated Date - Dec 14 , 2025 | 11:59 PM