హంద్రీనీవా విస్తరణకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:23 PM
హంద్రీనీవా కాలువను 6,300 క్యూసెక్కుల విస్తరణకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారు.
6,300 క్యూసెక్కులకు విస్తరించేందుకు ఉత్తర్వులు
వైసీపీ హయాంలో టెండర్లతో సరి
ప్రస్తుతం 3,850 క్యూసెక్కులకు పనులు పూర్తి
కృష్ణా జలాలు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
నాటి పనులు కొనసాగించేలా ఉత్తర్వులు జారీ
రూ.7,797.96 కోట్లతో మరో ఏడు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్
కర్నూలు, జూలై 18 (ఆంధ్రజ్యోతి): హంద్రీనీవా కాలువను 6,300 క్యూసెక్కుల విస్తరణకు వైసీపీ హయాంలో టెండర్లు పిలిచారు. తక్కువ సమయంలో ఎక్కువ కృష్ణా వరద జలాలు సీమ జిల్లాలకు మళ్లిస్తామంటూ మాయమాటలతో మభ్యపెట్టారు. అదిగో ఇదిగో అంటూ ఐదేళ్లు గంపెడు మట్టి తీయకుండానే రైతులను మాయ చేశారు. చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ విస్తరణ పనులకు మోక్షం వచ్చింది. 120 రోజుల్లో 3,850 క్యూసెక్కులకు విస్తరణ పనులు 90 శాతానికి పైగా పూర్తి చేసి రికార్డు నెలకొల్పారు. గురువారం సీఎం చంద్రబాబు జలహారతి ఇచ్చి హంద్రీనీవా కాలువకు కృష్ణా జలాలు విడుదల చేసిన నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు అడుగు ముందుకేశారు. గత ప్రభుత్వంలో టెండర్లతో ఆపేసిన 6,300 క్యూసెక్కుల సామర్థ్యానికి విస్తరణ పనులు కొనసాగించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తూ శుక్రవారం జలవనరుల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరి జి.సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే కాలువను విస్తరిస్తారా..? లైనింగ్ చేస్తారా..? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వీటితో పాటు ఉమ్మడి జిల్లాలో మరో రూ.7,797.96 కోట్లతో చేపట్టే మరో ఏడు ప్రాజెక్టులను కొనసాగించేందుకు జీవో ఎంఎస్ నంబరు.44 జారీ చేశారు. అసంపూర్తిగా వదిలేసిన పత్తికొండ (పందికోన) కుడి, ఎడమ కాలువలు, వేదావతి ప్రాజెక్టుపై దృష్టి సారించాలని ఇంజనీర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
హంద్రీనీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం ప్రధాన లక్ష్యం శ్రీశైలం ఎగునవ 40 టీఎంసీలు ఎత్తిపోసి ఉమ్మడి కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలన్నది పాలకుల లక్ష్యం. తొలి దశ (ఫేజ్-1)లో మల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కి.మీలు ప్రధాన కాలువ, 8 ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. హైడ్రాలికల్ గణాంకాల ప్రకారం 3,850 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా మెయిన్ కెనాల్ బెడ్ విడ్త్ (కాలువ అడుగు భాగం వెడల్పు) 9.5 మీటర్లు నిర్మించారు. లైనింగ్ చేస్తే 12 పంపుల ద్వారా 3,850 క్యూసెక్కులు (ఒక్కో పంపు 330 క్యూసెక్కులు) లిఫ్ట్ చేసేలా డిజైన్ చేస్తే, 5-6 పంపుల ద్వారా 1,940 క్యూసెక్కులకు మించి ఎత్తిపోసుకోలేని పరిస్థితి ఉంది. గత టీడీపీ ప్రభుత్వంలో 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి రూ.1,030 కోట్లతో విస్తరణ పనులు చేపట్టింది. ఆ తరువాత వైసీపీ ప్రభుత్వం పనులు ఆపేసింది. 6,300 క్యూసెక్కులకు విస్తరిస్తాం..! అంటూ ఆర్భాటం చేసి రూ.6,182.19 కోట్లతో టెండర్లు పిలిచారు. గంపెడు మట్టి కూడా తీయకుండానే ఐదేళ్లు గడిచిపోయాయి. పైగా అసంపూర్తిగా ఉన్న పత్తికొండ (పందికోన) రిజర్వాయర్ కుడి, ఎడమ కాలువలు, పంట కాలువలు పూర్తి చేస్తే 65 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపినా పైసా ఇవ్వలేదు.
నాటి టెండర్లు కొనసాగించేలా ఉత్తర్వులు
సీఎం చంద్రబాబు సారథ్యంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ హంద్రీనీవా కాలువ విస్తరణ పనులపై దృష్టి పెట్టింది. మల్యాల వద్ద 0/0 నుంచి 400.50 కి.మీలు కుప్పం వరకు ప్రధాన కాలువ విస్తరణ, కుప్పం, పుంగనూరు బ్రాంచి కెనాల్స్ లైనింగ్‌కు రూ.1,970 కోట్లతో శ్రీకారం చుట్టారు. 120 రోజుల్లో 1.75 కోట్లు క్యూబిక్ మీటర్లు మట్టి పనులు, 45 లక్షల స్క్వేయర్ మీటర్లు సీసీ లైనింగ్, షాట్‌క్రెటింగ్ పనులు పూర్తి చేసి ఇంజనీరింగ్ చరిత్రలో రికార్డు నెలకొల్పారు. అయితే సీమ జిల్లాల్లో 60 టీఎంసీల నీటి అవసరాలు ఉండడంతో, గత ప్రభుత్వం హయాంలో 6,300 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా టెండర్లు పూర్తి చేసిన విస్తరణ పనులు కొనసాగించేందుకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
నందికొట్కూరు మండలం మల్యాల పంపింగ్ స్టేషన్ అప్రోచ్ ఛానల్ 4.806 కిలోమీటర్లు, 0/00 నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి వరకు 216.300 కి.మీల వరకు ప్రధాన కాలువ విస్తరణ, 8 పంపింగ్ స్టేషన్ల దగ్గర అదనంగా 2,450 క్యూసెక్కులు ఎత్తిపోసేందుకు అదనపు పంపులు ఏర్పాటుకు రూ.6,182.19 కోట్ల మంజూరు చేస్తూ 2021 సెప్టెంబరు 15న అప్పటి వైసీపీ రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక అనుమతులు ఇచ్చింది.
ప్యాకేజీ-1 కింద రూ.3,278.18 కోట్లతో చేపట్టిన అప్రోచ్ ఛానల్ 4.806 కి.మీలు, 0/00 నుంచి 88.000 కి.మీల వరకు కాలువ విస్తరణ, పిఎస్ -1 నుంచి 5 వరకు పంపింగ్ స్టేషన్ల దగ్గర అదనపు పంపులు ఏర్పాటు పనులు రూ.2,484 కోట్లకు చేస్తామని హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ర్ఫాస్ట్రక్షర్ లిమిటెడ్ కంపెనీ ఒప్పందం చేసుకుంది.
ప్యాకేజీ-2 కింద రూ.2,904.01 కోట్లతో చేపట్టే 88.000 కి.మీల నుంచి 216.300 కి.మీల వరకు ప్రధాన కాలువ విస్తరణ, పీఎస్-6 నుంచి 8 (3 లిప్టులు) వద్ద అదనపు పంపులు ఏర్పాటు పనులు రూ.2,163.15 కోట్లకు చేస్తామని హైదరాబాదుకు చెందిన డీఎస్‌ఆర్ - వీపీఆర్ జాయింట్ వెంచర్‌గా పనులు దక్కించుకుని 2021 డిసెంబరు 31న ఒప్పందం చేసుకున్నారు. ఏమాత్రం పనులు చేపట్టలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక వీటిని రద్దు చేసింది. అయితే రాయలసీమ జిల్లాల్లో సాగు, తాగునీటికి 60 టీఎంసీలకు పైగా అవసరాలు ఉండడంతో ఈ పనులు కొనసాగించేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ఆ.. ప్రాజెక్టులపై ఫోకస్ పెట్టండి
ఉమ్మడి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి సాగునీరు అందించే వేదవతి ఎత్తిపోత పథకం ప్రాజెక్టును తక్షణం చేపట్టి ప్రతిష్టాత్మకంగా పూర్తి చేయాలి. అలాగే హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా 75-80 శాతం పూర్తి చేసి పిల్ల కాలువలు అసంపూర్తిగా వదిలేసిన పత్తికొండ (పందికోన) జలాశయం కుడి, ఎడమ కాలువల డిస్ట్రిబ్యూటరీలు, పిల్ల కాలువలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు ఇంజనీర్లకు దిశానిర్దేశం చేశారు. గురువారం మల్యాల వద్ద ప్రత్యేక బస్సులో సీఈలు నాగరాజు, కబీర్‌బాషా, ఎస్‌ఈలు పాండురంగయ్య, బాలచంద్రారెడ్డి, ఈఈ ప్రసాద్‌రావు సహా పలువురు ఇంజనీర్లతో సమీక్షించారు. విస్తరణ పనులు శరవేగంగా పూర్తి చేసిన హంద్రీనీవా ప్రాజెక్టు సీఈ నాగరాజు, ఎస్‌ఈ పాండురంగయ్య సహా ఇంజనీర్లను అభినందించారు. అదే క్రమంలో ప్రథమ ప్రాధాన్యతగా పందికోన కుడి, ఎడమ కాలువలు, వేదవతి ప్రాజెక్టులు చేపట్టి పూర్తి చేయాలని లక్ష్యాలు నిర్ధేశించారు.
కొనసాగింపు ఉత్తర్వులు జారీ చేసిన ప్రాజెక్టుల వివరాలు (రూ.కోట్లల్లో)
ప్రాజెక్టు నిధులు కాంట్రాక్ట్ సంస్థ
గోరుకల్లు (జీబీఆర్) వద్ద 36.90 ఆర్‌ఆర్ ఎడిఫీసే
అదనపు రెగ్యూలేటర్ ప్రైవేట్ లిమిటెడ్
శ్రీశైలం ప్రాజెక్టు 12 క్రస్ట్‌గేట్లు 1.59 ఎస్‌వీ
ప్రత్యేక మరమ్మతులు ఇంజనీరింగ్ సంస్థ
శ్రీశైలం డ్యాం వద్ద 1,000 1.00 ఆర్. పాండురంగం ్థ
కేవీఏ విద్యుత్ ట్రాన్స్‌ఫారం అండ్ సన్స్ సంస
టీజీపీ సర్కిల్, ఎస్‌ఆర్‌బీసీ 5.25 కాంట్రాక్టర్
సర్కిల్ కార్యాలయ భవనాలు కానాల గోపాల్‌రెడ్డి
వేదావతి ఎత్తిపోతల 1,942.80 మెఘా ఇంజనీరింగ్
పథకం ప్రాజెక్టు అండ్ ఇన్ర్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్
ఆర్డీఎస్ కుడి కాలువ ప్రాజెక్టు 1,985.42 ఎస్‌సీసీ లిమిటెడ్ సంస్థ
రాయలసీమ ఎత్తిపోతల పథకం 3,825 ఎస్‌పీఎంఎల్-ఎన్‌సీసీ-మెఘా
ఇంజనీరింగ్ అండ్
ఇన్ర్ఫాస్ట్రక్చర్స్ లిమిటెడ్
మొత్తం 7,797.96