పత్తి కొనుగోలుకు గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Oct 28 , 2025 | 11:50 PM
రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 5.40 లక్షల ఎకరాల్లో కర్నూలు జిల్లాలో సాగైన పత్తి పంట రైతుల చేతికి వచ్చింది.
సీసీఐ ఆధ్వర్యంలో జిల్లాలో 20 కేంద్రాలు
ఏర్పాట్లన్నీ పూర్తి
కర్నూలు అగ్రికల్చర్, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోనే అత్యధికంగా దాదాపు 5.40 లక్షల ఎకరాల్లో కర్నూలు జిల్లాలో సాగైన పత్తి పంట రైతుల చేతికి వచ్చింది. ఈ పంటను ఎప్పుడెప్పుడు సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకునేందుకు రైతులు ఎదురు చూస్తున్నారు. కేంద్రం కింటానికి రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. వర్షాలు, తుఫాన్ల నేపథ్యంలో పత్తిని అమ్ముకునేందుకు రైతులు పడుతున్న కష్టాలను గుర్తించిన కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు పత్తి కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని మంగళవారం మార్కెటింగ్ శాఖకు ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రం మొత్తం మీద సీసీఐ ఆధ్వర్యంలో 30 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తే ఒక్క కర్నూలు జిల్లాలోనే 20 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం విశేషం. కర్నూలు జిల్లాలో 5.40 లక్షల ఎకరాలో ఖరీఫ్ సీజన్‌లో సాగు చేశారు. ఒక ఎకరాలో 8 నుంచి 10 క్వింటళ్ల పత్తి దిగుబడి వస్తుందని, వ్యవసాయ శాఖ యంత్రాంగం అంచనా వేసింది. ఈ లెక్కన 5.40లక్షల టన్నుల పత్తి దిగుబడి రైతుల చేతికి అందే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు. గత రెండు నెలల నుంచి రైతులు సీసీఐ కొనుగోలు కేంద్రాల కోసం కళ్లలో ఒత్తులు పెట్టుకుని ఎదురు చూశారు. ఎట్టకేలకు ప్రభుత్వం రైతుల కష్టాలను గుర్తించి బుధవారం నుంచి పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు పూర్తి చేసింది. కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి, జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్, ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరులోని పెంచికలపాడులో ఏర్పాటు చేసిన 20 పత్తి కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. వ్యవసాయ మార్కెటింగ్, సీసీఐ అధికారులు సమన్వయం చేసుకుని రైతుల నుంచి ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనుగోలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో పత్తి కొనుగోళ్లు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలోని 15 మార్కెట్ కమిటీల చైర్మన్లు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు జిల్లా అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది.