జోరుగా శనగ సాగు
ABN , Publish Date - Nov 14 , 2025 | 12:30 AM
జిల్లాలోని పలు ప్రాంతాలలో శనగ సాగు జోరుగా సాగుతోంది. మొంథా తుఫాన్ అనంతరం వానలు కాస్త తగ్గడంతో పొలాలు ఇప్పుడిప్పుడే తడి ఆరుతున్నాయి
తున్నా
శనగ వైపే మొగ్గు
ఫ జిల్లా సాధారణ సాగు
1.50 లక్షల ఎకరాలు
ఫ గత ఏడాది
1.30 లక్షల ఎకరాల్లో సాగు
ఫ ఈ ఏడాది 1.40 లక్షల ఎకరాల్లో
సాగు చేస్తారని అంచనా
కొలిమిగుండ్ల మండలంలో సాగవుతున్న శనగ పంట
కొలిమిగుండ్ల, నవంబరు 13 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని పలు ప్రాంతాలలో శనగ సాగు జోరుగా సాగుతోంది. మొంథా తుఫాన్ అనంతరం వానలు కాస్త తగ్గడంతో పొలాలు ఇప్పుడిప్పుడే తడి ఆరుతున్నాయి. రైతులు శనగ సాగు చేయడానికి సిద్ధమయ్యారు. అదను దాటుతున్నా అధిక సంఖ్యలో రైతులు పప్పు శనగ సాగు వైపే మొగ్గు చూపుతున్నారు. కొలిమిగుండ్ల మండలంలోని వివిధ గ్రామాలతో పాటు, కోవెలకుంట్ల, సంజామల, బనగానపల్లె, అవుకు తదితర ప్రాంతాలతో పాటు జిల్లా వ్యాప్తంగా రైతులు శనగ సాగును ఆరంభించారు. జిల్లాలో శనగ సాధారణ సాగు విస్తీర్ణం 1.50 లక్షల ఎకరాలు కాగా, గత ఏడాది 1.30 లక్షల ఎకరాల్లో అన్నదాతలు శనగ సాగు చేశారు. అయితే ఈ ఏడాది శనగ సాగు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. సుమారు 1.40 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. అయితే భారీ వర్షాలు మొంథా తుఫాన్ ప్రభావంతో శనగ సాగు భారీగా తగ్గే అవకాశం ఉందని రైతులు పేర్కొంటున్నారు. రబీ శనగ సాగుకు 15వ తేదీతో గడువు ముగుస్తుంది. అయినా రైతులు శనగ సాగు చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. గత నాలుగు రోజులుగా తడి ఆరిన పొలాల్లో విస్తారంగా శనగ సాగు చేస్తున్నారు. దీంతో ఎక్కడ చూసినా పొలాల్లో అన్నదాతల కోలాహలం కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా జిల్లాలో ముఖ్యంగా కోవెలకుంట్ల వ్యవసాయ సబ్ డివిజన్‌లో రబీలో శనగ సాగుపైనే ఆసక్తి పెంచుకున్నారు.
ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించండి
సాగు గడువు ముగుస్తున్నందు వల్ల రైతులు శనగకు ప్రత్యామ్నాయంగా ఇతర పంటల వైపు మొగ్గడం మంచిదని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. తకువ ఖర్చుతో ఇతర పంటలు సాగు చేయడానికి అవకాశం ఉందని అంటున్నారు.
అదను దాటు ఆరుతడి పంటలు సాగు చేయండి
రైతులు ఆరుతడి పంటలు సాగు చేయడం మంచిది. కొర్ర, కుసుమ, మినుము లాంటి పంటలు సాగు చేస్తే పెట్టుబడి తగ్గడంతో పాటు, మంచి లాభాలు అర్జించవచ్చు.
- శారదాదేవి, వ్యవసాయ అధికారి
10 ఎకరాల్లో శనగ సాగు చేస్తున్నాను
చాలా ఏళ్లుగా రబీలో శనగ పంటనే సాగు చేస్తున్నాను. వేరే పంట అలవాటు లేదు. ఈసారి పదెకరాల్లో శనగ సాగు చేస్తున్నాను. -రాజేశ్వరరెడ్డి, రైతు నందిపాడు