గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టు దేశానికే ఆదర్శం
ABN , Publish Date - Nov 17 , 2025 | 11:38 PM
కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టు భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు.
గ్రీన్ పవర్ నిల్వలో పీఎస్పీలదే కీలక పాత్ర
దేశ వ్యాప్తంగా 224 జీడబ్ల్యూ పీఎస్పీ సామర్థ్యం గుర్తింపు
కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టర్
ఓర్వకల్లు, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని గ్రీన్ కో రెన్యువబుల్ ఎనర్జీ పవర్ ప్రాజెక్టు భవిష్యత్తులో దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని కేంద్ర విద్యుత్, గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు. సోమవారం మండల పరిధిలోని గుమ్మితం తండా సమీపంలో ఉన్న గ్రీన్ కో పవర్ ప్రాజెక్టు పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా పవర్ ప్రాజెక్టు ప్రాంగణంలో పార్లమెంటు సభ్యుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసింది. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై దృష్టి సారించిన ఈ సమావేశానికి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అధ్యక్షత వహించారు. విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్, లోక్ సభ, రాజ్య సభ నుంచి విద్యుత్ , మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యులు, కేంద్ర విద్యుత్ అథారిటీ సీఈఏ, సీపీఎ్‌సయూల నుంచి సీనియర్ అధికారులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా సభ్యులను ఉద్దేశించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ సౌర శక్తి లేని సమయాల్లో మిగులు గ్రీన్ పవర్‌ను నిల్వ చేయడం, విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం ద్వారా పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు(పీఎస్పీ)లు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పీఎస్పీ జలాశయాల నుంచి బాష్పీభవన నష్టాల సమస్యలపై ఆచరణీయ పరిష్కారంగా తేలియాడే సౌర విద్యుత్ ప్రాజెక్టులను అమలు చేయాలని మంత్రి సూచించారు. సకాలంలో స్థల కేటాయింపు, నీటి కేటాయింపు వేగవంతమైన అనుమతుల ద్వారా పీఎస్పీ అభివృద్ధిని సులభతరం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వాల కీలక పాత్రను ఆయన నొక్కి చెప్పారు. పీఎస్పీల అభివృద్ధిని వేగవంతం చేయడానికి గ్రీన్ ఎనర్జీ సెస్, నీటి పన్ను, రిజర్వాయరు లీజు, ఫీజులు వంటి చార్జీలను ఉపసంహరించుకోవడం గురించి రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించాలని ఆయన కమిటీ సభ్యులను కోరారు. దేశవ్యాప్తంగా దాదాపు 224 జీడబ్ల్యూ పీఎస్పీ సామర్థాన్ని గుర్తించినట్లు కమిటీ సభ్యులకు సమాచారం అందిందని తెలిపారు. వీటిలో దాదాపు 7 జీడబ్ల్యూ మొత్తం సామర్థ్యం కలిగిన పది పీఎస్పీలు ప్రారంభించినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యెస్సో నాయక్ కమిటీ సభ్యులతో మాట్లాడుతూ 2025-26లో 1680 మెగావాట్ల పిన్నాపురం పీఎస్పీలోని ఎనిమిది యూనిట్లను 500 మెగావాట్ల టెహ్రీ పీఎస్పీతో పాటు విజయవంతంగా ప్రారంభించడం గొప్ప విజయమని ఆయన కొనియాడారు. కేంద్ర మంత్రి వెంట గ్రీన్ కో గ్రూప్ సీఈవో, ఎండీ చలమశెట్టి అనిల్, గ్రీన్ కో ప్రాజెక్టు డెరెక్టర్ శ్రీనివాసులు, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసనాయుడు ఆయా శాఖల అధికారులు ఉన్నారు.