Share News

మహా మోసం

ABN , Publish Date - Nov 20 , 2025 | 11:35 PM

రేయనక..పగలనకా నాలుగు నెలలు కష్టపడి పండించిన పత్తిపంటను మహారాష్ట్ర వ్యాపారులు దోచుకుంటున్నారు.

మహా మోసం
తక్కెడ ద్వారా పత్తిని తూకం వేస్తున్న దృశ్యం

పత్తి రైతులను మోసగిస్తున్న మహారాష్ట్ర వ్యాపారులు

నిబంధనలకు విరుద్ధంగా ఇళ్ల వద్ద తూకాలు

క్వింటాకు 20 కిలోల కోత

అధిక ధర ఆశ చూపి అన్యాయం

ఆదోని, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రేయనక..పగలనకా నాలుగు నెలలు కష్టపడి పండించిన పత్తిపంటను మహారాష్ట్ర వ్యాపారులు దోచుకుంటున్నారు. అధికధర ఆశచూపిస్తూ ఇళ్లవద్దే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. తక్కెడ వాళ్లవే.. తూకం రాళ్లూ వాళ్లవే.. ఇంకేముంది కిలోల కొద్ది తక్కువ తూకాలతో రైతులను నిండా ముంచేస్తున్నారు. అడ్డగోలుగా తూకాలు వేస్తూ పత్తి రైతులను ఏమార్చుతూ మోసగిస్తున్నారు. ప్రస్తుతం ఆదోని మార్కెట్‌లో మంచి నాణ్యత గల పత్తి క్వింటా రూ.7,330 వరకు గరిష్ఠ ధర పలుకుతోంది. అయితే మహారాష్టకు చెందిన వ్యాపారస్తులు రంగంలోకి దిగి పత్తి నాణ్యత (క్వాలిటీ)తో సంబంధం లేకుండా కేవలం రూ.7,300 చొప్పున ధర ప్రకటించి రైతులను ఆకర్షిస్తున్నారు. ఆదోని మార్కెట్‌లో లభించే గరిష్ఠ ధరకు దగ్గరగా ఈ రేటు ఉండడంతో రైతులు తమ దిగుబడులను మార్కెట్‌కు కాకుండా నేరుగా మహారాష్ట్ర వ్యాపారులకే అమ్ముకుంటున్నారు. మార్కెట్‌కు వెళ్లకుండా రవాణా ఖర్చులు కలసివస్తాయని రైతుల ఆశ. అయితే ఈ ఆశనే వ్యాపారులు గుర్తించి పత్తికొనుగోలు చేసే సమయంలో తూకాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఎలకా్ట్రనిక్‌ కాటాలకు బదులు తక్కెడలను వినియోగిస్తున్నారు. నిజానికి తూనికలు కొలతల శాఖ ఆదేశాల మేరకు భారీ మొత్తంలో జరిగే కొనుగోళ్లకు ఎలక్ర్టానిక్‌ కాటాలు మాత్రమే వాడాలి. ఎలక్ర్టానిక్‌ కాటాల్లో మోసం చేయడానికి అవకాశం ఉండదు. కానీ మహారాష్ట్రకు చెందిన వ్యాపారులు మాత్రం ఈ ఆదేశాలను బేఖాతరు చేస్తూ పాత తక్కెడ తూకాలను ఉపయోగిస్తున్నారు.

క్వింటాకు రూ.20 కిలోల వరకు మోసం

కౌతాళం, ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు, హొళగుంద మండలాల చుట్టుపక్కల గ్రామాలకు లారీలను తీసుకెళ్లి రైతుల ఇళ్ల వద్దనే పత్తిని కొనుగోలు చేస్తున్నారు. 10 క్వింటాళ్ల పత్తి పైబడి ఉన్న రైతుల వద్దకే వెళ్లి వారు కొనుగోలు చేస్తారు. తూకం వేసేటప్పుడు ఒకవైపు 50 కిలోల రాళ్లు, మరోవైపు పెద్ద సంచిని (డంప్‌ బ్యాగ్‌) వేలాడదీస్తారు. మోసపూరిత పద్ధతుల ద్వారా పత్తి తూకంలో క్వింటాకు 10 నుంచి 20 కిలోల వరకు మోసం చేస్తున్నట్లు తెలుస్తోంది. క్వింటా సగటు ధర రూ.7300 అనుకుంటే ఒక క్వింటా మోసానికి పది నుంచి 20 కేజీల వరకు నష్టం ఉంటుంది. మొత్తంమీద 10 క్వింటాళ్లకు అమ్మితే రెండు క్వింటాళ్ల వరకు నష్టం జరుగుతుంది. రైతుకు దాదాపు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు నష్టం ఉంటుంది. ఈ వ్యాపారస్తులంతా మార్కెట్‌ యార్డు పరిధిలో కాకుండా నేరుగా రైతుల వద్ద కొనుగోలు చేసి రాత్రికి రాత్రే లారీల్లో పత్తిని మహారాష్ట్రకు తరలిస్తున్నారు. దీంతో మార్కెట్‌యార్డుకు చెల్లించాల్సిన సెస్సు (పన్ను) ప్రభుత్వానికి అందకుండా పోతోంది. రోజుకు సగటున 8 నుంచి 10 లారీల్లో పత్తి తరలిపోతుండగా ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల్లో గండి పడుతోంది. పది రోజుల నుంచి ఈ దోపిడీ ముమ్మరంగా జరుగుతున్నా మార్కెట్‌యార్డు అధికారులు, తూనికలు కొలతల శాఖ అధికారులు స్పందించడం లేదు.

Updated Date - Nov 20 , 2025 | 11:35 PM