ఎర్రమట్టి మాఫియా
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:02 AM
మట్టి మాఫియా జర్నలిస్టుల స్థలాలను కూడా వదలడం లేదు. యథేచ్ఛగా టిప్పర ్లతో మట్టిని తరలిస్తూ దోచుకుంటున్నారు.
జర్నలిస్టుల స్థలాల్లో గరుసు అక్రమ తవ్వకాలు
కర్నూలు, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): మట్టి మాఫియా జర్నలిస్టుల స్థలాలను కూడా వదలడం లేదు. యథేచ్ఛగా టిప్పర ్లతో మట్టిని తరలిస్తూ దోచుకుంటున్నారు. జిల్లా జర్నలిస్టు మ్యూచువల్ ఏయిడెడ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సోసైటీ ఆధ్వర్యం లో ఇళ్ల స్థలాల కోసం విన్నవింగా 2009లో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం దిన్నెదేవరపాడు రెవెన్యూ గ్రామం జగన్నాథగట్టుపై సర్వే నెం.478లో 15.44 ఎకరాలను కేటాయిం చింది. ప్రభుత్వం నిర్ణయించిన ధర ఎకరం రూ.4.21 లక్షలు చొప్పున రూ.65 లక్షలు చెల్లించి జర్నలిస్టులు కొనుగోలు చేశారు.
ఒక్కో జర్నలిస్టుకు 167 చదరపు గజాల చొప్పున 254 మంది పాత్రికేయులకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. అయితే కొండ ప్రాంతం కావడం, రహదారి, తాగునీరు, విద్యుత్ సౌకర్యాలు లేకపోవడంతో ఎవరూ ఇళ్లు నిర్మించు కోలేదు. ఏనాటికైనా సొంతిళ్లు నిర్మించుకోవచ్చనే ఆశతో జర్నలిస్టులు అప్పులు చేసి డబ్బు చెల్లించారు. ప్రభుత్వం ఆర్‌ఎల్‌పీ/ఐపీఎల్‌పీ నెం.ఐఎల్‌పీ/2020/డీటీసీపీ-కుడా/ ఐఎన్‌ఎన్/000085 కింద వెంచర్‌కు అప్రూవల్ ఇచ్చింది. గత వైసీపీ హయాంలో జర్నలిస్టుల స్థలాల్లో ఎర్రమట్టి మాఫియా తవ్వకాలు చేయగా, పాత్రికేయులు అడ్డుకున్నారు. నాడు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ నాయకులు కూడా అక్రమ తవ్వకాలను పరిశీలించారు. పాదయాత్రలో భాగంగా జిల్లాకు వచ్చిన నారా లోకేశ్ దృష్టికి సమస్యను ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో జర్నలిస్టులు నాయకులు తీసుకెళ్లారు. టీడీపీ ప్రభుత్వం రాగానే ఇళ్ల స్థలాల్లో అప్రోచ్ రోడ్డు సహా మౌళిక వసతులు కల్పిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు.
టీడీపీ హయాంలోనూ రెచ్చిపోతున్న మాఫియా..
టీడీపీ ప్రభుత్వం వచ్చినా ఎర్రమట్టి మాఫియా ఆగడాలు ఆగిపోలేదు. యథేచ్ఛగా జర్నలిస్టుల ఇళ్ల స్థలాల్లో అక్రమ తవ్వకాలు మొదలు పెట్టింది. ఇక్కడ నాణ్యమైన ఎర్రమట్టి ఉండటంతో నిఘా కళ్లకు గంతలు కట్టి అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు. నెల రోజులుగా గరుసును తరలిస్టున్నట్లు స్థానికులు తెలిపారు. ఇక్కడికి టిప్పర్లు, ఎక్స్‌కవేటర్లు వెళ్లేందుకు ఏకంగా కొండనే చదును చేసి రహదారి ఏర్పాటు చేసుకున్నారు. అక్రమ తవ్వకాల విషయం తెలుసుకున్న ఐజేయూ జాతీయ సమితి సభ్యులు ఎన్‌వీ సుబ్బయ్య, కె.నాగరాజు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు గోరంట్ల కొండప్ప, రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈఎన్ రాజు, శ్రీనివాసుల గౌడ్, నాయకులు శ్రీకాంత్, ఉశేని మంగళవారం స్థలాలను పరిశీలించారు. సోమవారం రాత్రి తవ్వకాలు చేసి గరును తరలించినట్లు టిప్పర్ చక్రాల గుర్తులు కనిపిస్తుండటంతో నిరసన తెలిపారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి, జర్నలిస్టుల స్థలాలలకు అప్రోచ్, ఇంటర్నల్ రహదారులు నిర్మించాలని, తాగునీరు, విద్యుత్ వసతులు కల్పిస్తే ఇళ్లు నిర్మించుకుంటామన్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించాలని జర్నలిస్టు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.