వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:17 PM
: శ్రావణమాసంలో విచ్చేసే వరలక్ష్మీ వేడుకను శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని మహిళా భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
కర్నూలు కల్చరల్, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసంలో విచ్చేసే వరలక్ష్మీ వేడుకను శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని మహిళా భక్తులు అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. కొలిచే వారికి కొంగు బంగారంగా.. తమ కోరికలు తీర్చే ఇలవేల్పుగా మహాలక్ష్మి అమ్మవారిని స్తుతిస్తూ విశేష పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు, అభిషేక కార్యక్రమాలు, అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. మహిళలు తమ గృహాలకు సమీపంగా ఉన్న ఆలయాలకు వెళ్లి ఈ ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వరలక్ష్మీ వ్రతం సందడి శుక్రవారం బాగా కానవచ్చింది. మహిళలు వేకువజామున్నే ఇళ్లను, పూజా గదులను శోభాయమానంగా పూలతో అలంకరించారు. పూజా మందిరాల్లో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పిండి వంటలతో నైవేద్యాలు సమర్పించారు. అపార్ట్‌మెంట్లు, బహుళ గృహ సముదాయాల్లో మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాల్లో పాల్గొని ముత్తయిదువులకు వాయినాలు అందజేశారు. శ్రీశైల క్షేత్రంలో వరలక్ష్మీ వ్రతాన్ని వైభవంగా నిర్వహించారు.