Share News

ధాన్యం దళారులపాలు!

ABN , Publish Date - May 11 , 2025 | 11:31 PM

దశాబ్దం కాలంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ధాన్యం పండిస్తున్న రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు.

ధాన్యం దళారులపాలు!
కర్నూలు మార్కెట్‌ యార్డులో నామమాత్రంగా ధాన్యం కొనుగోలు

కర్నూలు మార్కెట్‌ యార్డులో వారిదే హవా

అవగాహన లేక నష్టపోతున్న రైతులు

మార్కెట్‌ సెస్సుకూ నష్టమే

కర్నూలు అగ్రికల్చర్‌, మే 11 (ఆంధ్రజ్యోతి): దశాబ్దం కాలంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో ధాన్యం పండిస్తున్న రైతులు నిలువుదోపిడీకి గురవుతున్నారు. ఓ వైపు వ్యాపారులు, మరో వైపు దళారులు సిండికేట్‌గా మారి రైతులు పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అంతటితో ఆగక రైతులకు డబ్బులు కూడా ఇవ్వకుండా ముప్పుతిప్పలు పెడుతున్నారు. కొంత మంది వ్యాపారులు రైతుల నుంచి కొన్న ధాన్యాన్ని తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు రాత్రిపూట ఎగుమతి చేస్తూ మార్కెటింగ్‌ శాఖకు చెల్లించాల్సిన సెస్సును కూడా ఎగ్గొడుతున్నారు. వీటన్నింటికీ చెక్‌ పెట్టే దిశగా కర్నూలు మార్కెట్‌ యార్డులో మార్చి నెలలో కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి, అసిస్టెంట్‌ సెక్రటరీ వెంకటేశ్వర్లు, సూపర్‌వైజర్లు కేశవరెడ్డి, శివన్న, నాగేష్‌ తదితర ఉద్యోగులు ప్రజాప్రతినిధులను మార్కెటింగ్‌ శాఖ ఉన్నతాధికారులకు నచ్చజెప్పి యార్డులో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించారు. అయితే కర్నూలు మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించినా రైతులు ఇక్కడకి రాకుండా తమ మిల్లులకే వచ్చేలా రైతులను కట్టడి చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో వ్యాపారులను దళారులను కట్టడి చేసి రైతులు ధాన్యాన్ని కర్నూలు యార్డుకు తీసుకువచ్చేందుకు అధికారులు చిత్తశుద్ధితో కర్నూలు మార్కెట్‌ కమిటీ యంత్రాంగానికి సహకరించడం లేదనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి.

ఏటా 2 లక్షల ఎకరాల్లో వరి సాగు

ఉమ్మడి కర్నూలు జిల్లాలో కృష్ణ, తుంగభద్ర నదుల ఆధారంగా సుంకేసుల రిజర్వాయరుతో పాటు కేసీ కెనాల్‌, ఎస్సార్బీసీ, తెలుగుగంగ, సిద్దాపురం ఎత్తిపోతల పథకాలతో పాటు చెరువుల ద్వారా ఉమ్మడి కర్నూలు జిల్లాలో దాదాపు 2లక్షల ఎకరాల్లో ఖరీఫ్‌, రబీ సీజన్లలో రైతులు వరి పంటను సాగు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఈ పంటనంతా రైతులు, వ్యాపారులు దళారుల చేతుల్లో పోసి వారు అం దించే నామమాత్రపు ధరను మాత్రమే పొందుతూ నష్టపోతు న్నారు. ఈ క్రమంలో అక్రమార్కులు ఇచ్చే మామూళ్లకు కొందరు అధికారులు తలొగ్గి రైతులకు నష్టాలను కలిగిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ధాన్యం కొనుగోళ్లను పెంచేందుకు చర్యలు తీసుకోవాలంటూ సర్వత్రా డిమాండ్లు వ్యక్తమవు తున్నాయి. కలెక్టర్‌ ఈవిషయంలో జోక్యం చేసుకుని రెవెన్యూ, పోలీసు, సివిల్‌ సప్లయ్‌, మార్కెటింగ్‌ శాఖ యంత్రాంగాలను సమన్వయం చేసి వ్యాపారులు తప్పనిసరిగా కర్నూలు మార్కెట్‌ యార్డులో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేపట్టేలా చేయాల్సిన అవసరం నెలకొంది. కర్నూలు యార్డులో ధాన్యం కొనుగోళ్లు పూర్తి స్థాయిలో చేపడితే.. రైతులకు గిట్టుబాటు ధర అందడమే కాకుండా మార్కెటింగ్‌ శాఖకు పెద్దఎత్తున సెస్సు రూపంలో ఆదాయం అందే అవకాశం ఉంది.

రైతులకు అవగాహన కల్పిస్తున్నాం

ఉమ్మడి కర్నూలు జిల్లాలో లక్షల ఎకరాల్లో వరి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రైతులు ఇప్పటి దాకా ధాన్యాన్ని మిల్లుల్లో వ్యయ ప్రయాసల కోర్చి వ్యాపారులకు అమ్ముకోవడం జరుగుతుంది. దీని వల్ల రైతులు నష్టపోవడమే కాకుండా మార్కెటింగ్‌ శాఖ ఆదాయానికి కూడా పెద్దఎత్తున గండి పడుతుంది. ఈ పరిస్థితిని నివారించేందు కోసం మార్కెటింగ్‌ శాఖ జేడీ రామాంజనేయులు, అదే విదంగా మంత్రులు టీజీ భరత్‌, బీసీ జనార్దన్‌ రెడ్డితో పాటు ఎమ్మెల్యేలతో మాట్లాడి కర్నూలు మార్కెట్‌ యార్డులో రెండు నెలల క్రితం ధాన్యం కొనుగోళ్లను ప్రారంభించాం. గ్రామాల్లో ఈ సమాచారాన్ని రైతులందరికీ తెలియజెప్పేందుకు ప్రచారాన్ని కూడా చేస్తున్నాం. త్వరలోనే కర్నూలు మార్కెట్‌ యార్డులో పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోళ్లు ప్రారభించడం జరుగుతుంది. వ్యాపారులు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మిల్లుల్లో కాకుండా కర్నూలు మార్కెట్‌ యార్డులోనే రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఆదేశించాం.

-జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ, కర్నూలు

Updated Date - May 11 , 2025 | 11:31 PM