Share News

నిరుపయోగంగా గోదాము

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:30 AM

కర్నూలు మార్కెట్‌ యార్డులో రూ.1.70 కోట్లు అప్పు తీసుకువచ్చి జింబో గోదామును నిర్మించారు. అయితే.. సంవత్సరాలు గడిచి పోతున్నా ఆ గోదాము నుంచి పైసా ఆదాయం రాకపోవడంతో మార్కెట్‌కమిటీ అధికారులు ఏం చేయాలి దేవుడా...! అంటూ తలపట్టు కూర్చున్నారు.

నిరుపయోగంగా గోదాము
రూ.కోట్ల అప్పుతో నిర్మించిన జంబో గోదాము

రూ. కోట్ల అప్పు తప్ప.. పైసా ఆదాయం లేని వైనం

కర్నూలు అగ్రికల్చర్‌, డిసెంబరు 13(ఆంధ్రజ్యోతి): కర్నూలు మార్కెట్‌ యార్డులో రూ.1.70 కోట్లు అప్పు తీసుకువచ్చి జింబో గోదామును నిర్మించారు. అయితే.. సంవత్సరాలు గడిచి పోతున్నా ఆ గోదాము నుంచి పైసా ఆదాయం రాకపోవడంతో మార్కెట్‌కమిటీ అధికారులు ఏం చేయాలి దేవుడా...! అంటూ తలపట్టు కూర్చున్నారు. ఆదాయం రాకపోగా..మెయింటెనెన్స్‌కు ఖర్చు తడిసి మోపెడవుతుం డటంతో వారు అల్లాడిపోతున్నారు. రైతులతో పాటు మార్క్‌ఫెడ్‌ తదితర సంస్థలు సేకరించిన పంట ఉత్పత్తులను నిల్వ చేసుకుని వాటి నుంచి మార్కెట్‌ కమిటీకి ఆదాయం రాబట్టుకునే లక్ష్యంతో 2012లో కర్నూలు మార్కెట్‌ కమిటీ అధికారులు రూ.1.70 కోట్లు పక్క మార్కెట్‌ కమిటీ నుంచి అప్పుగా తెచ్చి జింబో గోదాములు నిర్మించారు. ఈ గోదాము పూర్తయిన తర్వాత 2012లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఇప్పటి దాకా ఆ గోదాము నుంచి మార్కెట్‌ కమిటీకి ఒక్క రూపాయి కూడా ఆదాయం రావడం లేదు. 2017లో వ్యవసాయ శాఖ అధికారులు రైతుల కోసం తెచ్చిన పైపులు, పరికరాలు, మోటార్లు తదితర సామగ్రిని కలెక్టర్‌ ఆదేశాలతో కర్నూలు మార్కెట్‌ యార్డులోని జింబో గోదాములో నిల్వ చేశారు. ఈ సామగ్రిని నిల్వ చేసుకున్నందుకు వ్యవసాయ శాఖ ద్వారా తమకు ఒక్క రూపాయి కూడా అద్దె రూపంలో రావడం లేదని, మార్కెట్‌ కమిటీ అధికారులు చెబుతున్నారు. ఏదో విధంగా ఈ సామగ్రిని వ్యవసాయ శాఖ అధికారులు గోదాము నుంచి తరలిస్తే తాము పంట ఉత్పత్తులను నిల్వ చేయడం ద్వారా నెలనెలా ఆదాయం పొందవచ్చని సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. ఈ గోదాములో పంట ఉత్పత్తులను నిల్వ చేసే సంబంధిత సంస్థల నుంచి నెల నెలా రూ. 1.70 లక్షల ఆదాయం వస్తుందని సెక్రటరీ తెలిపారు. ఎన్నోసార్లు వ్యవసాయ శాఖ జేడీకి లెటర్లు రాశామని, నిరూపయోగంగా ఉన్న సామాగ్రిని తీసుకెళితే.. తాము గోదామును అద్దెకు ఇచ్చుకుంటామని చెప్పామని అయినా కూడా వారు పట్టించుకోవడం లేదని అన్నారు. ఎన్నోసార్లు ఈ విషయాన్ని తమ శాఖ ఉన్నతాధికారులకు కూడా చెప్పినట్లు సెక్రటరీ తెలిపారు. ప్రస్తుతం జింబో గోదాము చుట్టూ పిచ్చి మొక్కలు మొలిచాయి. పాములు, గోదాములోకి ప్రవేశిస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

గోదాము సమస్యను కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తాం

కర్నూలు మార్కెట్‌ యార్డులో నిర్మించిన జింబో గోదాము వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. వ్యవసాయ శాఖకు చెందిన అధికారులు సామాగ్రిని తమ గోదాములో నిల్వ చేయడం వల్ల రైతుల పంట ఉత్పత్తులను ఈ గోదాములో నిల్వ చేసుకునేందుకు అవకాశం లేకుండా పోయింది. ఈ గోదామును వినియోగంలోకి తీసుకువచ్చి రైతులతో పాటు మార్కెట్‌ కమిటీకి ఆదాయాన్ని తీసుకువచ్చేందుకు కలెక్టర్‌ దృష్టికి త్వరలోనే సమస్యను తీసుకెళ్తాం. - జయలక్ష్మి, సెక్రటరీ

Updated Date - Dec 14 , 2025 | 12:30 AM