పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం రాయితీ: కలెక్టర్
ABN , Publish Date - Aug 05 , 2025 | 11:35 PM
చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ, విద్యుత్, సేల్‌ట్యాక్స్ రాయితీ ప్రయోజనాలు కల్పిస్తుందని కలెక్టర్ రాజకుమారి అన్నారు.
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 5 (ఆంధ్రజ్యోతి): చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపన కోసం రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీ, పావలావడ్డీ, విద్యుత్, సేల్‌ట్యాక్స్ రాయితీ ప్రయోజనాలు కల్పిస్తుందని కలెక్టర్ రాజకుమారి అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్‌హాల్‌లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రమోషన్ కమిటీ, జిల్లా నైపుణ్యాభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ పరిశ్రమల స్థాపనకోసం 139 దరఖాస్తులు అందగా, ఆయా శాఖల ద్వారా 131 పరిశ్రమలకు అనుమతులు మంజూరు చేశామన్నారు. మిగిలిన 8 పరిశ్రమలు పరిశీలనలో ఉన్నాయని అన్నారు. బనగానపల్లె నియోజకవర్గం కోవెలకుంట్ల ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో ఈనెల 12న మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 57 ఉత్తమ ప్రమాణాలు పాటించిన ఆసుపత్రులను జాతీయ స్థాయి సర్టిఫికేషన్ కార్యక్రమానికి ఎంపిక చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ఉత్తమ ఆసుపత్రుల్లో సదుపాయాల కోసం కృషిచేసిన 16 మంది వైద్యసిబ్బందికి కలెక్టర్ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు. పరిశ్రమలశాఖ జీఎం మహబూబ్‌బాష, స్కిల్ డెవల్‌పమెంట్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ శ్రీధర్‌రెడ్డి, పరిశ్రమల శాఖ డిప్యూటీ ఛీఫ్ ఇన్‌స్పెక్టర్ నారాయణరెడ్డి, ఐటీడీఏ పీవో వెంకటశివప్రసాద్ పాల్గొన్నారు.