Share News

కబ్జాలో ప్రభుత్వ భూమి

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:37 PM

కబ్జాలో ప్రభుత్వ భూమి

కబ్జాలో ప్రభుత్వ భూమి
రోడ్డు పక్కనే స్థలం కబ్జా చేసి ప్రహరీ నిర్మించిన దృశ్యం

రూ. కోటి విలువైన స్థలాన్ని కాజేయాలనే యత్నం

ఆక్రమణదారు మాజీ ఎమ్మెల్యే సమీప బంధువు

నగర పాలక అధికారులు నోటీసులు ఇచ్చినా స్పందన కరువు

నగర పాలక సంస్థ పరిధిలోని సుమారు 15 సెంట్ల స్థలాన్ని ఓ వ్యక్తి కబ్జా చేశాడు. ఆయన గత ప్రభుత్వంలోని వైసీపీ ఎమ్మెల్యే సమీప బంధువు కావడంతో అధికారులు ఎవ్వరూ అప్పట్లో దాన్ని అడ్డుకోలేదు. దీంతో ఆయన ఏకంగా ప్రభుత్వం స్థలాన్ని కాజేసి చుట్టూ ప్రహరీ నిర్మించాడు. ఇప్పుడు దాన్ని ప్రశ్నిస్తున్న సచివాలయ సిబ్బందిపై దాడికి పాల్పడుతున్నాడు. నగర పాలక పరిధిలోని 38వ వార్డు మునగాలపాడు గ్రామంలో సర్వే నెంబరు.9లో 15 సెంట్ల ప్రభుత్వ స్థలం తనదంటూ మాజీ ఎమ్మెల్యే బంధువు అఽధికారులను బెదిరిస్తున్నాడు. ఆయన స్థలం పక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఎట్లాగైనా కాజేయాలనే ప్రయత్నంలో ఉన్నాడు.

కర్నూలు న్యూసిటీ, డిసెంబరు 15(ఆంధ్రజ్యోతి): నగర పాలక పరిధిలో ఉండే 38వ వార్డు మునగాలపాడు గ్రామంలోని ఈ స్థలంలో గతంలో రోడ్డు ఉండేది. కాలక్రమేణా గ్రామస్థులకు మరుగుదొడ్లు అవసరం కావడంతో అప్పటి పంచాయతీ అధికారులు రోడ్డులో మరుగుదొడ్లను నిర్మించారు. ఈ స్థలంపై కన్నేసిన వైసీపీ నాయకుడి బంధువు ఎలాగైనా ఆ స్థలాన్ని కాజేయాలని ప్రయత్నిస్తున్నాడు. 2023 ఆగస్టు నెలలో అకారణంగా మరుగుదొడ్లను కూల్చివేసారు. అప్పటి నుంచి గ్రామ మహిళలు మరుగుదొడ్ల లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సమీపబంధువు బలవంతంగా కాజేసి ప్రహరీ నిర్మించాడు. ఆ ప్రాంతంలో తిరిగి మరుగుదొడ్లు నిర్మించాలని గ్రామస్థులంతా పలుమార్లు నగర పాలక అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

రూ.కోటి విలువైన స్థలం..

ఆ ప్రాంతంలో ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం ఒక్క సెంటు కనీసం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల దాకా పలుకుతోంది. ఇంత విలువైన స్థలాన్ని కాజేయాలని సదరు వైసీపీ నాయకుడి బంధువు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇదంతా ప్రభుత్వ స్థలం కావడంతో ఆక్రమణకు గురికాకూడదనే ఉద్దేశంతో స్థానిక సచివాలయ ప్లానింగ్‌ కార్యదర్శి ఆ వ్యక్తికి నోటీసులు జారీ చేశారు. ప్రహరీని కూల్చాలని వెళ్లిన ప్లానింగ్‌ కార్యదర్శిపై ఆక్రమణదారు దాడి చేసినట్లు గ్రామస్థులు చెబుతున్నారు.

సత్రాలు కబ్జా చేశారు...

ఈ స్థలం ఎదురుగా ఉన్న ప్రభుత్వ సత్రాలను కూడా వైసీపీ మాజీ ఎమ్మెల్యే కబ్జాచేసి పట్టాలు చేయించుకున్నారు. ఇంత జరుగుతున్నా గ్రామస్థులు ఏమి చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదే అదునుగా మాజీ ఎమ్మెల్యే సమీపబంధువు సర్వే నెంబరు.9 లోని 15 సెంట్ల స్థలాన్ని కొట్టేయాలనే దురాలోచనలో ఉన్నారు. సచివాలయ సిబ్బంది అడ్డుపడినా ఫలితం కనిపించడం లేదు.

కమ్యూనిటీ హాలు నిర్మించాలి

15 సెంట్ల ప్రభుత్వం స్థలంలో కమ్యూనిటీ హాలు నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఇతరులు దీనిని కబ్జా చేయకుండా అధికారులు కాపాడాలని, గ్రామంలో ఏ చిన్న శుభకార్యం చేసుకోవాలన్నా కమ్యూనిటీ హాలు లేక పట్టణానికి రావాల్సి వస్తోందని అంటున్నారు. దానితో పాటు సచివాలయ కార్యాలయాన్ని కూడా ఇక్కడే నిర్మిస్తే బాగుంటుందని స్థానికుల అభిప్రాయం.

నోటీసులు ఇచ్చాం...చర్యలు తీసుకుంటాం

స్థలాన్ని కబ్జా చేసే వ్యక్తులకు నోటీసులు జారీ చేశాం. వాటిని ఆక్రమణదారు తీసుకోకపోవడంతో ఆయన ఇంటికి అతికించాం. గతంలో పెద్దలు తమ ఆస్తిని ప్రభుత్వానికి ఇచ్చారని, అందువల్ల ఈ స్థలం తనదే అని ఆయన వాదిస్తున్నారు. ఆర్‌ఎస్‌ఆర్‌లో ప్రభుత్వానికి సంబంధించి స్థలం అని ఉంది. మరోసారి నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకుంటాం. ఆక్రమణలను త్వరలోనే తొలగిస్తాం.

- విశ్వనాథ్‌, నగర పాలక కమిషనర్‌

Updated Date - Dec 15 , 2025 | 11:37 PM