Share News

పోలీసుల్లో మార్పు తీసుకురండి

ABN , Publish Date - Oct 28 , 2025 | 12:14 AM

ఆదోని డివిజన్‌లో కొందరు పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదోని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు.

పోలీసుల్లో మార్పు తీసుకురండి
ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్న ఆదోని బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు

లాయర్లు, ప్రజలతో దురుసుగా ప్రవర్తిస్తున్నారు

పోలీసుల పట్ల విశ్వసనీయత సన్నగిల్లుతోంది

ఛలో కర్నూలుకు కదిలిన ఆదోని న్యాయవాదులు

ఎస్పీకి ఫిర్యాదు.. కలెక్టరేట్‌ వద్ద ధర్నా

కర్నూలు, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): ఆదోని డివిజన్‌లో కొందరు పోలీసు అధికారులు దురుసుగా ప్రవర్తిస్తున్నారని, వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం ఆదోని బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేశారు. ఆదోని పట్టణంలోని ఓ పోలీస్‌ స్టేషన్‌కు ఓ కేసు విషయంలో వెళ్లిన న్యాయవాదుల పట్ల అక్కడి సీఐ అమర్యాదగా, దురుసుగా ప్రవర్తించిన తీరుకు నిరసనగా ఆదోని బార్‌ అసోసియేషన్‌ ఛలో కర్నూలు కార్యక్రమానికి పిలుపు ఇచ్చింది. అసోషియేషన్‌ అధ్యక్షుడు వి. శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి ఎల్‌కే జీవన్‌సింగ్‌ ఆధ్వర్యంలో ఎస్పీని కలిశారు. వివిధ పనులు, కేసులు విషయంలో పోలీస్‌ స్టేషన్లకు వెళ్లే న్యాయవాదులు, సామాన్య ప్రజల పట్ల కనీస గౌరవం లేకుండా వ్యవహరిస్తున్నారని, దీనివల్ల పోలీసు శాఖ విశ్వనీయత దెబ్బతింటుందని వివరించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ విధానం విధానం తీసుకురావాలని, న్యాయవాదులు, సామాన్య ప్రజల గౌరవ భావంతో చూడాలని కోరారు. దీనికి ఎస్పీ సానుకూలంగా స్పందించారని బార్‌ అసోషియేషన్‌ న్యాయకులు తెలిపారు. అక్కడి నుంచి వారు కలెక్టరేట్‌ చేరుకొని ధర్నా చేశారు. ఆదోని బార్‌ అసోసియేషన్‌ చేపట్టిన ఛలో కర్నూలు నిరసన కార్యక్రమానికి ఎమ్మిగనూరు, ఆలూరు, పత్తికొండ బార్‌ అసోసియేషన్లు మద్దతు పలుకుతూ ధర్నాలో పాల్గొన్నారు బార్‌ అసోషియేషన్‌ ఉపాధ్యక్షుడు జె. వెంకటేశ్వర్లు, జాయింట్‌ సెక్రెటరీ పి.రాజారత్నం, సీనియర్‌ న్యాయవాదులు జీవీ దేశాయ్‌, రామిరెడ్డి, విరుపాక్షిరెడ్డి, కేజీ వెంకటేశ్‌, చంద్రయ్య, తబ్రేజ్‌ పాల్గొన్నారు.

ఆదోని టూటౌన్‌ సీఐపై ఎస్పీకి ఫిర్యాదు

కర్నూలు లీగల్‌: ఆదోనిలో సీనియర్‌ న్యాయవాది వెంకటేశ్‌పై ఆదోని టూటౌన్‌ సీఐ దురుసుగా ప్రవర్తించి అవమానించారని ఆయనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కర్నూలు న్యాయవాదులు ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌కు ఫిర్యాదు చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు పి.హరినాథ్‌ చౌదరి, బార్‌ కౌన్సిల్‌ సభ్యులు పాలూరి రవి గువేరా ఆధ్వర్యంలో న్యాయవాదులు ఎస్పీకి వినతి పత్రాన్ని అందజేశారు. న్యాయావాదులపై రోజురోజుకు దాడులు పెరిగిపోతున్నాయని, పోలీసు అధికారులే న్యాయవాదులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి తలవంపు తెచ్చేలా ఉంద న్నారు. న్యాయవాదులకు రక్షణ చట్టం తీసుకుని వచ్చి వారికి భద్రతను కల్పించాలని కోరారు. ఎస్పీని కలిసిన వారిలో న్యాయవాదులు రవికాంత్‌ ప్రసాద్‌, ఎం.వెంకటే శ్వర్లు, రవికాంత్‌ ప్రసాద్‌, మోహన్‌బాబు, ఎం.సుబ్బయ్య తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 28 , 2025 | 12:14 AM