దిగుబడి భళా..ధర డీలా
ABN , Publish Date - Dec 12 , 2025 | 12:52 AM
ఓర్వకల్లు మండలంలో ఈ ఏడాది వరి దిగుబడి బాగా వచ్చింది. ఎకరాకు 35 క్వింటాళ్లు రావడంతో రైతులు సంతోషించారు. అయితే ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం ధర ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రైవేట్ వ్యాపారుల దోపిడీ.. బస్తాకు రూ.1,600/-
లబోదిబోమంటున్న వరి రైతులు
ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించాలంటున్న రైతులు
ఓర్వకల్లు, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): మండంలోని ఓర్వకల్లు, కాల్వ, కాల్వబుగ్గ, హుశేనాపురం, కన్నమడకల, ఉప్పలపాడు, ఉయ్యాలవాడ తదితర గ్రామాల్లో 2వేల ఎకరాల్లో పైగా వరి పంటను సాగు చేశారు. ఐదేళ్ల నుంచి వరి దిగుబడులు తగ్గాయి. ఈ ఏడాది వర్షాలు సమృద్దిగా కురవడంతో దిగుబడి పెరిగింది. అయితే ప్రైవేటు వ్యాపారులు ధర తగ్గించడంతో రైతులు లబోదిబో మంటునానరు. కొందరు రైతులు గత్యంతరం లేక ఎంతో కొంత ధరకు విక్రయిస్తుండగా మరికొందరు మంచి ధర రాకపోతుందా అన్న ఆశతో ధాన్యాన్ని కల్లాలు, ఇళ్లల్లో నిల్వ చేసుకుంటున్నారు.
పెట్టుబడి పెరిగినా ధరలేదు..
గత ఏడాది ఎకరాకు 20 క్వింటాళ్ల నుంచి 30 క్వింటాళ్లు దిగుబడి వచ్చింది. అయితే ఈ ఏడాది 30 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి రావడంతో రైతులు సంతోషించారు. కానీ తీరా ధర లేకపోవడంతో నష్టం తప్పడం లేదని అంటున్నారు.
ధర లేక ఆవేదన..
వరికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు కష్టప డుతున్నారు. 75కేజీల వరి బస్తా రూ.1,600లకు మించి ధర పలకడం లేదు. బస్తా రూ.3వేలు విక్రయిస్తేనే గిట్టుబాటవుతుందని రైతులంటున్నారు. ధర తగ్గగ డంతో ఏం చేయాలో తెలియడడం లేదంటున్నారు. ధాన్యాన్ని కల్లాల్లో ఆరబెట్టి పగలు, రాత్రి కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వరికోత యంత్రాలకు డిమాండ్..
వరికోత యాంత్రాలు(హార్వెస్టర్)కు డిమాండ్ పెరిగింది. యంత్రానికి గంటకు రూ.3వేల ప్రకారం చెల్లిస్తున్నారు. కూలీలు దొరక్కపోవడంతో రైతులు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఒకేరోజు వడ్లు ఇంటికి చేరతాయని రైతులు తెలిపారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి గిట్టుబాటు ధర లభిం చేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.
మద్దతు ధర ఏదీ?
వరికి ప్రభుత్వం మద్దతు ధర ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. ప్రభుత్వ ధర లేకపోవంతో దళారులకు తెగనమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి సాగుకు ఖర్చులు పెరిగిపోయాయని, ధర మాత్రం రావడం లేదంటున్నారు. ఎకరాకు రూ.15వేలకు పెట్టుబడి ఖర్చులు అవుతోందని వాపోతున్నారు. వరికి మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ప్రకటనలకే పరిమితమవుతోందని ఆరోపిస్తున్నారు.
అమ్మకుంటే నష్టమే
నాలుగెకరాల పొలంలో వరి సాగు చేశాను. పెట్టుబడి రూ.40వేలు అయింది. వడ్ల ధర రూ.1,600 కంటే ఎక్కువగా పలకడం లేదు. దీంతో ధాన్యాన్ని అమ్మకుండా, ఆరబెట్టుకుని కాపలా కాస్తున్నాను. మంచి ధర వస్తుందని ఎదురు చూస్తున్నా. ప్రభుత్వమే మద్దతు ధర కల్పించి రైతులను ఆదుకోవాలి. - అల్లాబాబు, రైతు