పల్లె రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - May 01 , 2025 | 12:31 AM
పల్లె రోడ్ల బాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించి రూ.కోట్ల నిధులు మంజూరు చేసి పల్లెరోడ్లను బాగు కోసం కృషి చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 25 పనులు
మరమ్మతులకు రూ.39.83 కోట్లు మంజూరు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
నంద్యాల, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): పల్లె రోడ్ల బాగుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పల్లె రోడ్ల మరమ్మతులపై ప్రత్యేక దృష్టిసారించి రూ.కోట్ల నిధులు మంజూరు చేసి పల్లెరోడ్లను బాగు కోసం కృషి చేస్తున్నారు. తాజాగా మరోమారు కేంద్రంతో పాటు రాష్ట్ర వాటాతో కలిపి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోడ్ల మరమ్మతుల కోసం రూ.39.83 కోట్లు మంజూరు చేసింది. 25 పనుల్లో పరంగా 88.46 కిలోమీటర్ల బీటీ(తారు) రోడ్లకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఇందులో కూడా కర్నూలు జిల్లాలో 43 కిలోమీ టర్లు, నంద్యాల జిల్లాలో 45.46 కిలోమీటర్లలో మరమ్మతు పనులు చేస్తారు. కర్నూలు జిల్లాకు రూ.19.68 కోట్లు, నంద్యాల జిల్లాకు రూ.20.15 కోట్లు కేటాయించారు. ఇదిలా ఉండగా గ్రామీణ రహదారులకు మోక్షం కలిగే విధంగా కూటమి ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా విడతల వారీగా నిధులు కేటాయించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. త్వరలోనే ఈ పనులకు సంబంధించి టెండర్లు పిలవనున్నారు.
పల్లె రోడ్లకు నిధులు
పల్లె రోడ్లకు కేంద్ర, రాష్ట్ర సహకారంతో ఉమ్మడి జిల్లాకు నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే టెండర్లు పిలుస్తాము. ఎస్సీ, ఎస్టీ, సాధారణ ప్రజలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ పనులు చేయడం జరుగుతుంది. గతంలో రోడ్లను గుర్తించి నివేదించడం జరిగింది. ఇంతమునుపు కూడా ప్రభుత్వం రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేసింది. - నాగరాజు, డీపీఆర్‌ఈవో, పంచాయతీ రాజ్ శాఖ