విద్యుత్ వినియోగదారులకు శుభవార్త
ABN , Publish Date - Oct 13 , 2025 | 12:09 AM
గృహ విద్యుత్ వినియోగదారులు వాడుకుంటున్న అదనపు లోడును 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది.
అదనపు లోడును 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునే అవకాశం
డిసెంబరు 31 వరకు గడువు పొడిగింపు
ఎస్‌ఈ ప్రదీప్‌కుమార్
కల్లూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): గృహ విద్యుత్ వినియోగదారులు వాడుకుంటున్న అదనపు లోడును 50 శాతం రాయితీతో క్రమబద్ధీకరణ చేసుకునేందుకు కూటమి ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. తొలుత మార్చి 1 నుంచి జూన్ 30 వరకు దరఖాస్తులకు ఏపీఎస్‌పీడీసీఎల్ (డిస్కం) ఆహ్వానించింది. వీలైనంత ఎక్కువ మందికి లబ్ది చేకూర్చాలన్న ఉద్దేశంతో రెండో ధపా డిసెంబరు 30 వరకు గడువు పొడిగించింది. వినియోగదారులు సద్వినియోగం చేసుకుంటే అదనపు చార్జీల బెడద ఉండదని, డెవలప్‌మెంట్ చార్జీల్లో 50 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఎస్‌ఈ ప్రదీప్ కుమార్ తెలిపారు. జిల్లాలోని కర్నూలు, ఆదోని, ఎమ్మిగనూరు డివిజన్ల పరిధిలోని ప్రజలుఉపయోగించుకోవాలని ఆయన సూచించారు.
గణనీయంగా పెరిగిన విద్యుత్ వినియోగం
జిల్లాలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. దాంతో లోడు క్రమబదీకరించకుండా వాడుకుంటున్న వినియోగదారులను గుర్తించి అధికారులు జరిమానా విధిస్తున్నారు. చాలా మందికి ఇంటి విద్యుత్ కనెక్షన్ లోడు ఎంతో తెలియదు. దరఖాస్తు సమయంలో నమోదు చేసిన లోడ్ కంటే... ఏసీ, వాషింగ్ మిషన్, రిఫ్రిజిరేటర్ తదితర ఎలక్ర్టానిక్ పరికరాల వినియోగంతో అదనపు వినియోగంతో ట్రాన్స్‌ఫార్మర్లపై భారం పడుతోంది. ఫలితంగా లోవోల్టేజీ, సరఫరాలో అంతరాయం ఏర్పడుతోంది.
స్వచ్ఛందంగా ముందుకొస్తేనే..
జిల్లాలో 6.54 లక్షల గృహ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇందులో 30శాతం లోడు క్రమబద్ధీకరించుకోవాల్సి ఉంది. విద్యుత్ అధికారుల బ్దృందాలు తనిఖీ చేసి, అదనంగా ఎంత లోడు వాడుతున్నారో నమోదు చేస్తారు. ఆ మొత్తానికి నగదు చెల్లించాలని నోటీసులిస్తారు. కిలోవాట్‌కి రూ.2వేల చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పునఃపరిశీలనకు కొందరు అర్జీలు పెట్టుడం, మరికొందరు రుసుం చెల్లించడంలో జాప్యం చేస్తున్నారు. వినియోగాదరులు లోడు క్రమబద్ధీకరణకు స్వచ్ఛందంగా ముందుకొస్తే అవసరమైన చోట ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసేందుకు అవకాశముంది. అదనపు లోడును రాయితీతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం పెంచిన గడువును వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ ఆర్.ప్రదీప్‌కుమార్ తెలిపారు.
మొదటి దశలో..
మార్చి 1 నుంచి జూన్ 30 వరకు 728 కిలోవాట్లకు 353 మంది గృహ విద్యుత్ వినియోగదారులు కనెక్షన్లకు అదనపు లోడు క్రమబద్ధీకరించుకున్నారు. తద్వారా విద్యుత్ సంస్థకు రూ.8.73 లక్షలు ఆదాయం వచ్చింది.
ఫీజు వివరాలు
అదనపు కిలోవాట్‌కు సెక్యూరిటీ డిపాజిట్‌గా ప్రభుత్వం రూ.200 నిర్ణయించింది. అలాగే డెవలప్‌మెంట్ చార్జీలను రాయితీతో కొంత నగదు చెల్లించాల్సి ఉంది. కిలోవాట్లు పరిగేకొద్దీ రుసుం పెరుగుతుంది. ఒక కిలోవాట్‌కు సాధారణంగా దరఖాస్తు పీజు రూ.50, డిపాజిట్ రూ.200. డెవలప్‌మెంట్ చార్జీ రూ.వెయ్యి చెల్లించాల్సి వస్తుంది. ఇలా ఎన్ని కిలోవాట్ల వరకు లోడు పెంచుకోవాలనుకుంటే దరకాస్తు పీజు మినహా అన్ని రెట్టింపు చెల్లించాల్సి వస్తుంది. డెవలప్‌మెంట్ చార్జీలకు మాత్రమే రాయితీ వర్థిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.