ప్రభుత్వ బడికి మంచి రోజులు
ABN , Publish Date - May 15 , 2025 | 11:58 PM
ప్రభుత్వ బడికి మంచి రోజులు వస్తున్నాయి. పాఠశాల విద్య సంస్కరణలో భాగంగా మెరుగైన వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు చేర్పులు చేస్తోంది.
మద్దికెర మండలంలో 10 మోడల్ పాఠశాలలు
గత ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలకు బ్రేక్
పెరుగుతున్న విద్యార్థుల సంఖ్య
మద్దికెర, మే 15 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ బడికి మంచి రోజులు వస్తున్నాయి. పాఠశాల విద్య సంస్కరణలో భాగంగా మెరుగైన వసతులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం విద్యా విధానంలో మార్పులు చేర్పులు చేస్తోంది. గత వైపీపీ ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల 3, 4, 5 తరగతులను జడ్పీ పాఠశాలలో విలీనంచేసి విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఏడాది 2025-26 విద్యాసంవత్సరానికి విధి విధానాలు మారుతున్నాయి.
పది మోడల్ ప్రాథమిక పాఠశాలలు
మండలంలో పది ప్రాథమిక పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా తీర్చిదిద్ది ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియం మాత్రమే బోధించ నున్నారు. 60 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలను ఎంపిక చేసి, ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుడి చొప్పున ఐదుగురు ఉపాధ్యాయులు బోధన కొనసాగిస్తారు. మండలంలో మొత్తం జిల్లా పరిషత్ బాలుర, బాలికల ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు 26 ఉన్నాయి. వీటిలో మద్దికెరలో 5 పాఠశాలలు, హంపలో ఒకటి, పెరవలిలో రెండు, ఎం.అగ్రహారంలో ఒకటి, మదనంతపురంలో ఒక పాఠశాలను మోడల్ ప్రాథమిక పాఠశాలలుగా ఎంపిక చేశారు. గత వైసీపీ హయాంలో 3, 4, 5 తరగతులను జిల్లా పరిషత్ పాఠశాలల్లో విలీనం చేయవద్దంటూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ఆందోళనలు, ధర్నాలు చేసి తరగతులు బహిష్కరించినా వైసీపీ ప్రభుత్వం మొండిగా వ్యవహరిం చిందని ఆరోపణలు ఉన్నాయి. దీని ప్రభావంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గి, ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థులు పరుగులు తీశారు.
విద్యార్థులకు మెరుగైన విద్య
విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు ప్రభుత్వం మండలంలో మొత్తం 10 ప్రాథమిక పాఠశాలలను మోడల్ పాఠశాలలుగా ఎంపిక చేసింది. 1 నుంచి 5వ తరగతి వరకు ఇంగ్లీషు మీడియంలో విద్యను అందిస్తున్నాం. ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉండటంతో ఈ విద్యాసంవత్సరంలో మెరుగైన విద్య అందే అవకాశం ఉంది. - రంగస్వామి, ఎంఈవో