గంగ ఒడికి దుర్గమ్మ
ABN , Publish Date - Oct 04 , 2025 | 11:54 PM
దసరా వేడుకల్లో భాగంగా కొలువుదీరిన దుర్గమ్మ 11 రోజులు భక్తుల పూజలు అందుకుని శనివారం గంగమ్మ ఒడికి చేరారు.
భక్తిశ్రద్ధలతో జగన్మాత నిమజ్జనం
ఉత్సాహంగా యువత, మహిళలు నృత్యం
సంప్రదాయలకు ప్రతీక దుర్గాదేవి నిమజ్జనోత్సవం
రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్
కర్నూలు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): దసరా వేడుకల్లో భాగంగా కొలువుదీరిన దుర్గమ్మ 11 రోజులు భక్తుల పూజలు అందుకుని శనివారం గంగమ్మ ఒడికి చేరారు. నగర వీధులు ఎటు చూసినా దుర్గామాత పూజలు, పాటలతో ఆధ్మాతిక శోభితమై విరాజిల్లింది. లక్షలాది భక్తుల పూజలు అందుకొని, వారి మొక్కులు తీర్చిన దుర్గామ్మా.. పోయిరావమ్మా..! అంటూ భక్తులు సంప్రదాయాలు, సంస్కృతి ఉట్టిపడేలా ప్రధాన వీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. కనుల పండువగా నిమజ్జన మహోత్సవం కొనసాగింది. శనివారం సాయంత్రం సంకల్‌బాగ్‌లోని తుంగభద్ర నదిలో నిమజ్జనం నిర్వహించారు. ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎస్పీ విక్రాంత్ పాటిల్, మేయర్ బీవై రామయ్య, విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి, బీవీ రెడ్డి, కల్కూర చంద్రశేఖర్, టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, నగర ప్రముఖులు దుర్గా ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు, జ్యోతి ప్రజ్వలన చేసి నిమజ్జన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ దుర్గమ్మ ప్రతిమను తలపై మోసుకొచ్చి నిమజ్జనం చేశారు. అనంతరం రావణాసుర దహనం నిర్వహించారు. దాదాపు నగర వ్యాప్తంగా 250 విగ్రహాలు నిమజ్జనానికి తరలి వచ్చాయి. సంప్రదాయ నృత్యాలతో అలరించిన కళాకారులకు జ్ఞాపికలు, శాలువాలతో టీజీ వెంకటేశ్ సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్కృతీ, సంప్రదాయాల సమ్మేళనమే దుర్గామాత వేడుకలు అన్నారు. ఉత్సవం ప్రశాంతంగా జరిగేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ తరువాత ఆ స్థాయిలో దేవిశరన్నవరాత్రులు కర్నూలు నగరంలో జరుపుకోవడం గర్వకారణమన్నారు.