ప్రతి ఎకరాకు సాగునీరు ఇవ్వాలి
ABN , Publish Date - Nov 06 , 2025 | 11:26 PM
రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు దాకా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పులకుర్తి, గూడూరుకు చెందిన చివరి ఆయకట్టు రైతులు ఎల్లెల్సీ కెనాల్‌ను పరిశీలించారు
సబ్ డివిజన్ కార్యాలయాన్ని ముట్టడిస్తాం
ఎల్లెల్సీ కెనాల్‌ను పరిశీలించిన రైతులు
కోడుమూరు రూరల్, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు దాకా ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం పులకుర్తి, గూడూరుకు చెందిన చివరి ఆయకట్టు రైతులు ఎల్లెల్సీ కెనాల్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు నాగిరెడ్డి, విజయభాస్కరరెడ్డి, తిమోతి మాట్లాడుతూ కోడుమూరు సెక్షన్‌లో చివరి ఆయకట్టుకు సుమారు 25ఏళ్లకు పైగా సాగునీరు అందడం లేదని ఆరోపించారు. వర్షాధార పంటలపై ఆధారపడాల్సి వస్తోందన్నారు. ఈఏడాది అధిక వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయని, రైతులు తీవ్రనష్టాలపాలయ్యారని విచారం వ్యక్తం చేశారు. అడుగడుగునా నానాయకట్టుదారులు మోటార్లు వేసుకుని సాగునీరు వాడుకుంటున్నారని తెలిపారు. దాదాపు 2 వేల ఎకరాలు వరకు నానాయకట్టు సాగువుతోందని రైతులు అన్నారు. అధికారులు మామూళ్ల మత్తులో పడి చివరి ఆయకట్టును పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రబీ సీజన్‌లో చివరి ఆయకట్టు దాకా ప్రతి ఎకరాకు సాగునీరు పారించాలని డిమాండ్ చేశారు. సాగునీరు ఇవ్వని పక్షంలో రైతులను సమీకరించి సబ్‌డివిజన్ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో రామకోటిరెడ్డి, లింగన్న, కర్ణ పాల్గొన్నారు.