Share News

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

ABN , Publish Date - Oct 16 , 2025 | 12:24 AM

రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఏఐసీసీ సభ్యుడు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని దామోదరం సంజీవయ్య కాంగ్రెస్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి
మాట్లాడుతున్నలక్ష్మీనరసింహ యాదవ్‌

విభజన హామీలు అమలు చేయాలి

నంద్యాల డీసీసీ అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్‌

కల్లూరు, అక్టోబరు 15(ఆంధ్రజ్యోతి): రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని ఏఐసీసీ సభ్యుడు, నంద్యాల డీసీసీ అధ్యక్షుడు జె.లక్ష్మీనరసింహ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. నగరంలోని దామోదరం సంజీవయ్య కాంగ్రెస్‌ భవన్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానికులు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎనిమిదేళ్లుగా జీఎస్టీ పేరుతో ప్రజల నుంచి దోచుకున్న డబ్బు రూ.200 కోట్లు ఖర్చుపెట్టి జీఎస్టీ తగ్గించామని ఉత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు మరిచిందని, విభజన హామీల్లో పెట్టిన ప్రధానమైన ప్రత్యేకహోదా ఏమైందని ప్రశ్నించారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని చెప్పి అమలు చేయడంలో మోదీ ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యారని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం, వైసీపీ కేంద్రంలోని మోదీకి మద్దతుగా ఉన్నా ఏపీకి తీరని అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోదీ 11 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. పార్లమెంటులో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తొమ్మిదవ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగ భధ్రత కల్పించాలని డిమాండ్‌ చేస్తుంటే బీసీ ప్రధాని అని చెప్పుకునే మోదీ బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కేంద్రంలోని బీజేపీ రాయలసీమ డిక్లరేషన్‌లో రెండో రాజధాని నిర్మిస్తామని చెప్పి రాయలసీమ ప్రజలకు తీవ్ర అన్యాయం చేశారని లక్ష్మీనరసింహహయాదవ్‌ అన్నారు. ఆపార్టీ డోన్‌ ఇన్‌చార్జి గార్లపాటి మద్దిలేటిస్వామి, జిల్లా ఉపాధ్యక్షుడు బాలస్వామి, జనార్దన్‌, పఠాన్‌హాబీబ్‌ఖాన్‌, రజాక్‌వలి, సంజీవ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Oct 16 , 2025 | 12:24 AM