ఆరుతడి పంటలకే ప్రాధాన్యమివ్వండి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:06 PM
రబీ సీజన్‌లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రైతులకు సూచించారు.
మంత్రులు ఎన్‌ఎండీ ఫరూక్, బీసీ జనార్దన్‌రెడ్డి
నంద్యాల నూనెపల్లె, డిసెంబరు2(ఆంధ్రజ్యోతి): రబీ సీజన్‌లో వరి పంటలకు బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్‌ఎండీ ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి రైతులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో కలెక్టర్ రాజకుమారి అధ్యక్షతన నీటి పారుదల సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఫరూక్ మాట్లాడుతూ రబీ పంటలకు సాగునీరు అందించే అంశంపై చర్చించిన పిదప ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు. కేసీ కెనాల్, ఎస్సాఆర్‌బీసీ, తెలుగుగంగ ఆయుకట్టులో ఎంత మేరకు నీరు విడుదల చేయాలనే అంశంపై ఇరిగేషన్ అధికారులతో సమీక్షించామన్నారు. ఎస్‌ఆర్బీసీ చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కేసీ కెనాల్ పరిధిలో తుంగభద్ర ప్రాజెక్ట్ గేట్లు కొత్తగా నిర్మించడంతో తాత్కాలిక ఇబ్బందులు ఎదురౌతున్నాయని, అందువల్ల జీరో-120, 120టూ 150 కిలో మీటర్ల వరకు ఈసీజన్‌లో నీటి విడుదల సాధ్యం కాదని ఎమ్యెల్యేలకు సూచించారు. రివర్స్ పంపింగ్ వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను ప్రభుత్వం పరిశీలిస్తుందని మంత్రులు పేర్కొన్నారు.
ఎస్సార్బీసీ చివరి ఆయకట్టుకు సాగునీరు అందిస్తాం:
శ్రీశైలం రైట్‌బ్రాంచ్ కెనాల్ ద్వారా రబీ పంటలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు విడుదల చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి వివరించారు. రైతుల శ్రేయస్సు కోసం రాష్గ్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని, గిట్టుబాటు ధర కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. నంద్యాల జిల్లా పరిధిలో ఖరీప్ సీజన్‌లో నీటి పారుదల, ఆరుతడి పంటల ప్రణాళిక ప్రకారం ఆయకట్టుకు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆళ్లగడ్డ, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూర్, పొద్దుటూరు ఎమ్మ్యెల్యేలు భూమా అఖిలప్రియ, బుడ్డా రాజశేఖర్‌రెడ్డి, గౌరు చరితారెడ్డి, గిత్తా జయసూర్య, వరదరాజులరెడ్డి, జడ్పీ చైర్యెన్ యర్రబోతుల పాపిరెడ్డి, జాయింట్ కలెక్టర్ కార్తీక్, కేసీ కెనాల్ చైర్మెన్ రామలింగారెడ్డి, తెలుగుంగ చైర్మెన్ సంజీవకుమార్‌రెడ్డి, ఎస్‌ఆర్బీసీ చైర్మెన్ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.