‘మావాళ్లకే అవకాశమివ్వాలి’
ABN , Publish Date - Jun 19 , 2025 | 12:10 AM
సీఎం చంద్రబాబు మే నెల 17వ తేదీన సి.క్యాంపు రైతుబజా ర్‌ను పర్యటించారు. ఆయన వెళ్లిపోయారో లేదో.. ఇక్కడ తిష్ట వేసేందుకు కొంతమంది నాయకులు, వారి అనుచరులు ఆరోజు నుంచి ఈరోజు వరకు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఒక దశలో సి.క్యాంపు రైతుబజారు ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ వారి ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ తాను పని చేయలేనని, వేరే రైతుబజారుకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రైతుబజార్ అధికారులు, సిబ్బందిపై రాజకీయ నాయకుల ఒత్తిడి
తామెక్కడికి పోవాలంటున్న రైతులు, పొదుపు మహిళలు
కర్నూలు అగ్రికల్చర్, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు మే నెల 17వ తేదీన సి.క్యాంపు రైతుబజా ర్‌ను పర్యటించారు. ఆయన వెళ్లిపోయారో లేదో.. ఇక్కడ తిష్ట వేసేందుకు కొంతమంది నాయకులు, వారి అనుచరులు ఆరోజు నుంచి ఈరోజు వరకు చేయని ప్రయత్నాలంటూ లేవు. ఒక దశలో సి.క్యాంపు రైతుబజారు ఎస్టేట్ అధికారి కళ్యాణమ్మ వారి ఒత్తిడి తట్టుకోలేక ఇక్కడ తాను పని చేయలేనని, వేరే రైతుబజారుకు బదిలీ చేయించుకుని వెళ్లిపోతానని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాలు.. సీ.క్యాంపు రైతుబజారులో తమ వారికే వ్యాపారాలు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రతి రోజూ తెలుగు తమ్ముళ్లు అధికారులు, సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రైతుబజారుకు ప్రధాన రహదారి కోసం సీఎం పర్యటన సందర్భంగా కొంత మంది రోడ్డును ఆక్రమించి వ్యాపారాలు చేసుకునే వారి అంగళ్లను తొలగించారు. ప్రస్తుతం అక్కడ వాహనాల రాకపోకలు మాత్రమే జరిగేలా కలెక్టర్, ఎస్పీలు చర్యలు తీసుకున్నారు. దాదాపు 60మంది దాకా ఆ ప్రధాన రహదారి వద్ద కూరగాయలు అమ్ముకుని జీవనం చేసేవారు. వీరికి తప్పనిసరిగా ఉపాధి కల్పిస్తామని సి.క్యాంపు రైతుబజారును విస్తరించిన తర్వాత అక్కడ వ్యాపారం చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో పాటు కొత్తగా ఏర్పాటు కానున్న కల్లూరులోని గోవర్దనగిరి రైతుబజారులో స్టాల్స్ ఏర్పాటు చేసుకునేందుకు అవకాశం ఇస్తామని వారికి రైతుబజార్ అధికారులు నచ్చజెబుతూ వస్తున్నారు. వీరంతా చోటా, మోటా నాయకులతో సీ.క్యాంపు రైతుబజారులోనే వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ ప్రతి రోజు నాయకులతో ఫోన్లు, సిఫారసు లెటర్లు తీసుకువస్తుండటంతో రైతుబజారు అధికారులు, సిబ్బందికి దిక్కుతోచడం లేదు. బయటివారు రైతుబజారులోకి ప్రవేశిస్తే కొన్నేళ్లుగా ఈ రైతుబజారునే నమ్ముకుని కూరగాయలు అమ్ముకుంటున్న తామెక్కడికి పోవాలని రైతులు, పొదుపులక్ష్మి గ్రూపుల మహిళలు బుధవారం సీ.క్యాంపు రైతుబజారు కార్యాలయంలో ఎస్టేట్ అధికారిని ప్రశ్నించారు. ఒక్కసారిగా రైతులంతా వచ్చి ప్రశ్నిస్తుండటంతో రైతుబజారు అధికారులకు, సిబ్బందికి దిక్కుతోచని పరిస్థితి ఎదురైంది. ఏం సమాధానం చెప్పుకోవాలో అర్థంగాక తలపట్టుకుని కూర్చున్నారు. కలెక్టర్, జేసీ సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని రైతులు, పొదుపుగ్రూపు మహిళలు మొర పెట్టుకుంటున్నారు.