Share News

హంద్రీకి జీడీపీ నీరు

ABN , Publish Date - Oct 23 , 2025 | 10:41 PM

గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీనదికి బుధవారం రాత్రి ఇరిగేషన్‌ అధికారులు నీరు విడుదల చేశారు.

హంద్రీకి జీడీపీ నీరు
జీడీపీ నాలుగో గేటు ఎత్తి నీరు విడుదల చేసిన దృశ్యం

ఎల్లెల్సీ నుంచి జీడీపీకి 190 క్యూసెక్కులు

గే టు ఎత్తి 335 క్యూసెక్కులు విడుదల

గోనెగండ్ల, అక్టోబరు 23(ఆంధ్రజ్యోతి): గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి హంద్రీనదికి బుధవారం రాత్రి ఇరిగేషన్‌ అధికారులు నీరు విడుదల చేశారు. ప్రాజెక్టు 4వ గేటు ఎత్తి 335 క్యూసెక్కుల నీటిని హంద్రీనదికి విడుదల చేసినట్లు ఏఈ మహుమ్మద్‌ ఆలీ తెలిపారు. రెండు రోజులుగా అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా జీడీపీకి హంద్రీ నుంచి 80 క్యూసెక్కుల నీరు చేరుతోంది. అలాగే బుధవారం సాయంత్రం నుంచి ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన మద్దికెర, తుగ్గలి, పత్తికొండ, ఆస్పరి, దేవనకొండ తదితర ప్రాంతాలలో ఒక మోస్తరు వర్షం కురియడంతో గురువారం మధ్యాహ్నం వరద నీరు వచ్చి చేరుతుంది. అలాగే గోనెగండ్ల తుంగభద్ర దిగువ కాలువ ఎస్కేప్‌ చానల్‌ ద్వారా గాజులదిన్నె ప్రాజెక్ట్‌లోకి 190 క్యూసెక్కుల నీటిని ఎల్లెల్సీ ఇరిగేషన్‌ అఽధికారుల విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం గాజలదిన్నె ప్రాజెక్టులో నీటి మట్టం పూర్తి స్థాయిలో ఉన్నట్లు ఇరిగేషన్‌ అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రం నీటి మట్టం(4 టీఎంసీ) 376.70 మీటర్లు ఉంది. జీడీపీ పూర్తిస్థాయి నీటి మట్టం 377 మీటర్లు అయితే ప్రస్తుతం కేవలం 0.30 మీటర్లు మాత్రమే తక్కువ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. రబీ సీజన్‌లో జీడీపీ ఆయకట్టు రైతులుకు నీటి ఇబ్బంది ఉండదని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు.

Updated Date - Oct 23 , 2025 | 10:41 PM