Share News

జీడీడీపీ లక్ష్యం రూ.61,746 కోట్లు

ABN , Publish Date - Sep 15 , 2025 | 11:49 PM

జీడీడీపీ లక్ష్యం రూ.61,746 కోట్లు

జీడీడీపీ లక్ష్యం రూ.61,746 కోట్లు

ఇప్పటికే సాధించిన పురోగతి రూ.10,338 కోట్లు

జీడీడీపీ లక్ష్య సాధనలో రాష్ట్రంలో 22వ స్థానం

మూడేళ్లలో పెరిగిన వృద్ధి రేటు

ఈ ఏడాది తలసరి ఆదాయం రూ,2,25,099

స్థూల ఉత్పాదకతలో సమృద్ధి

జిల్లా స్థూల ఉత్పాదకత (జీడీడీపీ)లో వృద్ధిరేటు పెంచుకుంటూ ముందడుగు వేస్తుంది. గత ఏడాదిలో జీడీడీపీ రూ.52,820 కోట్లు సాధిస్తే, 2025-26 ఆర్థిక సంవత్సరం రూ.61,746 కోట్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చివరి ఏడాది స్థూల ఉత్పత్తి రూ.42,368కోట్లు సాధించింది. కేవలం ఈరెండేళ్లలో రూ.19,378 కోట్లు పెంచుకో వడం ఆర్థిక వృద్ధిరేటుకు సూచికగా నిలుస్తుంది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాల్లో కందనవోలు జిల్లా ఆర్థిక పురోగతి వైపు అడుగులు వేస్తుంది.

కర్నూలు, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోలిస్తే జిల్లా స్థూల ఉత్పత్తి లక్ష్య సాధనలో 22వ స్థానంలో ఉంది. దీనిని మెరుగు పరుచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా ప్రజల తలసరి ఆదాయం రూ,2,25,099 సాధించాలని లక్ష్యం. జీడీడీపీ(గ్రాస్‌ డిస్ర్టిక్‌ డెమెస్టిక్‌ ప్రాడెక్ట్‌), తలసరి ఆదాయం మెరుగు పురుచుకోవాలంటే ఆయా రంగాల్లో మరింతగా వృద్ధి సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అమరావతిలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కలెక్టర్లు, ఎస్పీలతో సోమవారం సమావేశం జరిగింది. కలెక్టర్‌ ఏ.సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ హాజరయ్యారు. జిల్లా పురోగతిపై కలెక్టర్లకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.

సమృద్ధి సాధించినట్లే..

జిల్లా ఆర్థికంగా ఏస్థాయిలో అభివృద్ధి సాధిస్తుందో చెప్పే సూచిక జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ). గడిచిన మూడేళ్లలో సాధించిన జీడీడీపీ, 2025-26 లక్ష్యం రికార్డులు పరిశీలిస్తే సంవృద్ధి సాధించినట్లే ఉంది. రాష్ట్రంలో లక్ష్య సాధనలో 22వ స్థానంలో ఉన్నాం. 2022-23లో రూ.48,052 కోట్లు, 2023-24లో రూ.47,362 కోట్లు, 2024-25లో రూ.52,820 కోట్లు జీడీడీపీ సాధించాం. అంటే ఏటేటా పెరుగుదల ఉంది. గతేడాది కంటే 16.23 శాతం వృద్ధిరేటు పెంచుకున్నారు. ఈఐదు నెలల్లో రూ.10,338 కోట్లు స్థూల ఉత్పత్తి అంటే లక్ష్యంలో 16.74 శాతం సాధించారు. మిగిలిన ఏడు నెలల్లో 83.86 శాతం అంటే రూ.51,408 కోట్లు సాధించాలి. వ్యవసాయ దిగుబడులు ఇప్పుడిప్పుడే మార్కెట్‌కు వస్తున్నాయి. సేవలు కూడా మెరుగు పడుతున్నాయి. ఫలితంగా గడువులోగా లక్ష్యం సాధిస్తామని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

వ్యవసాయానుబంధ రంగాల...

వ్యవసాయానుబంధ రంగాల కేటగిరిలో వ్యవసాయం, ఉద్యానం, మాంసం, చేపలు, కోళ్ల పెంపకం ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థూల విలువ జోడింపు (జీవీఏ) లెక్కిస్తారు. ఈ కేటగిరిలో రెండేళ్లు తీవ్రమైన కరువు వెంటాడడంతో రాబడి భారీగా తగ్గిందనే చెప్పాలి. జీవీఏ 2022-23లో రూ.17,133 కోట్లు వచ్చింది. ఈ తరువాత అతివృష్టి, అనావృష్టి కారణంగా వ్యవసాయ రంగం దెబ్బతినడంతో 2023-24లో రూ.14,810 కోట్లు, 2024-25లో రూ.15,730 కోట్లకు తగ్గింది. ఈ ఏడాది వర్షాలు సంవృద్ధిగా కురవడంతో జీవీఏ రూ.18,985 కోట్లు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆగస్టు, సెప్టెంబరు ఆరంభంలో కురిసిన అతి వర్షాలకు పత్తి, ఉల్లి, టమోటా పంటలు భారీగా దెబ్బతిన్నాయి. దీంతో జీవీఏ లక్ష్యం సాధ్యమేనా..? అనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఈ నెలల్లో రూ.1,530 కోట్లు అంటే 8.06 శాతం మాత్రమే లక్ష్యం చేరుకున్నారు. రాష్ట్రంలో 23వ స్థానంలో ఉంటే కొత్తగా ఏర్పడిన నంద్యాల జిల్లా 21వ స్థానంలో ఉంది. జిల్లాలో కేసీ కాలువ, తెలుగుగంగ, ఎస్సార్బీసీ.. వంటి సాగునీటి వనరుల ద్వారా సాగునీరు పుష్కలంగా అందుతున్నాయి. వ్యవసాయ రంగంలో జీవీఏ మెరుగ్గానే ఉంది.

పారిశ్రామిక రంగంలో..

పారిశ్రామిక రంగంలో రాబడి హెచ్చుతగ్గులు చూపుతుంది. ఈ రంగంలో స్థూల విలువ జోడింపు (జీవీఏ) 2022-23లో రూ.10,200 కోట్లు వస్తే, 2023-24లో రూ.9,050 కోట్లకు పడిపోయింది. ఆ తరువాత కాస్త పుంజుకొని రూ.10,092 కోట్లకు చేరింది. జిల్లాలో ఆశించిన స్థాయిలో పరిశ్రమలు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం.వస్తున్న అరకొర ఆదాయం కూడా కర్నూలు నగరంలో ఇండస్ట్రీస్‌, ఆదోని పట్టణంలోని పత్తి జిన్నింగ్‌ మిల్లుల ద్వారానే అధికంగా వస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరం 2025-26లో 11,774 కోట్లు జీవీఏ, గతేడాదిలో పోలిస్తే 17.68 శాతం వృద్ధిరేటు సాధించాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే రూ.2,434 కోట్లు రాబట్టి 20.67 శాతం లక్ష్యం సాధించి రాష్ట్రంలో 21వ స్థానంలో ఉంటే, నంద్యాల జిల్లా 23.35 శాతం సాధించి 15వ స్థానంలో ఉంది.

సేవల లక్ష్యం రూ.25,927 కోట్లు:

సేవల రంగం ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.25,927 కోట్లు స్థూల విలువ జోడింపు (జీవీఏ) సాధించాలని లక్ష్యం. గతేడాదిలో పోలిస్తే 15.73 శాతం వృద్ధి రేటు పెంచుకున్నారు. ఇప్పటి వరకు లక్ష్యంలో 5,616 కోట్లు (21.66 శాతం) రాబట్టి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచారు. నంద్యాల జిల్లా జీవీఏ లక్ష్యం రూ.18,266 కోట్లే. అయినా 22.32 శాతం లక్ష్యాన్ని చేరుకొని 14వ స్థానంలో ఉంది.

జిల్లా తలసరి ఆదాయం రూ.2,25,099

వ్యవసాయం, అనుబంధ రంగాలు, పరిశ్రమలు, సేవల రంగాలు ద్వారా సాధించే స్థూల విలువ జోడింపు(జీవీఏ), నికర పన్నులు (నెట్‌ టాక్సెస్‌) ద్వారా వచ్చే రాబడిని జిల్లా స్థూల ఉత్పత్తి (జీడీడీపీ)గా నిర్ణయిస్తారు. అందులో నికర జిల్లా స్థూల ఉత్పాదకత (ఎన్‌డీడీపీ) రాబడి ఆధారంగా జిల్లా ప్రజల సలసరి ఆదాయం లెక్కిస్తారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఎన్‌డీడీపీ రూ.55,235కోట్లు అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లా జనాభా 24,64,768 ఉన్నారు. ఈ లెక్కన జిల్లా తలసరి ఆదాయం రూ.2,25,099 అంచనా వేశారు. 2024-25లో ఎన్‌డీడీపీ రూ.47,250 కోట్లు కాగా, అప్పటి జనాభా 24,52,644 మందికి తలసరి ఆదాయం రూ.1,92,651లు నిర్ధారించారు. గత ఏడాదిలో పోలిస్తే తలసరి ఆదాయం రూ.31,448లు పెరిగింది. ఇవి అంకెలే వాస్థవ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. ఇప్పటికీ నెల జీతం రూ.8-10 వేలు కూడా లేని నిరుద్యోగులు ఎందరో ఉన్నారు. గ్రామీణ కూలీలకు ఏడాదిలో సగం రోజులు పనులే ఉండవు. నిరుపేదల తలసరి ఆదాయం ఎంత..? ఆర్థిక నిపుణుల వద్ద కూడా సమాధానం లేని ప్రశ్న ఇది.

ఆయా రంగంల్లో 2025-26 జీవీఏ లక్ష్యం, సాధించిన పురోగతి, సాధించాల్సిన లక్ష్యం.. రూ.కోట్లల్లో

వివరాలు వ్యవసాయం పరిశ్రమలు సేవలు

లక్ష్యం (టార్గెట్‌) 18,985 11,774 25,927

పెరుగుదల శాతం 18.26 17.68 15.73

సాధించిన లక్ష్యం 1,530 2,434 5,616

శాతం 8.06 20.67 21.66

సాధించాల్సిన లక్ష్యం 17,455 9,340 20,311

శాతం 91.94 79.33 78.44

Updated Date - Sep 15 , 2025 | 11:49 PM