బోగస్ హాజరుతో నిధులు నొక్కేశారు..!
ABN , Publish Date - Apr 10 , 2025 | 11:58 PM
బోగస్ హాజరుతో నిధులు నొక్కేశారు..!

వలసల నివారణకు సీజన్ హాస్టళ్లు
ఒక్కో కేంద్రానికి నెలకు రూ.80 వేలు ఇస్తున్న ప్రభుత్వం
బోగస్ హాజరుతో నిధులు స్వాహా చేసిన నిర్వహణ స్వచ్ఛంద సంస్థలు
ఫిబ్రవరిలో వెలుగులోకి తెచ్చిన ఆంధ్రజ్యోతి
సుమోటోగా లోకాయుక్త కేసు నమోదు
బ్లాక్ లిస్టులో ఏడు స్వచ్ఛంద సంస్థలు!
కర్నూలు, ఏప్రిల్ 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో సీజనల్ హాస్టళ్ల పేరిట జరుగుతున్న దోపిడీ వాస్తవమే. పేద విద్యార్థుల కడుపులు కొడుతున్నారు. విద్యార్థులు హాజరు కాకపోయినా బోగస్ హాజరు చూపించి నిధులు స్వాహా చేస్తున్నారు. ఈ భాగోతాన్ని ఆంధ్రజ్యోతి ఫిబ్రవరి నెలలో వెలుగులోకి తెచ్చింది. ఏపీ లోకాయుక్త సుమోటోగా కేసు నమోదు చేసింది. జిల్లా కలెక్టర్ పి.రంజిత్‌బాషా ఆదేశాల మేరకు జిల్లా విద్యా అధికారి శ్యాముల్ పాల్, సర్వశిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) ఏపీసీ శ్రీనివాసుల పర్యవేక్షణలో ఎంఈఓల నేతృత్వంలో మండల కమిటీలు వేసి విచారణ చేశారు. సీజనల్ హాస్టల్ నిర్వాహకులైన స్వచ్ఛంద సంస్థలు బోగస్ హాజరు చూపడమే కాకుండా హాజరైన విద్యార్థులకు సైతం మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాలు వడ్డించడం లేదని విచారణ అధికారులు నివేదికలు ఇచ్చారు. ఆ నివేదికల ఆధారంగా ఏడు స్వచ్ఛంద సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఎస్‌ఎస్‌ఏ ఏపీసీ శ్రీనివాసులు తెలిపారు.
కర్నూలుకు పశ్చిమ ప్రాంతం అంటేనే గుర్తుకొచ్చేది కరువు, వలసలు. ఇక్కడి ప్రాంతాల్లో తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు సైతం గుంటూరు, హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వలసలు వెళ్తున్నారు. దీంతో చిన్నారుల చదువులు మధ్యలోనే ఆగిపోతున్నాయి. విద్యార్థులు వలసలు నివారించాలనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం మంత్రాలయం, ఆలూరు. కోడుమూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో 34 సీజనల్ హాస్టళ్లు (కాలానుగుణ వసతి కేంద్రాలు) ఏర్పాటు చేశారు. నిర్వహణ బాధ్యతలు స్వచ్ఛంద సంస్థలు, గ్రామాల్లోని స్వయం సహాయక మహిళా పొదుపు సంఘాలకు అప్పగించారు. ప్రతి హాస్టల్‌లో 50 మంది విద్యార్థులకు భోజన వసతి కల్పించాలి. మధ్యాహ్న భోజనం పాఠశాలలో తింటే.. ఉదయం అల్పాహారం, రాత్రి భోజనం, సెలవు రోజుల్లో మధ్యాహ్నం కూడా భోజనం వడ్డించాలి. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి రూ.వెయ్యి, కేర్ టేకర్, ట్యూటర్, ఇద్దరు వంట మనుషులు రూ.30 వేలు జీతం చొప్పున ఒక్కొ సీజనల్ హాస్టల్‌కు రూ.80 వేలు నిధులు ఇస్తుంది. 34 సీజనల్ హాస్టళ్లకు నెలకు రూ.27.20 లక్షలు ఖర్చు చేస్తోంది.
బ్లాక్ లిస్టులో ఏడు స్వచ్ఛంద సంస్థలు
క్షేత్రస్థాయిలో విచారించిన మండల విద్యాశాఖ అధికారులు, ప్రత్యేక అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా సీజన్ హాస్టళ్లు నిర్వహిస్తున్న ఏడు స్వచ్ఛంద సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టినట్లు ఏపీ సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్‌ఎస్‌ఏ) అడిషినల్ ప్రాజెక్టు కో-ఆర్డినేటర్ శ్రీనివాసులు ఆంధ్రజ్యోతికి తెలిపారు.
కోసిగి జడ్పీ హైస్కూల్ (బాలికలు)-1 (రూరల్ యాక్టివిటీ డెవలప్‌మెంట్ సంస్థ)
కోసిగి జడ్పీ హైస్కూల్ (బాలికలు)-2 (రూరల్ అర్బన్ డెవలప్‌మెంట్ సొసైటీ)
పత్తికొండ మండలం పందికోన ఎంపీపీఎస్-1 (సుకన్య విలేజ్ ఆర్గనైజింగ్)
పత్తికొండ మండలం పందికోన-2 ఎంపీపీఎస్ (సుకన్య విలేజ్ ఆర్గనైజింగ్)
ఆదోని మండలం పెద్దహరివాణం జడ్పీ హైస్కూల్ (శ్రీలక్షి వెంకటేశ్వర స్వచ్ఛంద సంస్థ)
ఆదోని మండలం పెద్దహరివాణం జడ్పీ హైస్కూల్ (గజిలింగేశ్వర స్వచ్ఛంద సంస్థ)
క్రిష్ణగిరి మండలం కంబలపాడు జడ్పీ హైస్కూల్ (శారద పొదుపు సంఘం)
అదేవిధంగా పత్తికొండ మండలం దూదేకొండ ఎంపీపీ స్కూల్ సీజన్ హాస్టల్ నిర్వహిస్తున్న సంధ్య స్వచ్ఛంద సంస్థ, జూటూరు ఎంపీపీ స్కూల్ సంజీవకుమార్ స్వచ్ఛంద సంస్థ, తుగ్గలి మండలం జి.ఎర్రగుడి ఎంపీపీ స్కూల్ సీజనల్ హాస్టల్ నిర్వహించే మారుతి సంస్థలకు ఇచ్చే నిధుల్లో 20 శాతం కోత పెట్టారు. మంత్రాలయం మండలం రచ్చుమర్రి ఎంపీపీ స్కూల్‌లో సీజనల్ హాస్టల్ నిర్వహణ షర్మిల పొదుపు సంఘం, మాధవరం ఎంపీపీ స్కూల్‌లోని హాసల్ నిర్వహణ సంస్థ వీరన్నస్వామి పొదుపు సంఘాలకు 30 శాతం, కౌతాళం జడ్పీ ఉన్నత పాఠశాలలోని కీర్తి ఎడ్యుకేషనల్ రూరల్ డెవలప్‌మెంట్ సంస్థ, మంత్రాలయం మండలం బూదూరు గ్రామంలో సీజనల్ హాస్టల్ నిర్వహించే కలబందు కళాపరిషత్ స్వచ్ఛంద సంస్థకు 15 శాతం చొప్పున నిధుల్లో కోత పెట్టినట్లు వివరించారు. ఇవే తప్పులే పునారావృత్తమే ఆర్‌ఆర్ యాక్ట్ కింద రికవరీ చేస్తామని హెచ్చరించారు.
ఆంధ్రజ్యోతి తనిఖీలో వెలుగులోకి..
సీజనల్ హాస్టళ్లను నిబంధనల ప్రకారం నిర్వహిస్తున్నారా..? మెనూ ప్రకారం భోజనాలు వడ్డిస్తున్నారా..? విద్యార్థుల సేవలో ఏమేరకు తరిస్తున్నాయి..? సీజనల్ హాస్టళ్లను ఫిబ్రవరి 23న ఆంధ్రజ్యోతి ఆకస్మికంగా తనిఖీ చేస్తే అత్యంత దారుణమైన నిజాలు వెలుగు చూశాయి. మెజార్టీ హాస్టళ్లలో సగం కంటే తక్కువ విద్యార్థులే ఉన్నారు. వారికైనా రుచికరమైన భోజనం వడ్డించారా..? అంటే అదీలేదు. నీళ్ల చారు, ఉడికీఉడకని ముద్దన్నంతో సరిపుచ్చారు. కేర్ టేకర్, ట్యూటర్లు అందుబాటులో లేరు. సగం మంది విద్యార్థులు కూడా హాజరు కాకపోయినా 95 శాతం హాజరైనట్లు రికార్డులు చూపి నిధులు స్వాహా చేస్తున్నట్లు వెలుగు చూసింది. ఆంధ్రజ్యోతి కథనాన్ని సుమోటోగా తీసుకొని ఏపీ లోకాయుక్త కేసు నమోదు చేసింది. విచారణ చేసి నివేదిక ఇవ్వాలంటూ ఎస్‌ఎస్‌ఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.