4,500 ఎకరాల్లో పండ్ల తోటల సాగు
ABN , Publish Date - May 03 , 2025 | 11:00 PM
జిల్లాలో 4,500 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యంగా ఉందని ఉపాధి హామీ పీడీ వెంకటసుబ్బయ్య తెలిపారు.
జిల్లాలో 82వేల మంది ఉపాధి కార్మికులు
కార్మికుల ఖాతాల్లో పెండింగ్ వేతనాలు జమ
ఉపాధి హామీ పీడీ వెంకటసుబ్బయ్య
చాగలమర్రి, మే 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 4,500 ఎకరాల్లో పండ్ల తోటల సాగు లక్ష్యంగా ఉందని ఉపాధి హామీ పీడీ వెంకటసుబ్బయ్య తెలిపారు. శనివారం చాగలమర్రి ఎంపీడీవో కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధి శ్రామికుల సంఖ్యను పెంచాలని, నీటి కుంటలు తవ్వుకునేలా చూడాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో 82వేల మంది ఉపాధి కార్మికులు పనులు చేస్తున్నారన్నారు. రెండు రోజుల్లో లక్ష వరకు ఉపాధి శ్రామికుల సంఖ్య లక్ష్యం ఉందన్నారు. పంటలు సాగు చేసే రైతులకు 100శాతం రాయితీ ఉంటుందని, డ్రిప్ స్ర్పింక్లర్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం, ఇతరులకు 50 శాతం సబ్సిడీ ద్వారా పంపిణీ చేస్తారన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉపాధి వేతనాల బకాయిలు మార్చి చివరి వరకు మంజూరయ్యాయని అన్నారు. రూ.40 కోట్లు ఉపాధి వేతనాలు ఉపాధి కార్మికుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. చాగలమర్రి మండలంలో ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ల పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేంద్రప్రసాద్, ఈవోఆర్డీ తాహిర్‌హుసేన్, కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు.