రోడ్డు ప్రమాదంలో స్నేహితుల దుర్మరణం
ABN , Publish Date - Nov 23 , 2025 | 11:59 PM
ఆగి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద జాతీయ రహహదారిపై ఆదివారం తెల్లవారుఝామున జరిగింది.
తొమ్మిది మందికి గాయాలు.. నలుగురి పరిస్థితి ఆందోళనకరం
ఆగి ఉన్న ప్రైవేటు బస్సును వెనుక నుంచి ఢీకొట్టిన లారీ
ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట వద్ద ఘటన
ఆళ్లగడ్డ, నవంబరు 23(ఆంరధజ్యోతి): ఆగి ఉన్న ప్రైవేటు బస్సును లారీ ఢీకొట్టడంతో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. తొమ్మిది మంది గాయపడగా.. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం ఆళ్లగడ్డ మండలంలోని పేరాయిపల్లె మెట్ట వద్ద జాతీయ రహహదారిపై ఆదివారం తెల్లవారుఝామున జరిగింది. వివరాలివీ.. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేటు బస్సు హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి 33 మంది ప్రయాణికులతో శనివారం పాండిచ్చేరికి బయలు దేరింది. ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లె మెట్ట వద్దకు రాగానే ఇద్దరు ప్రయాణికులు బహిర్భూమికి వెళ్లాలని డ్రైవర్‌ను కోరడంతో ఆయన బస్సును రోడ్డు పక్కన నిలిపారు. అయితే వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. దీంతో బస్సులో వెనుక సీట్లో కూర్చున్న పాండిచ్చేరికి చెందిన పి.హరిత(23), జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన గడ్డం బద్రీనాథ్ (25) అక్కడికక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌కు చెందిన చీపు శ్రీవాణి, వంశీ, బండ్ల శ్రావ్య, సాయివంశీ, అమలాపురానికి చెందిన ఎం.గణేశ్, రాయచోటికి చెందిన ఖాదర్‌వలి, ఆశాభేగం, కాజీపేట మండలం మిడుతూరు గ్రామానికి చెందిన అల్లూరి దొరస్వామి, చెన్నూరుకు చెందిన సుబ్బయ్య, అలాగే హైదరాబాద్‌కు చెందిన లారీ డ్రైవర్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆళ్లగడ్డ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఖాదర్‌వలి, ఆశాభేగం, బండ్ల శ్రావ్య, సురేశ్‌ను నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్, సీఐలు మురళీధర్‌రెడ్డి, యుగంధర్, ఎస్‌ఐ జయ్యప్ప ఘటనా స్థలానికి చేరుకొని లారీలో ఇరుక్కొని ఉన్న డ్రైవర్‌ను క్రేన్ సాయంతో బయటి తీసి 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ నలుగురిని మెరుగైన చికిత్స కోసం నంద్యాల ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
విహార యాత్రకు బయలుదేరి అనంత లోకాలకు..
గడ్డం బద్రీనాథ్, హరిత స్నేహితులు. వీరు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. పాండిచ్చేరిలో ఉన్న స్నేహితులను కలిసి అక్కడే విహార యాత్రకు వెళ్లాలని హైదరాబాద్ నుంచి బయలుదేరారు. సీటు నెంబరు ఎఫ్-6 బద్రీనాథ్‌కు, ఎఫ్-2 హరితకు రిజర్వ్ అయింది. అయితే తనకు రిజర్వ్ అయిన ఎఫ్-2 సీట్‌లో కూర్చోవాలని హరిత ఎఫ్-4 సీటులో కూర్చున్న హైదరాబాద్‌కు చెందిన నరసింహారెడ్డిని విజ్ఞప్తి చేసింది. దీంతో ఇద్దరూ తమ సీట్లను ఎక్సేంజ్ చేసుకున్నారు. స్నేహితులిద్దరూ సమీపంలోని సీట్లలో కూర్చున్నారు. అయితే రోడ్డు ప్రమాదంలో ఇద్దరూ మృతి చెందారు.
కష్టపడి చదివించిన తల్లిదండ్రులు
జోగులాంబ గద్వాలకు చెందిన లక్ష్మీనారాయణ, రమాదేవి కుమారులు గడ్డం బద్రీనాథ్, గడ్డం సాయిని తల్లిదండ్రులు కష్టపడి చదించారు. బద్రీనాథ్ బీటెక్ పూర్తి చేసి హైదరాబద్ లోని ఇన్ఫోసెస్ కంపెనీలో ఏడాది క్రితం ఉద్యోగం సంపాదించాడు. అలాగే చిన్న కుమారుడు సాయి ముంబైలో బెటెక్ చేస్తున్నాడు. తండ్రి లక్ష్మీనారాయణ వాచ్ రిపేరి సెంటర్ ద్వారా, తల్లి రమాదేవి టైలరింగ్ చేస్తూ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. చేతికి అందిన కుమారుడు తిరిగి రాని లోకాలు వెళ్లి పోవడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకొన్నాయి.
ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఎస్పీ
ఘటనా స్థలాన్ని సునీల్ షెరాన్ పరిశీలిం చారు. ప్రమాద వివరా లను డీఎప్పీ ప్రమోద్, సీఐలు మురళీఽ దర్‌రెడ్డి, యుగంఽ దర్‌ను అడిగి తెలుసుకున్నారు.