అద్దె వాహనం పేరుతో అక్రమాలు
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:47 AM
: డివిజన్ లెవెల్ పంచాయతీ అధికారులు అద్దె వాహనం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ముందడుగు వేదిక జిల్లా అధ్యక్షుడు దేశాయి చంద్రన్న ఆరోపించారు.
స.హ చట్టం ద్వారా వెలుగులోకి
ఆదోని అగ్రికల్చర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): డివిజన్ లెవెల్ పంచాయతీ అధికారులు అద్దె వాహనం పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని ముందడుగు వేదిక జిల్లా అధ్యక్షుడు దేశాయి చంద్రన్న ఆరోపించారు. శనివారం ఆయన భీమాస్ హాలులో స.హ. చట్టం కార్యకర్తలతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జీవో ఎమ్మెస్ నెంబర్ 87, 1/7/2017 ప్రకారం డీఎల్‌పీవో కార్యాలయ అధికారులు వినియోగిస్తున్న అద్దె వాహనాలు, అద్దె చెల్లింపు వివరాలు ఇవ్వాలని స.హ చట్టం కార్యకర్త శాంతకుమార్ దరఖాస్తు చేసుకున్నారన్నారు. 2017 ఏప్రిల్ ఒకటి నుంచి 2024 నవంబరు 30 వరకు రెండు వాహనాలు వినియోగించినట్లు, అందుకు రూ.20లక్షలు వాహన యజమాని ప్రతాప్‌నకు చెల్లించినట్లు సమాచారం ఇచ్చారన్నారు. ఏపీ 21 ఏఎస్4760, ఏపీ 39 యూబీ 1554 ఎల్లో బోర్డు వాహనాలు వినియోగిస్తున్నట్లు తెలిపారన్నారు. కాగా ఈ వాహనాలకు సంబంధించిన వివరాల కోసం జిల్లా రవాణా శాఖ అధికారికి దరఖాస్తు చేసుకున్నామన్నారు. ఏపీ 21 ఏఎస్ 4760 వాహనం మోటార్ సైకిల్ అని, మరో వాహనం ఎల్లో బోర్డు అని తెలియజేశారని వివరించారు. కాగా కార్యాలయానికి అద్దె ప్రాతిపదికన వాహనాలు నాలుగు చక్రాలవి మాత్రమే వాడాలని తెలిపారన్నారు. అయితే మోటార్ సైకిల్ నెంబర్‌తో రూ.20 లక్షల ప్రజాధనాన్ని స్వాహా చేశారని ఆరోపించారు. దీనిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై కలెక్టర్, ఏసీబీ, జిల్లా పంచాయతీ అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. పంచాయతీ అధికారులు తిమ్మక్క, నూర్జహాన్, శ్రీనివాసులుపై చర్యలు తీసుకుని దుర్వినియోగమైన నిధులను రాబట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ముందడుగు వేదిక కార్యకర్తలు శాంతకుమార్, కృష్ణన్న, రవి తదితరులు పాల్గొన్నారు.