Share News

సనాతన ధర్మం కోసం..

ABN , Publish Date - Sep 10 , 2025 | 11:08 PM

సనాతనవేదిక ధర్మంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇస్కాన్‌ చేపట్టిన పాదయాత్ర బుధవారం రుద్రవరం మండలానికి చేరుకుంది.

సనాతన ధర్మం కోసం..
పాదయాత్రలో శంఖం పూరిస్తున్న అర్చకుడు

భగవద్గీతపై దేశవ్యాప్త ప్రచారం ఫ ఏడోసారి పాదయాత్ర

రుద్రవరం, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సనాతనవేదిక ధర్మంపై ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఇస్కాన్‌ చేపట్టిన పాదయాత్ర బుధవారం రుద్రవరం మండలానికి చేరుకుంది. సనాతన ధర్మం కోసం ఎద్దుల బండితో చేపడుతున్న పాదయాత్ర ఇప్పటికే ఆరుసార్లు పూర్తిగా ప్రస్తుతం ఏడోసారి దేశవ్యాప్తంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఇస్కాన్‌ ప్రతినిధి ఆచార్యదాస్‌ పలు ఆసక్తికర విషయాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు. సనాతన హిందూ ధర్మం ఎంతో గొప్పదని, దాన్ని కాపాడేందుకు ప్రజల్లో చైతన్యం తెస్తూ తాము పాదయాత్రకు శ్రీకారం చుట్టామన్నారు. కేదార్‌నాథ్‌, బద్రినాథ్‌, ద్వారక, పూరి, శ్రీకూర్మం క్షేత్రాలను తిరిగామన్నారు. అక్కడి నుంచి మంగళగిరి, గుంటూరు, మార్కాపురం, గిద్దలూరు మీదుగా నంద్యాల, రుద్రవరం, అహోబిళం క్షేత్రానికి వెళ్తున్నామన్నారు. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తూ ప్రతి గ్రామంలో ప్రజలతో మమేకమై హిందూ సంస్కృతిని తెలియజేస్తున్నామన్నారు. అహోబిళం తర్వాత తిరుపతి, రామేశ్వరం వరకు పాదయాత్ర సాగుతుందన్నారు. ప్రతి రోజూ ఎద్దులబండితో పాటు పది కిలోమీటర్లు యాత్ర కొనసాగుతుందన్నారు. 1984లో తొలిసారిగా ద్వారకలో మొదలైన ఈ యాత్ర ఆరుసార్లు పూర్తి చేసుకుందన్నారు. ఏడో యాత్ర 2021లో ప్రారంభించామన్నారు. ఇస్కాన్‌ ప్రతినిధులు మహారాష్ట్రకు చెందిన ఆచార్యదాస్‌, మోహన్‌ గోపాల్‌, భద్ర బలరామ్‌దాస్‌, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అమలవి మైదాస్‌, తదితరులు సనాతన ధర్మంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇదిలా ఉండగా బుధవారం రుద్రవరం మండలంలోని సంతాన వేణుగోపాల స్వామి ఆలయంలో ఇస్కాన్‌ బృందం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - Sep 10 , 2025 | 11:08 PM