Share News

30 రోజులుగా...

ABN , Publish Date - Dec 15 , 2025 | 11:32 PM

ఆదోని జిల్లా కోసం 30 రోజులుగా ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. 30 రోజులుగా ఆదోనిలో వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున చేరుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు.

30 రోజులుగా...
ఆదోని జిల్లాను ప్రకటించాలంటున్న దివ్యాంగులు

ఆదోని జిల్లా కోసం కొనసాగుతున్న నిరసనలు

ప్రజాకాంక్షను నెరవేర్చకపోతే మరింతగా ఉద్యమం

పోరులో ప్రజాసంఘాలు, రాజకీయ నాయకులు

మేము సైతం అంటూ దివ్యాంగులు

ఆదోని అగ్రికల్చర్‌, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఆదోని జిల్లా కోసం 30 రోజులుగా ఉద్యమాలు ఉధృతమవుతున్నాయి. 30 రోజులుగా ఆదోనిలో వివిధ వర్గాల ప్రజలు పెద్దఎత్తున చేరుకుని రిలే నిరాహార దీక్షలు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో చలనం రాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేందుకు కూడా వెనుకాడబోమంటూ నిరసనకారులు భీష్మించుకున్నారు. కరువుకు నిలయమైన పశ్చిమ ప్రాంత ప్రజల ఆకాంక్షను ప్రభుత్వం నెరవేర్చకపోతే ఉవ్వెత్తున ఉద్యమం తప్పదని ఆదోని జిల్లా సాధన జేఏసీ నాయకులు రఘురామయ్య కృష్ణకమూర్తి గౌడ్‌, అశోక్‌ నందారెడ్డి, కోదండ, కొంకనూరు వీరేష్‌, దస్తగిరి అన్నారు. ఉద్యమంలో భాగంగా 30వ రోజు సోమవారం ఆదోని జిల్లా సాధన కోసం దివ్యాంగులు నిరసనదీక్ష చేపట్టారు. విజేత వికలాంగుల సమైక్య సంఘం నాయకులు వీరాంజనేయులు, దుర్గప్ప, నందీశ్వర్‌, హనుమంత్‌ రెడ్డి, మల్లికార్జున, రామాంజనేయులు, పకీరప్ప పాలాక్షి, మల్లయ్య, నమోజి దేవయ్య, హనుమంతు కూర్చున్నారు. ఆదోని మొబైల్‌ షాప్‌ అసోసియేషన్‌ నాయకులు ఫయాజ్‌, దీపక్‌ విజయ్‌, హరి, సుధా, రమేష్‌, మున్సిపల్‌ మైదానం నుంచి వీధుల్లో ర్యాలీ చేపట్టి దీక్ష శిబిరం వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదోని ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమని అయితే పాలకులు అభివృద్ధిని విస్మరించారన్నారు. ఆదోని జిల్లా చేయడానికి అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. వెనుకబడిన పశ్చిమ ప్రాంత నియోజకవర్గాల నిరుద్యోగ యువతకు ఉపాధి లభించాలన్నా, ఉన్నత విద్య అందాలన్నా, అక్షరాస్యత శాతం పెరగాలన్న జిల్లా కావాల్సిందేనని అన్నారు. ఇప్పటికైనా పాలకులు తమ గోడును విని జిల్లా చేయాలని లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Updated Date - Dec 15 , 2025 | 11:32 PM