Share News

అన్నదాతకు కడుపార భోజనం

ABN , Publish Date - Nov 09 , 2025 | 12:22 AM

రైతన్న తమ పంట దిగబడులను అమ్ముకునేందుకు ఎంతో వ్యయప్రయాసలతో మార్కెట్‌ యార్డులకు వస్తారు. ఇక్కడ గంటల, రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులు. అలాంటప్పుడు చేతిలో డబ్బులు లేక.. ఆకలితో అలమటించేవాడు. ఈ కష్టాన్ని గుర్తించిన కర్నూలు మార్కెట్‌ కమిటీ ఇస్కాన్‌ ధార్మిక సంస్థతో కలిసి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రూ.15కే భోజనం అందించేందుకు 20

అన్నదాతకు కడుపార భోజనం
భోజనం చేస్తున్న రైతులు

2016 నుంచి ‘రూ.15కే భోజనం’ అమలు

ఇస్కాన్‌ సహకారంతో నిర్వహిస్తున్న మార్కెట్‌ కమిటీ

కర్నూలు అగ్రికల్చర్‌, నవంబరు 8ఆంధ్రజ్యోతి): అన్నదాతల ఆకలిని తీర్చి వారికి కడుపార భోజనం అందిస్తోంది మార్కెట్‌ కమిటీ. రూ.15కే భోజన పథకం ఎలాంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతోంది. ఇస్కాన్‌ సంస్థ సహకారంతో అధికారులు, పాలకవర్గం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. రైతులు కేవలం రూ.15లు, మార్కెట్‌ కమిటి రూ.20లు, మిగిలిన మొత్తాన్ని ఇస్కాన్‌ ధార్మిక సంస్థ భరించేలా ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. 2016లో తెలుగుదేశం ప్రభుత్వ ఆధ్వర్యంలో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఈ పథకాన్ని డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి కర్నూలు మార్కెట్‌ యార్డులో ప్రారంభించారు. ఏటా లక్ష మంది రైతులు ఈ భోజన పథకం వల్ల ప్రయోజనం పొందుతున్నారు. అదే విదంగా ప్రతి సంవత్సరం రూ.12లక్షల దాకా ఈ పథకానికి ఖర్చు చేస్తున్నట్లు కర్నూలు మార్కెట్‌ కమిటీ సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ జయలక్ష్మి తెలిపారు.

అర్ధాకలితో ఇంటి ముఖం..

చేతికందిన పంట ఉత్పత్తులను అమ్ముకునేందుకు రైతులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్‌ యార్డులో కనీసం పంట సాగుకు తెచ్చిన పెట్టుబడులను కూడా వ్యాపారుల నుంచి దక్కని సమయాల్లో అర్ధాకలితోనే ఇంటి ముఖం పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంతలో కొంతైనా రైతులను ఆదుకోవాలని, వారి ఆకలి తీర్చాలని అప్పటి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ శమంతకమణి ఇస్కాన్‌ ధార్మిక సంస్థ ప్రతినిధులను ఒప్పించి తక్కువ ధరకే భోజనం అందించే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగించడంలో కర్నూలు మార్కెట్‌ కమిటీ అధికారులు, పాలకవర్గం అంకిత భావంతో పని చేస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులంతా పంట ఉత్పత్తులను అమ్ముకుని యార్డులోనే కేవలం రూ.15కే కడుపార భోజనం చేస్తున్నారు.

రోజూ 500 మంది రైతులు

రైతుల కోసం తక్కువ ధరకే అమలు చేస్తున్న భోజన పథకానికి విశేష స్పందన కనిపిస్తుంది. రోజూ 500ల నుంచి 600 మంది రైతులు రుచిరకరమైన భోజనం చేస్తున్నారు. ఈ పథకానికి ఏటా రూ.12 లక్షల దాకా ఖర్చు చేస్తున్నామని, ఈ ఖర్చు పెరిగినా ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నారు. జిల్లా అంతటా ఈ భోజన పథకాన్ని అమలు చేసేందుకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం ఇస్కాన్‌ ప్రతినిధులు కర్నూలు మార్కెట్‌ యార్డులోనే భోజనం తయారు చేసి వాహనంలో ఆదోని మార్కెట్‌ యార్డు కూడా తీసుకెళ్లి అక్కడి రైతులకు భోజనం అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని 15 మార్కెట్‌ కమిటీలలో కేవలం కర్నూలు, ఆదోని మార్కెట్‌ కమిటీలలోనే ఈ భోజన పథకం అమలు చేస్తున్నారు.

సంతోషంగా ఉంది

కర్నూలు మార్కెట్‌ యార్డులో కేవలం రూ.15కే కడుపు నిండా భోజనాన్ని అందించే పథకాన్ని అమలు చేస్తున్నారు.. ఎన్నో కష్టనష్టాలో ఉన్న తమకు ఈ భోజన పథకం అమలు ఎంతో ఊరట ఇస్తోంది. ఉల్లి సీజన్‌లో కూడా రెండు పూటలా అమలు చేయడం సంతోషకరం. - గోవిందు, రైతు, కృష్ణగిరి

నిరంతరం అమలు చేస్తున్నాం

2016లో కర్నూలు మార్కెట్‌యార్డులో రూ.15కే భోజనం అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాం. ఆటంకాలు లేకుండా నిరంతరం అమలు చేస్తున్నాం. ఇటీవల ఉల్లి రైతులకు రాత్రి పూట కూడా భోజనం అందించాంం. - జయలక్ష్మి, సెలక్షన్‌ గ్రేడ్‌ సెక్రెటరీ, మార్కెట్‌యార్డు, కర్నూలు

Updated Date - Nov 09 , 2025 | 12:22 AM