విజయవాడకు విమానం
ABN , Publish Date - May 21 , 2025 | 12:10 AM
విజయవాడకు విమానం
జూలై 2 నుంచి సర్వీసులు ప్రారంభం
కర్నూలు నుంచి వారంలో మూడు రోజులు
కర్నూలు, మే 20 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లావాసులకు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శుభవార్త అందించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కర్నూలు - విజయవాడ విమాన సర్వీసులు కొనసాగించేం దుకు ముహూర్తం నిర్ణయించారు. జూలై 2న కర్నూలు నుంచి విజయవాడకు వెళ్లే తొలి విమానం కర్నూలు (ఓర్వకల్లు) ఎగరనుంది. వారంలో మూడు రోజులు ఈ సర్వీసులు నడపనున్నారు. కర్నూలు నుంచి విజయవాడ వెళ్లాలంటే ఆర్టీసీ బస్సు, రైల్వే రవాణా సౌకర్యం ఉంది. సుమారు 500 కిలోమీటర్లు దూరం ఉంది. 8 గంటలు ప్రయాణం చేయాల్సి వచ్చేది. దీంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. కర్నూలు (ఓర్వకల్లు) విమానాశ్రయం నిర్మించినా గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల రాజధాని అమరావతికి విమానాయాన సౌకర్యం అందుబాటులోకి రాలేదు. ప్రధాని మోదీ సారథ్యంలోని ఎన్డీఏ-3.0 ప్రభుత్వంలో కేంద్ర పౌర విమానాయాన శాఖ మంత్రిగా కింజారపు రామోహ్మన్‌నాయుడు బాధ్యతలు చేపట్టడం, మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎట్టకేలకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు స్పందించారు. ఎన్నో ఏళ్ల స్వప్నం సాకారం కాబోతుండడంతో ప్రజా ప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. కర్నూలు విమానాశ్రయం నుంచి విజయవాడ సహా విశాఖపట్నం, బెంగ ళూరు, చెన్నై, షిర్డీ. ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు నడపాలని మంత్రి టీజీ భరత్, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత తదితరులు సీఎం చంద్రబాబు, కేంద్ర విమాన యాన శాఖ మంత్రి కింజారపు రామోహ్మన్ నాయుడుల దృష్టికి తీసుకె ళ్లారు. ఆయన హామీ ఇచ్చిన వారం రోజుల్లోపే విమాన సర్వీస్‌ను నడపనున్నట్లు వెల్లడించారు. ఈ అవకాశంపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
వారంలో మూడు రోజులు
కర్నూలు నుంచి విజయవాడకు సోమ, బుధ, శుక్రవారం వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడిపేలా షెడ్యూలు ఖరారు చేశారు. ఈ విమానం విజయవాడ ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 3:45 గంటలకు బయల్దేరి కర్నూలు విమానాశ్రయానికి 4:50 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగుప్రయాణంలో సాయంత్రం 5:10 గంటలకు బయల్దేరి 6:15కు విజయవాడకు చేరుకుంటుంది. విమాన సర్వీసులో ఒకరికి రూ.2,506గా టికెట్ ధరగా ఖరారు చేశారు.
ఎన్నో ఏళ్ల కల సాకారం
ఉమ్మడి కర్నూలు జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలంటే విమాన సర్వీసులు ఎంతో ముఖ్యం. విజనరీ సీఎం చంద్రబాబు పదేళ్ల క్రితమే గుర్తించి ఓర్వకల్లు కేంద్రంగా 18 నెలల్లో విమానాశ్రయం నిర్మించి చరిత్ర సృష్టించారు. జూలై 2 నుంచి వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడిపేందుకు కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు ప్రత్యేక శ్రద్ధ చూపడం అభినందనీయం.
- టీజీ భరత్, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
మాట నిలుపుకున్న కేంద్ర మంత్రి
ఈ నెల 16న కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు కర్నూలుకు వచ్చారు. ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విజయవాడకు విమాన సర్వీసు నడపాలని విన్నవించాం. ఐదు రోజుల్లో మాట నిలుపుకున్నారు. జూలై 2 నుంచి సర్వీసు ప్రారంభిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆయనకు కృతజ్ఞతలు.
- బస్తిపాటి నాగరాజు, కర్నూలు ఎంపీ
ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి
ఓర్వకల్లు విమానాశ్రయం నుంచి విజయవాడకు విమాన సర్వీసు రావడం సంతోషకరం. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని ఒప్పించి ఈ సౌకర్యాన్ని కల్పించాం. ప్రజలు ఈ విమాన సర్వీసులను సద్వినియోగం చేసుకోవాలి. తమ విజ్ఞప్తిని స్వీకరించి అమలు చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుకు కృతజ్ఞతలు.
- బైరెడ్డి శబరి, నంద్యాల ఎంపీ
జిల్లా ప్రజల కల
జిల్లా నుంచి విజయవాడకు విమాన సర్వీసును ఎన్నో ఏళ్లుగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వారంలో మూడు రోజులు విమాన సర్వీసులు నడిపేలా కేంద్రం నిర్ణయం తీసుకోవడం సంతోషంగా ఉంది. హైదరాబాదు-ఓర్వకల్లుకు కూడా విమాన సర్వీసులు నడపాలని కోరుతున్నాం.
- మల్లెల రాజశేఖర్, టీటీడీ బోర్డు సభ్యులు