Share News

తీరు మార్చుకోని మత్స్యశాఖ

ABN , Publish Date - Dec 31 , 2025 | 12:05 AM

పందికోన రిజర్వాయర్‌ చేపల వేలాలను మత్స్యశాఖ అధికారులు ఎప్పటిలాగే తూతూమంత్రంగా ముగించారు.

తీరు మార్చుకోని మత్స్యశాఖ
పందికోన రిజర్వాయర్‌ చేపల వేలాలు నిర్వహిస్తున్న మత్స్యశాఖ అధికారులు

10 నిమిషాల్లో చేపల వేలాలు పూర్తి చేసిన వైనం

రూ .4లక్షలకు లీజు

పత్తికొండ, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): పందికోన రిజర్వాయర్‌ చేపల వేలాలను మత్స్యశాఖ అధికారులు ఎప్పటిలాగే తూతూమంత్రంగా ముగించారు. మంగళవారం ఉదయం 11గంటలకు ఎఫ్‌డీవోలు నాగరాజు, మద్దిలేటి పత్తికొండ మండల పరిషత్‌ సమావేశభవనంలో ముందస్తు ప్రకటించిన ప్రకారం వేలాలను ప్రారంభించారు. 12 గంటల ప్రాంతంలో కొందరు వేలం పాటలు పాడేందుకు అక్కడికి చేరుకున్నారు. కొద్దిసేపటికే లేచివెళ్లిపోయారు. కాగా పందికోన రిజర్వాయర్‌ సమీప గ్రామాలైన పందికోన, కొత్తపల్లి గ్రామాలకు చెందినవారి నడుమ ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో చేపల వేలాలపై వాదనలు చోటుచేసుకోవడంతో మధ్యాహ్నం 1.30 వరకు వేలం పాటలకు ఒక్కరు కూడా ధరావత్తు చెల్లించలేదు. 1.30 ప్రాంతంలో వ్యాపారులతోపాటు పందికోన, కొత్తపల్లి గ్రామాలకు చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకున్నారు. ఇద్దరు వ్యక్తులు రూ15వేలు ధరావత్తు చెల్లించిన వెంటనే ఎఫ్‌డీవో నాగరాజు ఇంకా ఎవరైనా ధరావత్తు చెల్లిస్తారా? అనే ప్రకటన చేయకుండానే రూ.3.78లక్షల ప్రభుత్వ పాటగా వేలాన్ని ప్రారంభించారు. తమ శాఖ అఽధికారి నిబంధనలు పాటించకుండా వేలాలను నిర్వహిస్తున్నట్లు గమనించిన పక్కనున్న మరో ఎఫ్‌డీవో ధరావత్తు చెల్లించేవారు ఉన్నారా అని ప్రకటించారు. దీంతో ఈ ఇద్దరు వ్యాపారుల ధరావత్తు ఆధారంగా 10నిమిషాల్లో అధికారులు వేలాలను ముగించి రూ.4.05లక్షలకు ఓ వ్యాపారికి ఏడాది అనుతులు మంజూరు చేశారు. ఈ తీరు మీద పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మత్స్యశాఖ అధికారులు ముందస్తు నిర్ణయించుకున్న మేరకే ఇలా జరిగిందనే విమర్శలు ఉన్నాయి.

రిజర్వాయర్‌ బండ్‌ను చేపల వ్యాపారులు వినియోగించరాదు

పందికోన రిజర్వాయర్‌ చేపల వేలం పాటలు ముగిశాక హెచ్‌ఎన్‌ఎ్‌సఎ్‌స అధికారిణి విజయకుమారి వ్యాపారులకు పలుసూచనలు చేశారు. చేపలు పట్టేందుకు, జాలర్లు నివసించేందుకు గుడిసెలు వేసుకునేందుకు రిజర్వాయర్‌ బండ్‌ను వినియోగించరాదని అన్నారు. రిజర్వాయర్‌ బండ్‌పై ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఇకపై బండ్‌ను ఈ కార్యక్రమాలకు ఉపయోగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 12:05 AM