Share News

పందికోనలో చేపల చోరులు

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:01 PM

పందికోన రిజర్వాయరులో అక్రమార్కులు చేపల వేట సాగిస్తూ ప్రభుత్వ నిబంధనలను నీరు గారుస్తున్నారు.

పందికోనలో చేపల చోరులు
పందికోన రిజర్వాయరులో చేపలు పడుతున్న దృశ్యం

జూన్‌ 30తోనే ముగిసిన గడువు

యథేచ్ఛగా అక్రమ చేపల రవాణా

రూ.50 లక్షల దాకా దోపిడీ

పందికోన రిజర్వాయరులో అక్రమార్కులు చేపల వేట సాగిస్తూ ప్రభుత్వ నిబంధనలను నీరు గారుస్తున్నారు. మత్సశాఖ ఆధ్వర్యంలో చేపల వేటకు ఈ ఏడాది జూన్‌ 30 వరకే అనుమతులు ముగిశాయి. ఆ తర్వాత ఈ నాలుగు నెలలుగా కొందరు అక్రమార్కులు రిజర్వాయరులో చేపల వేట సాగిస్తూ రూ. లక్షల విలువ చేసే చేపలను ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. నాలుగు నెలల కాలంలో సుమారు రూ.50 లక్షల దాకా అక్రమార్కులు దోపిడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా మత్సశాఖ అధికారులు అక్రమార్కులు ఇచ్చే మామూళ్ల మత్తులో చేపల దొంగలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

పత్తికొండ, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): 1.02 టీంఎసీల సామర్థ్యంతో సుమారు 1200 ఎకరాల విస్తీర్ణంలో 1.02 టీఎంసీల నీటి సామర్థ్యంతో పత్తికొండ, దేవనకొండ, కోడుమూరు మండలాల పరిధిలో 68 వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంగా పందికోన రిజర్వాయరును నిర్మించారు. ఇందుకు సంబంధించి కుడి, ఎడమ కాలువలు నిర్మాణంలో ఉండడంతో ఇప్పటి వరకు కేవలం 15వేల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నారు. అయితే సాగునీటి మాట అటుంచితే సాగునీరు లక్ష్యంగా పూర్తి స్థాయిలో నెరవేరకపోయినా రిజర్వాయరులో చేపల పంపకం అక్రమార్కులకు వరంగా మారింది. ఇంత పెద్ద రిజర్వాయరులో చేపల పెంపకానికి రూ.3, 4 లక్షల లోపే అనుమతులు ఇస్తూ మత్సశాఖ అధికారులు ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. 2023లో రూ.3,13,211, అలాగే 2024లో రూ. 3,69,000కు వేలం పాటల ద్వారా మత్సశాఖ అధికారులు రిజర్వాయరులో చేపల వేటకు అనుమతులు ఇచ్చారు. అయితే ఈ ఏడాది తుగ్గలి మండలం జొన్నగిరి చెరువులో చేపల పెంపకం కోసం ఆ గ్రామానికి చెందిన పంచాయితీ రూ.11లక్షలకు చేపల పెంపకానికి అనుమతులు ఇచ్చింది. ఈ లెక్కన చూసుకుంటే జొన్నగిరి చెరువుకు 20 రెట్లు పెద్దదే. పందికోన రిజర్వాయరులో చేపల పెంపకం వేలం పాటలో ఏ స్థాయిలో జరగాలన్నది తెలుస్తుంది. ఏటా రూ. కోట్లలో ఆదాయం వస్తున్నా రిజర్వాయరులో చేపల పెంపకానికి నామమాత్రపు ధరను నిర్ణయిస్తున్నా మత్సశాఖ గడువు ముగిశాక కూడా యథేచ్ఛగా చేపల వేట సాగడాన్ని చూసీచూడనట్లు వ్యవహరించడంపట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత వ్యక్తుల నుంచి మామూళ్లు పెద్ద మొత్తంలో అందుతుండడంతో మత్సశాఖ అధికారులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

రోజుకు రూ. లక్ష చేపల ఎగుమతులు..

పందికోన రిజర్వాయరులో అక్రమంగా పట్టిన చేపలను అక్రమార్కులు వివిధ మార్గాల ద్వారా ఎగుమతి చేస్తున్నారు. ఒక్కరోజుకు లక్ష రూపాయాల విలువ చేసే చేపలను ఇక్కడి నుంచి బొలెరో వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు సమాచారం. సదరు వాహనాంలో 50 బాక్సుల దాకా తరలించే అవకాశం ఉండగా వ్యాపారులు ఒక్కో బాక్సులో 30 కిలోల చొప్పున 1500 కిలోలు రోజుకు ఇక్కడి నుంచి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్‌లో హోల్‌సేల్‌ ధర కింద వ్యాపారులు రూ.70 చొప్పున ఈ చేపలు విక్రయిస్తున్నట్లు సమాచారం. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ రూ రెండున్నర లక్షల దాకా ఉంటుందని సమాచారం. సుమారు నాలుగు నెలల కాలంలో రూ.50 లక్షల విలువ చేసే చేపలను వ్యాపారులు అక్రమంగా తరలించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే గడువు ముగిశాక వేలం పాటలు నిర్వహించకుండా చేపలు అక్రమంగా అక్రమార్కులు పట్టుకుంటున్నా మత్సశాఖ ఎందుకు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై ఇన్‌చార్జి మత్సశాఖ డీఈ నాగరాజును వివరణ కోరగా తాము గడువు ముగిశాక పందికోన రిజర్వాయరులో మత్సకారులను ఖాళీ చేయించామని, అక్కడ చేపలు పట్టడం లేదని చెప్పడం గమనార్హం.

Updated Date - Nov 04 , 2025 | 11:16 PM