చేపల పెంపకం.. ఆదాయం ఘనం..!
ABN , Publish Date - Nov 22 , 2025 | 11:42 PM
జలాశయాలు, చెరువుల్లో వదిలే ఒక చేప పిల్ల ఖరీదు రెండు రూపాయల పైమాటే. రైతులే పెంచుకుంటే 50-60 పైసలకు మించదు.
గాజులదిన్నె, గూడూరు, సుంకేసులలో ‘మన చెరువు - మన సీడ్’
25 లక్షలు పెంచితే రూ.30-35 లక్షలకు పైగా లాభం
జిల్లా మత్స్య శాఖకు అవార్డు
జలాశయాలు, చెరువుల్లో వదిలే ఒక చేప పిల్ల ఖరీదు రెండు రూపాయల పైమాటే. రైతులే పెంచుకుంటే 50-60 పైసలకు మించదు. 25 లక్షలు చేప పిల్లలు పెంచితే ఖర్చులు పోనూ సరాసరి రూ.30-35 లక్షలకు పైగా లాభం వస్తుం ది. ఆ దిశగా రైతుల్లో చైతన్యం కల్పించాల్సిన మత్స్య అధికారులు ఇన్నాళ్లు పట్టించుకోలేదు. రాయలసీమ జిల్లాల్లోనే ప్రథమంగా మత్స్య శాఖ డీడీ రంగనాథ్‌బాబు ప్రోత్సాహాంతో గాజులదిన్నె, గూడూరు, సుంకేసుల గ్రామాల్లో మత్స్యకార సహకారం సంఘాల రైతులు ‘మన చెరువు - మన సీడ్’ పథకంలో భాగంగా బొచ్చే, రాగండి, ఎర్రమోసు రకం చేప పిల్లలు పెంపకం చేపట్టారు. మంచి దిగుబడి సాధించారు. భళా.. అంటూ ప్రశంసలు అందుకున్నారు. మత్స్య శాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ జిల్లాకు అవార్డును అందజేశారు.
కర్నూలు, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుంకేసుల, గాజులదిన్నె ప్రాజెక్టు, పులికనుమ, పందికోన, కృష్ణగిరి జలాశయాలు సహా 52 చిన్ననీటి పారుదల చెరువుల్లో చేపలు పెంపకం చేపడుతున్నారు. చేపల వేట ద్వారా మత్స్యకారులకు జీవనోపాధి పొందుతున్నారు. 29 మత్స్యకారుల సహకార సంఘాలు ఉన్నాయి. గాజులదిన్నె జలాశయంలో చేపలు పెంపకం, వేటకు గాజులదిన్నె మత్స్యకారుల సహకార సంఘానికి అనుమతి ఇస్తారు. పులికనుమ, పందికోన, కృష్ణగిరి జలాశయాలు, 48 చెరువుల్లో చేపలు పెంపకం, వేట సాగించేందుకు ఏటా బహిరంగ వేలం ద్వారా లీజుకు ఇస్తున్నారు. కర్నూలు, సుంకేసుల, గాజులదిన్నె ఫిష్ సీడ్ ఫారాల్లో మత్స్య శాఖ అధికారులు చేప పిల్లలను పెంచుతున్నారు. ఆ పిల్లలను రైతులకు ఇవ్వకుండా సుంకేసుల జలాశ యం, శ్రీశైలం జలాశయంలో వదిలేస్తారు. జలాశయాలు, చెరువుల్లో మత్స్యకారుల సహకారం సంఘాలు, లీజుదారులు కోస్తా జిల్లాల నుంచి చేప పిల్లలు కొనుగోలు చేసేవారు. ఫింగర్ లింక్ ఒక చేప పిల్ల ఖరీదు రెండు రూపాయాల నుంచి రెండున్నర రూపాయాలకు పైగా పడుతుంది. గాజులదిన్నె జలాశయంలో మత్స్యకార సహకారం సంఘం సభ్యులు 25 లక్షలు చేప పిల్లలు వదలాలంటే రూ.50 లక్షలకు పైగా వెచ్చించాల్సి వచ్చేది. దీంతో ఖర్చు భారం కావడంతో జిల్లాలో చాలా మంది మత్స్యకారుల సహకార సంఘాలు, రైతులు చేపల పెంపకంపై ఆసక్తి చూపేవారు కాదు. దీంతో మత్స్య సంపద రూపంలో ఆదాయం కోల్పోవాల్సి వచ్చేది.
జిల్లాలో తొలి ప్రయోగం
‘మన చెరువు - మన సీడ్’ పథకంలో భాగంగా క్యాప్టివ్ సీడ్ నర్సరీ కింద గాజులదిన్నె ప్రాజెక్టు, సుంకేసుల బ్యారేజీ సమీపంలో నిరుపయోగంగా ఉన్న ఫిష్ సీడ్ ఫారం పాండ్స్‌లో చేప పిల్లలు పెంపకానికి అనుమతి ఇచ్చారు. గాజులదిన్నె మత్స్యకార సహకార సంఘం సభ్యులు కర్ణాటక రాష్ట్రం తుంగభద్ర డ్యాం వద్ద రూ.1.50 లక్షలు వెచ్చించి మూడు రోజుల చేప పిల్లలు (స్పాన్) కోటి కొనుగోలు చేశారు. జీడీపీ ఫిష్ సీడ్ ఫారం పాండ్స్‌లో పెంపకానికి శ్రీకారం చుట్టారు. సుంకేసుల మత్స్యకారుల సహకార సంఘం 50 లక్షలు, గూడూరు మత్సకారుల సహకార సంఘం 60 లక్షల పిల్లలు తెచ్చి పాండ్స్‌లో వదిలారు. మూడు ప్రాంతాల్లో 2.10 కోట్లు చేప పిల్లలను తెచ్చి పెంపకం చేపట్టారు. మూడు నెలలు వీటిని పెంచారు. స్పాన్, ఫ్రై దశల్లో కొంత కోల్పోవాల్సి ఉంటుందని అధికారులు చెప్పారు. జలాశయాలు, చెరువుల్లో వదిలేందుకు అనువైన ఫింగర్ లింక్స్ చేప పిల్లలు గాజులదిన్నెలో రూ.25 లక్షలు, గూడూరులో 15 లక్షలు, సుంకేసులలో 12 లక్షలు చొప్పున 52 లక్షలు చేప పిల్లలు ఉత్పత్తి అయ్యాయి. ఒకటి రెండు రూపాయాలు ప్రకారం రూ.1.04 లక్షలు అవుతుంది. వాటి పెంపకానికి దాదాపుగా రూ.30-35 లక్షలు ఖర్చు అయిందని అధికారులు అంటున్నారు. ఈ లెక్కన రూ.65-75 లక్షలు మత్సకారుల సంఘాలకు లాభం. అలాగే మత్స్య శాఖ కూడా కర్నూలు, సుంకేసుల, గాజులదిన్నె ఫిష్ సీడ్ ఫారంలో 3.10 కోట్లు చేప గడ్డు పిల్లలు తెచ్చి పెంపకం చేపట్టారు. 75 లక్షల ఫింగర్ లింక్స్ చేప పిల్లలు తయారు అయ్యారు. త్వరలోనే సుంకేసుల, శ్రీశైలం జలాశయాల్లో వదిలేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రథమం
రాష్ట్రంలో వాణిజ్య పరంగా చేప పిల్లల పెంపకం కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. ప్రభుత్వం కూడా మత్స్య శాఖ ఆధ్వరంలోని ఫిష్ సీడ్ ఫారాల్లో చేప పిల్లలు పెంపకం చేపడుతుంది. మత్స్యకారుల సహకార సం ఘాలు ముందుకు వచ్చి చేప పిల్లలు పెంచడంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంటే పార్వతీపురంమన్యం జిల్లా రెండో స్థానంలో ఉంది. అంతేకాదు రాయలసీమ జిల్లాల్లో ప్రథమంగా కర్నూలు జిల్లాలో ఈ ప్రయోగం చేపట్టి సక్సెస్ అయ్యారు. దీనిని గుర్తించిన మత్స్య శాఖ కమిషనర్ రాంశంకర్ నాయక్ జిల్లాకు అవార్డు ఇచ్చారు. ఈ నెల 21న జరిగిన అంతర్జాతీయ మత్స్య దినోత్సవం పురస్కరించుకుని జిల్లా మత్స్య శాఖ డీడీ రంగనాథ్ బాబుకు ప్రశంస పత్రం, అవార్డును అందజేశారు.