పత్తి పరిశ్రమలో అగ్ని ప్రమాదం
ABN , Publish Date - Dec 09 , 2025 | 11:17 PM
పట్టణ శివారులోని బసాపురం రహదారిలో ఉన్న హరి కాటన్ జిన్నింగ్ పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.
రూ.2 కోట్లకు పైగా దగ్ధం
మంటలను అదుపు చేసిన ఫైర్ సిబ్బంది
ఆదోని, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): పట్టణ శివారులోని బసాపురం రహదారిలో ఉన్న హరి కాటన్ జిన్నింగ్ పరిశ్రమలో మంగళవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి, పత్తి నిల్వకు వేగంగా వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఎన్‌డీబీఎల్ అధినేత బత్తిని కుబేర్‌నాథ్, సద్గురు సాయి అధినేత పంపకు చెందిన పత్తి నిల్వలు పూర్తిగా దగ్ధమయ్యాయి. హరి పత్తి పరిశ్రమలో మధ్యాహ్నం జిన్నింగ్ చేస్తుండగా ఒక్కసారిగా నిప్పు రవ్వలు పత్తిపై పడడంతో వేగంగా మంటలు వ్యాపించినట్లు అక్కడ పని చేస్తున్న కార్మికులు తెలిపారు. అక్కడ ఉన్న నీటి ద్వారా మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించినప్పటికీ మంటలు మరింత ఉధృతమయ్యాయి. ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేలోపే జరగరాని నష్టం జరిగింది. మంటలు మరింత పెరగకుండా ఫైర్ సిబ్బంది చర్యలు తీసుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో సుమారుగా రూ. 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఎన్‌డీబీఎల్ అధినేత బత్తిని కుబేర్‌నాథ్ తెలిపారు.