ఏపీఎస్పీడీసీఎల్‌కు వినియోగదారుల కమిషన్ వడ్డింపు
ABN , Publish Date - Dec 11 , 2025 | 12:31 AM
దేవాలయానికి విద్యుత్ కనెక్షన్ దీర్ఘకాలికంగా ఇవ్వకుండా సేవాలోపం చేసిన ఏపీఎస్పీడీసీఎల్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డించింది. రుద్రవరం మండలం పేరూరులో సత్యనారాయణ స్వామి దేవాలయానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆలయ ధర్మకర్త గంగిశెట్టి రమేష్ 2019లో రూ.10,035ను డిపాజిట్ చేశారు.
కర్నూలు లీగల్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): దేవాలయానికి విద్యుత్ కనెక్షన్ దీర్ఘకాలికంగా ఇవ్వకుండా సేవాలోపం చేసిన ఏపీఎస్పీడీసీఎల్‌కు జిల్లా వినియోగదారుల కమిషన్ తగిన రీతిలో వడ్డించింది. రుద్రవరం మండలం పేరూరులో సత్యనారాయణ స్వామి దేవాలయానికి విద్యుత్ కనెక్షన్ కోసం ఆలయ ధర్మకర్త గంగిశెట్టి రమేష్ 2019లో రూ.10,035ను డిపాజిట్ చేశారు. తర్వాత ఫిర్యాది ఎన్నిమార్లు విన్నవించుకున్నా అధికారులు విద్యుత్ కనెక్షన్ ఇవ్వ లేదు. 2022-23 మధ్యకాలానికి కనెక్షన్ ఇవ్వకుండానే విద్యుత్ బిల్లు జారీ చేశారు. దీంతో పిర్యాది వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు. కేసును విచారించిన కమిషన్ డిపాజిట్ వసూలు చేసికూడా కనెక్షన్ ఇవ్వకుండా ఆలస్యం చేయడం సేవాలోపం చేయడమే అవుతుందని నిర్ధారించింది. దీంతో దేవాలయానికి 45 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్‌ను మంజూరు చేయడమే కాకుండా ఫిర్యాదిదారుడికి మానసిక వేదన కింద రూ.15వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5వేలను ఫిర్యాదికి చెల్లించాలని కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్‌కుమార్, సభ్యులు ఎన్. నారాయణ రెడ్డి, నజీమా కౌసర్ ఆదేశాలు జారీ చేశారు.
చోళమండలం ఎంఎస్ జనరల్ బీమా కంపెనీకి..
జిల్లాలోని జిల్లెడుబుడకల గ్రామానికి చెందిన బీమాదారుడు లారీ ప్రమాదంలో మృతి చెందినా, కారణాలు చెప్పకుండా ఇన్సూరెన్స్ మొత్తం చెల్లించకపోవడం సేవాలోపం అవుతుందని జిల్లా వినియోగదారుల కమిషన్ తీర్మానించింది. గ్రామానికి చెందిన మృతుడు లారీ డ్రైవర్‌గా పని చేస్తూ 2023 మే 31వ తేదీ రాత్రి లారీని నడుపుతుండగా.. రోడ్డుపై ఆకస్మాత్తుగా కుక్క దూసుకువచ్చి వాహనం అదుపు తప్పి ఒరిగిపోయింది. ఘటనాస్థలి లోనే డ్రైవర్ మరణించాడు. మృతుడి భార్య చోళమండలం బీమా కంపెనీకి బీమా మొత్తం రూ.15లక్షల కోసం దరఖాస్తు చేసుకుంది. అవసరమైన పత్రాలన్నీ సకాలంలో అందజేసినా కంపెనీ క్లెయిమ్‌ను పరిష్కరించకుండా దీర్ఘకాలికంగా పెండింగ్ ఉంచింది. మృతుడి భార్య వెంకటేశ్వరమ్మ జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. కేసును విచారించిన కమిషన్ ఫిర్యాది అన్నిపత్రాలు సక్రమంగా దాఖలుచేసినా కూడా బీమా మొత్తం ఇవ్వకపోవడం సేవాలోపం అవుతుందని నిర్ధారించింది. ఫిర్యాదికి బీమా మొత్తం రూ.15లక్షలను 9శాతం వడ్డీతో చెల్లించాలని, మానసిక వేదనకు గురి చేసినందుకు రూ.25వేలు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.5 వేలను 45 రోజుల్లోపు అందజేయాలని కమిషన్ అధ్యక్షుడు కరణం కిషోర్ కుమార్, సభ్యులు ఎన్.నారాయణరెడ్డి, నజీమా కౌసర్ ఆదేశాలు జారీ చేశారు.