ఎమ్మిగనూరు వైసీపీలో గందరగోళం
ABN , Publish Date - Dec 16 , 2025 | 12:47 AM
ఎమ్మిగనూరు వైసీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిపై మాజీ ఎంపీ బుట్టా రేణుక రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు
బుట్టా, ఎర్రకోట మధ్య వర్గపోరు
కర్నూలు ర్యాలీకి ఎవరిదారి వారిదే..
ఎర్రకోటపై పట్టుబిగిస్తున్న బుట్టా రేణుక
కర్నూలు, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): ఎమ్మిగనూరు వైసీపీలో వర్గపోరు మరోసారి బహిర్గతమైంది. మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డిపై మాజీ ఎంపీ బుట్టా రేణుక రాజకీయంగా పట్టు సాధిస్తున్నారు. ఇన్‌చార్జి బాధ్యతల నుంచి తొలగించినా పైచేయి సాధిస్తున్నారు. వారం రోజుల క్రితం ఆదోని జిల్లా సాధనకు మద్దతు ఇచ్చేందుకు భారీ సంఖ్యలో తరలివెళ్లిన బుట్టా రేణుక తన వర్గీయుల్లో ఆత్మస్తైర్యాన్ని నింపారు. తాజాగా సోమవారం కర్నూలులో జరిగిన వైసీపీ ర్యాలీకి భారీ వాహనాల్లో తరలివెళ్లి మరోసారి పట్టు బిగించారు. ఓ వైపు బుట్టా రేణుక వర్గం.. మరో వైపు ఎర్రకోట వర్గీయులు ఎవరికి వారే అంటూ కర్నూలుకు తరలిపోయారు.
ఫ ఎమ్మిగనూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవరెడ్డికి సుదీర్గ రాజకీయ అనుభవం ఉంది. టీడీపీ, కాంగ్రెస్, వైసీపీలో మూడు పార్టీల్లో పని చేశారు. 2012 ఉప ఎన్నికలతో కలిపి 1994 నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేశారు. నాలుగుసార్లు విజయం సాధించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎర్రకోటకు టికెట్ ఇస్తే ఓటమి తథ్యమని భావించిన వైసీపీ అధినేత జగన్ చేనేత వర్గాలు అధికంగా ఉండటంతో ఆ సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకకు టికెట్ ఇచ్చారు. గత ఎన్నికల్లో కూటమి హవాలో వైసీపీ కొట్టుకుపోయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైసీపీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా ఏడాదిన్నరగా కొనసాగుతూ వచ్చారు. పార్టీలో, ముఖ్యంగా బీసీ వర్గాల్లో పట్టుబిగించారు. కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపి తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని తయారు చేసుకున్నారు. అయితే బుట్టా రేణుక రాజకీయ ఎదుగుదల మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి, ఆయన వర్గీయులకు మింగుడు పడలేదు. ఎలాగైనా ఆమెను ఇక్కడి నుంచి పంపించేయాలని మూడు నెలలుగా రాజకీయ ఎత్తులు వేశారు. వైసీపీ అధినేత జగన్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు బీసీ చేనేత సామాజిక వర్గానికి చెందిన బుట్టా రేణుకను ఎమ్మిగనూరు నియోజకవర్గం ఇన్‌చార్జిగా తొలగించి తన మనుమడు రాజకీయాలకు కొత్తయిన కడిమెట్ల రాజీవ్‌రెడ్డిని వైసీపీ ఇన్‌చార్జిగా నియమించడంలో ఎర్రకోట సఫలమయ్యారు. అయితే ఏ మాత్రం రాజకీయ అనుభవం లేని 26 ఏళ్ల యువకుడికి ఇన్‌చార్జి బాధ్యతలు ఇస్తారా...? ఎన్నో ఏళ్లు రాజకీయాల్లో ఉన్న తాము ఆ యువకుడితో పని చేయాలా అంటూ పలువురు సీనియర్లు అసంతృప్తిగా ఉన్నారు.
బుట్టా రేణుకను వైసీపీ నియోజకవర్గం ఇన్‌చార్జి బాధ్యతలు తొలగించడంలో మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట రాజకీయంగా కొంతమేర సఫలమైనా.. పార్లమెంటు సమన్వయ కర్తగా బుట్టా రేణుక తన వర్గాన్ని కాపాడుకుంటూ వచ్చారు. ఇటీవల ఆదోని జిల్లా సాధన కోసం చేస్తున్న దీక్షలకు సంఘీభావం తెలిపేందుకు భారీ సంఖ్యలో వాహనాల్లో తరలివెళ్లి పట్టును నిలుపుకు న్నారు. అదే క్రమంలో సోమవారం కర్నూలులో వైసీపీ నిర్వహించిన ర్యాలీకి నియోజక వర్గం నుంచి వందకు పైగా వాహనాల్లో అనుచరులతో బుట్టా రేణుక తరలివెళ్లారు. అదే క్రమంలో ఎర్రకోట వర్గీయులు సైతం ప్రత్యేక వాహనాల్లో వెళ్లారు. బుట్టా, ఎర్రకోట ఇరు వర్గాలు ఎవరికి వారే యమునా తీరు అన్నట్లు పార్టీ ర్యాలీకి తరలివెళ్లడంతో వైసీపీలో గందరగోళం నెలకొంది. ఇటీవల మాజీ ఎంపీ బుట్టా రేణుక కార్యాలయం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు ఆమె ఫ్లెక్సీలను చింపేశారు. ఎర్రకోట వర్గీయులే ఈ దురాఘాతానికి పాల్పడ్డారనీ బుట్టా వర్గీయులు అనుమానిస్తున్నారు. దీనికి తోడు ఇటీవల పలు గ్రామాలకు మాజీ ఎమ్మెల్యే ఎర్రకోట, ఆయన కుమారుడు వైసీపీ సీనియర్ నాయకులు జగన్మోహన్ రెడ్డి ఆయా గ్రామాల కార్యకర్తలకు ఫోన్లు చేసి బుట్టా రేణుక కార్యక్రమాలకు వెళ్లవద్దని చెప్పడం ఆ పార్టీలో రాజకీయ చర్చకు దారితీసింది.