Share News

హౌస్‌ సర్జన్లు, నర్సుల మధ్య వివాదం

ABN , Publish Date - Sep 04 , 2025 | 12:59 AM

ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఫిమేల్‌ మెడికల్‌-7 యూనిట్‌లో మహిళా రోగులకు మంగళవారం రాత్రి ఇంజెక్షన్‌ వేయలేదు.

 హౌస్‌ సర్జన్లు, నర్సుల మధ్య వివాదం
మహిళల మెడికల్‌ వార్డులో విచారిస్తున్న అధికారులు

ఎఫ్‌ఎం-7లో ఇంజెక్షన్లు వేయకుండా నిర్లక్ష్యం

మహిళా రోగుల ఫిర్యాదుతో విచారణ

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 3(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఫిమేల్‌ మెడికల్‌-7 యూనిట్‌లో మహిళా రోగులకు మంగళవారం రాత్రి ఇంజెక్షన్‌ వేయలేదు. రోగులకు ఇంజెక్షన్లు వేసే విషయంలో హౌస్‌ సర్జన్లు, నర్సుల మధ్య వివాదం నెలకొంది. క్యాజువాల్టీలో విపరీతమైన పని ఉందని, ఇంజక్షన్లు వేయాలని మంగళవారం రాత్రి హౌస్‌ సర్జన్లు నర్సింగ్‌ సిబ్బందికి సూచించారు. అయితే ఇంజెక్షన్లు వేయడం తమ పని కాదని, ఇతర పనులు ఉన్నాయని చెప్పారు. ఇద్దరి మధ్య సమన్వయంలేకపోవడం మంగళవారం రాత్రి ఎఫ్‌ఎం-7 యూనిట్‌లోని మహిళ రోగులకు ఇంజెక్షన్లు వేయలేదు. బుధ వారం ఉదయం వార్డుకు వచ్చిన మెడిసిన్‌ అసిస్టెంట్‌ ప్రొఫెస ర్‌కు తమకు రాత్రి ఇంజెక్షన్లు వేయలేదని రోగులు ఫిర్యాదు చేశారు. దీంతో యూనిట్‌ అసిస్టెంట్‌ ఫ్రొఫెసర్‌ ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ వెంకటరమణ, డిప్యూటీ సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్‌ పద్మజ, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ సావిత్రీబాయి విచారించారు.

Updated Date - Sep 04 , 2025 | 12:59 AM