Share News

సెక్యూరిటీ ఏజెన్సీనిర్వహణపై రగడ

ABN , Publish Date - Sep 16 , 2025 | 12:06 AM

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహణ కోసం అధికార పార్టీలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య విభేదాలు తలెత్తాయి.

సెక్యూరిటీ ఏజెన్సీనిర్వహణపై రగడ
ఆసుపత్రి ఇన్‌గేటు వద్ద అస్తవ్యస్తంగా వాహనాలు

రెండు వర్గాల మధ్య విభేదాలు

స్టేషన్‌కు చేరిన పంచాయితీ

కర్నూలు హాస్పిటల్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహణ కోసం అధికార పార్టీలో ఇద్దరు నేతల అనుచరుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇరు వర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగి రోడ్డుకెక్కారు. కర్నూలు జీజీహెచ్‌లో 238 మంది సెక్యూరిటీ గార్డుతో తిరుపతికి చెందిన ఈగల్‌ సంస్థ టెండర్‌ను దక్కించుకుంది. అయితే టీడీపీకి చెందిన ఓ నియోజకవర్గం ఇన్‌చార్జి ఈ ఏజెన్సీని సబ్‌లీజ్‌ కింద తీసుకుని రెండు నెలలు నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. అయితే ఈ విషయంలో ఓ ప్రజాప్రతినిధి అనుచరులు, ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి అనుచరుల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. తామే ఏజెన్సీని నిర్వహిస్తామని ప్రజా ప్రతినిధి అనుచరులు కొందరు సోమ వారం సెక్యూరిటీ ఆఫీస్‌కు వచ్చి గొడవకు దిగారు. ఇప్పటికే సెక్యూరిటీ ఏజెన్సీ సబ్‌ లీజు కోసం తాము లక్షల రూపాయలు ఖర్చు పెట్టామని ఏజెన్సీని నిర్వహిస్తున్న ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి అనుచరులు వాదనకు దిగారు. తాము ఈగల్‌ సంస్థ తో అగ్రిమెంటు చేసుకున్నామని, ఖర్చు పెట్టి ఉంటే చెల్లిస్తామని ఇక నుంచి తామే విధులు చూస్తామని ప్రజాప్రతినిధి అనుచరులు అన్నారు. దీంతో సెక్యూరిటీ ఆఫీసు వద్ద కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు చేరుకుని ఇరువర్గాలను శాంతింపజేశారు. ఇంతలో విషయం తెలుసుకున్న ఓ నియోజకవర్గ ఇన్‌చార్జి అనుచరులు భారీ స్థాయిలో ఆఫీసుకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. తర్వాత ఈ విషయం త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. కర్నూలు జీజీహెచ్‌లో సెక్యూరిటీల వ్యవస్థ గత 2 నెలలుగా అస్తవ్యస్తంగా తయారయింది. ఐదు రోజుల క్రితం ఇన్‌గేటు వద్ద సెక్యూరిటీ గార్డులు ట్రాఫిక్‌ను నియత్రించలేకపోవడం ముగ్గురిపై హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ వేటు వేశారు. ఇద్దరు అధికార పార్టీ నేతలు సెక్యూరిటీ ఏజెన్సీ కోసం కొట్టుకోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. అధికారులు కూడా ఈ ఇద్దరి నేతల మధ్య తలదూర్చకపోవడంతో హాస్పిటల్‌ రోగుల భద్రత అదుపు తప్పింది.

Updated Date - Sep 16 , 2025 | 12:06 AM