కీర్తి ప్రతిష్టలు పెంచే ఉత్సవాలు
ABN , Publish Date - Nov 04 , 2025 | 11:36 PM
ఉమ్మడి కర్నూలు జిల్లా కీర్తి ప్రతిష్టను పెంపొందించేలా కర్నూలు ఉత్సవ్-2025 ప్రదర్శనలు కొనసాగుతున్నాయని పలువురు వక్తలు కొనియాడారు
కర్నూలు కళలకు గుర్తింపు
నాలుగో రోజు అలరించిన కళ, సాహిత్య ప్రదర్శనలు
ఘనంగా ‘కర్నూలు ఉత్సవ్-2025’
కర్నూలు కల్చరల్, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా కీర్తి ప్రతిష్టను పెంపొందించేలా కర్నూలు ఉత్సవ్-2025 ప్రదర్శనలు కొనసాగుతున్నాయని పలువురు వక్తలు కొనియాడారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు వారం రోజుల పాటు నిర్వహించడం అభినందనీయమన్నారు. నగరంలోని టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కర్నూలు ఉత్సవ్-2025 ప్రదర్శనలు మంగళవారం నాలుగో రోజుకు సందడిగా సాగాయి. సాయంత్రం ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథులుగా రవీంద్ర విద్యాసంస్థల అధినేత జి.పుల్లయ్య, నగరపాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ సతీ్‌షరెడ్డి, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు నందిరెడ్డి సాయిరెడ్డి హాజరై తెలుగుతల్లి, పొట్టి శ్రీరాములు చిత్ర పటాలకు పూలదండలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు కళాక్షేత్రంలో ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లా ప్రముఖుల ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకించారు. ఈ సందర్భంగా సభలో వక్తలు మాట్లాడుతూ జిల్లా జానపద కళలకు, సాహిత్యానికి, నాటక రంగానికి ఈ సభలు గుర్తింపు తెచ్చాయన్నారు. కనుమరుగవుతున్న తోలుబొమ్మలాట, చెక్కభజన వంటి అపురూప కళారూపాలను తెరమీదికి తీసుకువచ్చి, వారితో ప్రదర్శనలు ఇప్పించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని అన్నారు. అనేక కళారూపాలు ఆదరణ లేక తెరచాటుకు తప్పుకుంటున్నాయని, టీజీవీ కళాక్షేత్రం వారి ఉనికిని గుర్తించి వెలుగులోకి తీసుకురావాలని సూచించారు. సభకు అధ్యక్షత వహించిన టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షుడు కళారత్న పత్తి ఓబులయ్య మాట్లాడుతూ టీజీవీ కళాక్షేత్రం నిత్యం కల్యాణం పచ్చతోరణంగా కళలు, కళారూపాలతో నిండుగా కనిపించాలనేది క్షేత్రం గౌరవ చైర్మన్, మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్ ఆకాంక్ష అన్నారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాక్షేత్రం ప్రతినిధులు సి.యాగంటీశ్వరప్ప, సీవీ రెడ్డి, లక్ష్మీకాంతరావు, పీపీ గురుమూర్తి, వాల్మీకి రాముడు, గాండ్ల లక్ష్మన్న, సంగా ఆంజనేయులు, కేవీ రమణ, జీవీ శ్రీనివాసరెడ్డి, మహ్మద్ మియా, పి.రాజారత్నం, ఇనాయతుల్లా, కె.బాలవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న జానపద కళారూపాలు..
జానపద కళలకు పట్టం కడుతూ నాలుగో రోజు వేడుకలు కొనసాగాయి. ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏకాంకిక పౌరాణిక పద్య నాటక నాటక పోటీలు కొనసాగాయి. నేటి తరానికి తెలియని తోలుబొమ్మలాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రాజేశ్వరమ్మ బృందం, కుళ్లాయమ్మ బృందం సభ్యులు ఈ ప్రదర్శనలు చేశారు. నంద్యాల జిల్లా గాజులపల్లెకు చెందిన వై.గంగాధర్ బృందం చెక్కభజన ఉత్సాహాన్ని నింపింది. ఏకాంకిక నాటక ప్రదర్శనల్లో దేవనకొండకు చెందిన బృందం శ్రీకృష్ణ రాయబారం, డోన్ బృందం రామాంజనేయ యుద్ధం, బి.తాండ్రపాడు బృందం శ్రీకృష్ణ తులాభారం, దేవనకొండ బృందం గయోపాఖ్యానం, ఇతర ప్రాం తాల కళాకారుల సత్యహరిశ్చంద్ర, బాలనాగమ్మ ప్రదర్శనలు ప్రేక్షకులను కట్టిపడేశాయి. తేజ బృందం శాస్త్రీయ నృత్యాలు ఆకట్టుకున్నాయి.
సాహితీ ప్రముఖులకు సత్కారం
ఉమ్మడి జిల్లాలో సాహిత్య సేవలు అందిస్తున్న పలువురు సాహితీ ప్రముఖులను ఈ సభలో ఘనంగా సత్కరించారు. ఎస్‌డీవీ అజీజ్, గూడూరు మునిస్వామి, డాక్టర్ కర్నాటి చంద్రమౌళిని, డాక్టర్ ఎం.హరికిషన్, కెంగార మోహన్, గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి, సవప్పగారి ఈరన్న, రంగనాథ రామచంద్రరావు, గెలివి సహదేవుడు, ఆరేపల్లి వరలక్ష్మమ్మలకు ముఖ్య అతిథులకు సన్మానాలు నిర్వహించారు.