కన్నకొడుకును చంపేశాడు..!
ABN , Publish Date - Sep 12 , 2025 | 12:35 AM
(ఆ బిడ్డకు మాటలు వచ్చి ఉంటే ఇలా అనేవాడేమో..) ఎందుకు నాన్నా ఇలా చేశావు.. నా అల్లరి నీకు నచ్చలేదా? లేక నేనే నచ్చలేదా? నా పుట్టుకపై అనుమానమా? లేక అమ్మపై అనుమానమా?.. నువ్వు నన్ను ఎత్తుకుంటే మురిపెంగా ముద్దు పెట్టుకుంటావనుకున్నా. కానీ ఇలా నీటిలో ముంచి చంపేస్తావనుకోలేదు నాన్నా. ఎంత పనిచేశావు డాడీ. నన్ను చంపే సమయంలో అమ్మ పేగు బంధం.. నీ ప్రాణబంధం గుర్తుకు రాలేదా? చివరగా ఒక్క మాట.. నేను నీ కొడుకునే నాన్న.
పసిబిడ్డను నీటి డ్రమ్ములో ముంచి హత్య.. ఆపై భార్యపై దాడి
దేవనకొండలో దారుణం
దేవనకొండ, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): భార్యపై అనుమానంతో ఓ భర్త కర్కశంగా వ్యవహరించాడు. ఎనిమిది నెలల కుమారుడిని హతమార్చి, భార్యపై విచక్షణా రహితంగా గాయపడిచారిచిన సంఘటన దేవనకొండ సమీపంలో చోటుచేసుకుంది. దేవనకొండకి చెందిన చాకలి నరేష్ మొదటి భార్య మూడేళ్ల క్రితమే మృతిచెంది, ఆమెకు ఇద్దరు కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనంతరం గోనెగండ్ల మండలం, కులుమాల గ్రామానికి చెందిన నర్సప్ప, సుజాత కుతూరు శ్రావణితో రెండేళ్ల క్రితం (రెండో) వివాహం జరిగింది. కాగా నెల నుంచి కుటుంబంలో అత్తమామ, మొదటి భార్య పిల్లలకు కలహాలు మొదలైన్నాయి. వీరు ఇంట్లో ఉండకూడదని ఘర్షణ చోటుచేసుకోవడంతో 20 రోజలు క్రితం నరేష్ రెండో భార్యను తీసుకుని దేవనకొండకి రెండు కిలోమీటర్ల దూరంలోని తమ ఎర్రచందనం పొలంలో ఉన్న గదిలోనే కాపురం సాగిస్తున్నారు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న నరేష్ గురువారం ఉదయం భార్యపై అనుమానంతో విచక్షణారహితంగా దాడిచేసి, తన 8 నెలల కుమారుడు సాగర్‌ను నీటి డ్రమ్ములో ముంచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న సీఐ వంశీనాథ్ ఘటన స్థలానికి చేరుకొని, తీవ్రంగా గాయపడ్డ శ్రావణిని అంబులెన్స్‌లో కర్నూలుకు తరలించారు. శ్రావణి కుటుంబ సభ్యులు బాలుడు సాగర్ మృత దేహంతో న్యాయం చేయాలని దాదాపు మూడు గంటలలపాటు పత్తికొండ, దేవనకొండ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయ్యాయి. సీఐ జోక్యం చేసుకుని విచారణ చేసి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. బాలుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రావణి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.