పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుతో.. రైతులకు ప్రయోజనం లేదు
ABN , Publish Date - Aug 06 , 2025 | 11:30 PM
పోలవరం - బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే అని, రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని ఆలోచనపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు.
ఇది కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే
విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పోలవరం - బనకచర్ల ఎత్తిపోతల ప్రాజెక్టు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనం కోసమే అని, రైతులకు ఏ మాత్రం ప్రయోజనం లేదని ఆలోచనపరుల వేదిక నాయకుడు, విశ్రాంత ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు అన్నారు. రాయలసీమలోని ప్రాజెక్టుల సందర్శనలో భాగంగా ఆయన నంద్యాలలో రాయలసీమ సాగునీటిసాధన సమితి నాయకులు బొజ్జా దశరఽథరామిరెడ్డి నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో జీవనదులైన కృష్ణా, గోదావరి నదుల నీటిని పూర్తిస్థాయిలో వాడుకోవడం మన బాధ్యత అని అన్నారు. గత ప్రభుత్వం హయాంలోనే పోలవరం - బనకచర్ల ప్రాజెక్టును మెగా ఇంజనీరింగ్ సంస్థ ప్రతిపాదించగా వ్యాప్కోస్ నుంచి డీపీఆర్ కూడా పొంది కార్యాలయాల్లో నలిగిన ప్రాజెక్టు అని గుర్తుచేశారు. ఆ ప్రాజెక్టును ఆనాడు ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయని, అయితే నేటి కూటమి ప్రభుత్వం మళ్లీ అదే ప్రాజెక్టును తలపై ఎత్తుకుని ఢీల్లీ చుట్టూ తిరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో ఉన్నా కూడా లేనట్లు ఉన్న ప్రధాన పార్టీ ఆ ప్రాజెక్టుపై నోరు మెదపడం లేదన్నారు. బనకచర్ల ప్రాజెక్టు రైతుల ప్రయోజనాలకు ఏ మాత్రం ఉపయోగం లేదని ఆలోచనాపరుల వేదిక నిర్ధారణకు వచ్చిన తర్వాత ప్రభుత్వానికి లేఖ కూడా రాసినట్లు తెలిపారు. కృష్ణానది నీటిని వీలైనంత మేరకు తరలించి రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనే ఉద్దేశ్యం గత దశాబ్ధాల నుంచి ఉన్నా, అనేక ప్రాజెక్టులు కట్టినా నేటికీ లక్షల ఎకరాలకు నీరు అందడం లేదని అన్నారు. ప్రభుత్వాలు తమ పరిశీలనలను పరిశీలిస్తాయో లేదో కానీ, ప్రజలకు వివరించి అవగాహన కల్పించాల్సిన బాధ్యత తమపై ఉందని అన్నారు. సమావేశంలో సాగునీటిరంగ విశ్లేషకులు తుంగలక్ష్మీనారాయణ, రైతు సేవా అధ్యక్షుడు అక్కినేని భవానీప్రసాద్, సామాజికవేత్త జొన్నలగడ్డ రామారావు, సీపీఐ నాయకులు రామాంజనేయులు పాల్గొన్నారు.
గోరుకల్లు రిజర్వాయర్ నుంచి సాగునీరు అందించాలి
పాణ్యం: గోరుకల్లు రిజర్వాయర్ రిపేరీ పనులకు రూ.53 కోట్లు ప్రతిపాదించారని, వెంటనే నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేసి రైతాంగానికి సాగునీరందించాలని ఆలోచనాపరుల వేదిక నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో ఆలోచనాపరుల వేదిక నాయకులు వెంకటేశ్వరరావుతో పాటు సాగునీటి రంగ విశ్లేషకులు తుంగ లక్ష్మీనారాయణ, రైతు సేవా అధ్యక్షుడు అక్కినేని భవానీ ప్రసాద్, సామాజికవేత్త రామారావు, చక్రవర్తి, సీపీఐ నాయకులు రామాంజనేయులు, బాబాఫకృద్దీన్, బెక్కెం రామసుబ్బారెడ్డి, ఎస్సార్బీసీ పరిరక్షణ నాయకులు మురళీధరరెడ్ది, ఈశ్వరరెడ్డి, సమితి కార్యవర్గ సభ్యులు, రైతు నాయకులు రిజర్వాయర్‌ను పరిశీలించారు. వారు మాట్లాడుతూ సామర్థ్యం మేరకు నీటి నిల్వను చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. దీనికి అవినీతి, అక్రమాలే కారణమని అన్నారు. నికరజలాల ఆధారంగా నిర్మించిన ఏకైక ప్రాజెక్టు గోరుకల్లు అని అన్నారు. 12.55 టీఎంసీల నీటిని నింపుకోవాల్సిన రిజర్వాయర్‌ను అవినీతితో పది సంవత్సరాలు కాకముందే 8టీఎంసీల నీటిని నింపుకోవడం అన్యాయమన్నారు. రిజర్వాయర్ రాతిపరుపు జారిపోవడం, ఇంత వరకు రిపేరీలు పూర్తి కాకపోవడం రైతులకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వాల ఉదాసీనతే ఇందుకు కారణమన్నారు. ప్రపంచ నిధులతో వడ్డీలు చెల్లిస్తూ రైతులకు న్యాయం చేయలేని దుస్థితి ఏర్పడిందన్నారు.