పంట రక్షణకు రైతుల పాట్లు
ABN , Publish Date - Aug 09 , 2025 | 11:58 PM
ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే రైతన్నకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారు.
ట్రాక్టర్, ఆయిల్ ఇంజన్లతో నీటిని తడుపుతున్న అన్నదాతలు
చాగలమర్రి, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి): ఆరుగాలం కష్టించి పంటలు సాగు చేసే రైతన్నకు ప్రతి ఏడాది ఏదో ఒక రూపంలో నష్టపోతున్నారు. ఈ ఏడాది మే నెలలో ముందస్తుగా వర్షాలు అధికంగా కురవడంతో రైతులు అధిక విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేశారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై 60 రోజులు దాటిన వానజాడ లేక సాగు చేసిన మొక్కజొన్న, మినుము, కంది, పెసర తదితర పంటలు వాడుముఖం పట్టాయి. దీంతో రైతులు దిక్కుతోచక ఆందోళన చెందుతున్నారు. ఓ వైపు రోజు రోజుకు పెరుగుతున్న ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు, రైతులు ఉక్కిరిబిక్కిరి, మరో వైపు వేసవిని మించి పొడి వాతావరణంతో, పంటల సాగుకు నీటి ఎద్దడితో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. చాగలమర్రి మండలంలోని శెట్టివీడు, గొడిగనూరు, ముత్యాలపాడు తదితర గ్రామాల్లో నీటి ఇబ్బందులతో రైతులు కష్టాలు పడుతున్నారు. ఏపుగా పెరిగిన మొక్కజొన్న పంటను కాపాడుకునేందుకు టీజీపీ ద్వారా ప్రవహిస్తున్న వంకలు, వాగుల వద్ద ట్రాక్టర్లు, ఆయిల్ ఇంజన్‌లు ఏర్పాటు చేసి పైపుల ద్వారా పంట పొలాలకు నీరు తోడుతున్నారు. వరుణ దేవుడి కరుణం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. వాగులు, వంకల వద్ద ట్రాక్టర్ ఇంజన్‌లు ఏర్పాటు చేసి అక్కడి నుంచి పంట పొలాల వరకు 2 కి.మీ. దూరంలో ఉన్న పంటను కాపాడుకోవడానికి 70 అడుగుల పైపులు వేసి పంటలను తడుపుకుంటున్నారు. ఎలాగైన పంట లను కాపాడుకోవాలని అన్నదాత ప్రయత్నం సాగిస్తున్నారు.