పరిశ్రమల ఏర్పాటుకు రైతులు సహకరించాలి
ABN , Publish Date - Nov 25 , 2025 | 12:03 AM
పరిశ్రమల ఏర్పాటుకు రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కోరారు.
జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్
ఓర్వకల్లు, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): పరిశ్రమల ఏర్పాటుకు రైతులు సహకరించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ కమర్ కోరారు. మండలంలోని పూడిచెర్ల, హుశేనాపురం గ్రామాలను సోమవారం ఆయన సందర్శించారు. మండలంలోని పూడిచెర్ల గ్రామ సమీపంలో వెళ్తున్న పైపులైన్ భూములను ఆయనతో పాటు ఆర్డీవో సందీప్ కుమార్ పరిశీలించారు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకం నుంచి ఓర్వకల్లు ఇండస్ట్రియల్ హబ్‌కు తీసుకెల్తున్న పైపులైన్ నిర్మాణానికి రైతులు సహకరించాలని కోరారు. ముస్లిం కాలనీ నుంచి కొండ ప్రాంతం చెరువుకట్ట వరకు పైపులైన్ ఏర్పాటు స్థలాన్ని ఆయన క్లుప్తంగా పరిశీలించారు. జేసీ రైతులతో మాట్లాడుతూ ఎత్తిపోతల పథకం నుంచి గార్గేయపురం, కేతవరం, పూడిచెర్ల వరకు పైపులైన్ పూర్తయిందని, పూడిచెర్ల వద్ద సారవంతమైన భూములు రైతులు కోల్పోవాల్సి వస్తుందని, పూడిచెర్ల గ్రామ మైనార్టీ కాలనీ నుంచి కొండపై చెరువు కట్ట వరకు పైపులైన్ తీసుకెళితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని రైతులు జేసీ దృష్టికి తీసుకెళ్లారు. జాయింట్ కలెక్టర్ కాంట్రాక్టరుతో చర్చలు జరిపారు. అనంతరం మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలో ఏర్పాటు చేస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీకి వెళ్లే రహదారిని ఆయన పరిశీలించారు. తహసీల్దార్ విద్యాసాగర్, ఎస్‌ఈ మనోహర్, సర్వేయర్ శంకర్ మాణిక్యం, వీఆర్వోలు, సర్వేయర్లు, పూడిచెర్ల గ్రామస్థులు లక్ష్మిరెడ్డి, ఎల్లారెడ్డి, అక్కిరెడ్డి ఉన్నారు.