యూరియాపై రైతులకు అవగాహన కల్పించాలి
ABN , Publish Date - Aug 23 , 2025 | 12:18 AM
యూరియాపై వ్యవసాయాధికారులు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు.
రైతులు ఆందోళన చెందొద్దు
కలెక్టర్ రాజకుమారి
నంద్యాల ఎడ్యుకేషన్, ఆగస్టు 22 (ఆంధ్రజ్యోతి): యూరియాపై వ్యవసాయాధికారులు రైతులకు పూర్తిగా అవగాహన కల్పించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. అమరావతి సచివాలయం నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ శుక్రవారం అన్ని జిల్లాల కలెక్టర్‌లు, వ్యవసాయాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీసీ అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రైతు లు యూరియా విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అవసరానికి మించి ఎరువులు అందుబాటులో ఉన్నాయని భరోసా ఇచ్చారు. గత ఖరీఫ్ సీజన్ కంటే ఈ ఏడాది ఎరువులను ఎక్కువగా సరఫరా చేశామని, రైతులు అపోహలతో యూరియాను అధికంగా కొను గోలు చేసి నిల్వ ఉంచుతున్నారన్నారు. ఈ మేరకు రైతులకు వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. క్షేత్రస్థాయిలో యూరియా, ఎరువుల కొరత లేకుండా విజిలెన్స్ అధి కారులు నిఘా పెట్టాలన్నారు. 2025 ఖరీఫ్ సీజన్‌లో ఎరువుల విని యోగం గణనీయంగా పెరిగిందన్నారు. రైతులకు మరింత భరోసా కల్పించేలా మార్క్‌ఫెడ్‌కు 50 నుంచి 70శాతం ఎరువుల కేటాయింపులను పెంచామన్నారు. ఎరువులు బ్లాక్ మార్కెట్‌కు తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.