ప్రకృతి సేద్యం చేయండి
ABN , Publish Date - Nov 26 , 2025 | 11:53 PM
ప్రకృతి సేద్యంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చనీ కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి రైతులకు సూచించారు.
తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు
రైతులు రెండు,మూడు రకాల పంటలు సాగు చేయాలి
రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ సిరి
పంచ సూత్రాల గురించి వివరించిన కలెక్టర్
ఓర్వకల్లు, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి సేద్యంతో చాలా ప్రయోజనాలు ఉన్నాయని, తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చనీ కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి రైతులకు సూచించారు. బుధవారం ఓర్వకల్లు మండలంలోని ఉయ్యాలవాడ గ్రామంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి పంచసూత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం సమావేశంలో ముఖ్యమంత్రి సందేశాన్ని ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతుల సమస్యలను తెలుసుకుని ప్రభుత్వ సహకారం అందించడమేనన్నారు. డిప్ ఇరిగేషన్ చేయడం ద్వారా ఉన్న నీటిన వృథా కాకుండా పొదుపుతో నీటిని వాడుకోవచ్చని, డ్రిప్ ఇరిగేషన్‌కు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రైతులకు వంద శాతం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఇతరులకు 90 శాతం సబ్సిడీ ఉందన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేసిన పంటల్లో ఎక్కువ నష్టం ఉండని అన్నారు. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందవచ్చని అన్నారు. నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్ ఫుడ్ ప్రాసిసింగ్, ప్రభుత్వ మద్దతు గురించి వివివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వరలక్ష్మి, ఉద్యాన శాఖ అధికారి రాజా కృష్ణారెడ్డి, పశుసంవర్థక శాఖ అధికారి హేమంత్ కుమార్, తహసీల్దార్ విద్యాసాగర్ పాల్గొన్నారు.
మహిళా రైతుకు అభినందన
ఈ సందర్భంగా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రాజకుమారి పొలాన్ని పరిశీలించారు. మొక్కజొన్న రైతులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. తక్కువ వ్యయంతో అధిక లాభాలు సాగిస్తున్న రాజకుమారిని అభినందించారు.
పౌరులు రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలి
పౌరులందరూ రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సూచించారు. ఉయ్యాలవాడ గ్రామంలో భారత రాజ్యాంగ దినోత్సవం సంద ర్భంగా నిర్వహించిన సభలో భారత రాజ్యాంగ పీఠికను చదివి కలెక్టర్ ప్రతిజ్ఞ చేయించారు.