అభివృద్ధికి దూరంగా..
ABN , Publish Date - Oct 06 , 2025 | 12:07 AM
నగరపాలక పరిధిలోని 35వ వార్డు పందిపాడు ఇందిరమ్మ కాలనీ అభివృద్ధికి దూరంగా ఉంది. 2009లో కాలనీ ఏర్పడినా ఇంతవరకు కనీసం రోడ్డు కూడా వేయలేదు, తాగునీటి సౌకర్యం లేదు. దీంతో కాలనీ వాసులు నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారు.
తాగునీరు లేదు, రోడ్డు లేదు.. గ్యాస్ సిలిండర్ కూడా రాదు..
పందిపాడు ఇందిరమ్మ కాలనీవాసుల అవస్థలు
కల్లూరు, అక్టోబరు 5(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్పొరేషన్ పరిఽధిలోని పందిపాడు గ్రామంలో నాటి కాంగ్రెస్ ప్రభుత్వం 2009లో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటు చేసింది. రూ.2,100, రూ.4వేలు డీడీలు చెల్లించిన లబ్దిదారులు 2,500 మందికి స్థలాలు కేటాయించారు.
తాగునీరు లేదు, గ్యాస్ సిలిండర్ రాదు..
కాలనీకి తాగునీటి పైప్‌లైన్ లేదు. దీంతో దాదాపు 3 కి.మీ.ల దూరంలోని ముజఫర్‌నగర్‌కు వెళ్లి మినరల్ వాటర్ తెచ్చుకోవలసి వస్తోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీలో రోడ్డు లేకపోవడంతో గ్యాస్ సిలిండర్ డోర్ డెలివరీ కూడా లేదు. ఏజెన్సీ నిర్వాహకులు ఎక్కడో సిలిండర్లను దించేసి సమాచారమిస్తున్నారు. దాంతో వినియోగదారులు అక్కడికి వెళ్లి అవస్థలు పడుతూ తెచ్చుకోవలసి వస్తోంది.
పలుమార్లు వినతులు..
కాలనీలోని సమస్యలను పరిష్కరించాలని పలుమార్లు నగరపాలక సంస్థ అధికారరులకు, కలెక్టర్‌కు వినతిపత్రాలు ఇచ్చామని, అయినా పరిష్కారం కాలేదని కాలనీవాసులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి కాలనీని అభివృద్ధి చేయాలని కోరుతున్నారు.
సీసీ రోడ్లు లేక ఇబ్బంది
కాలనీలోకి చేరుకునే ప్రధాన రహదారి బురదమయంగా మారింది. నల్లరేగడి నేల కావడంతో చిన్న వర్షం కురిసినా వాహ నాలు వెళ్లేది అటుంచి కనీసం నడిచేందుకు కూడా వీలు కావడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ సరఫరా ఉన్నా, వీధి దీపాల్లో కొన్నే వెలుగుతున్నాయని అంటున్నారు.
అందని ప్రభుత్వ ప్రోత్సాహం
కాలనీలో ఇళ్లు నిర్మించుకోడానికి నాటి ప్రభుత్వం ప్రోతాహం ఇవ్వకపోవడంతో చాలామంది లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకో లేకపోయారు. కాగా కొందరు 70మంది లబ్ధిదారులు అప్పులు చేసి ఇంటి నిర్మాణం పూర్తిచేసుకుని నివాసముంటున్నారు. మరో మరో 70 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. మిగతా వారు ఎవరూ ఇంటినిర్మాణానికి ముందుకు రావడం లేదు.
అధికారులు స్పందించాలి
కానీలోని సమస్యలను అదికారులు పరిష్కరించాలి. రోడ్లు, డ్రైనేజీ, త్రాగునీటి వసతి లేక ఇబ్బందులు పడుతున్నాం. వర్షం వచ్చిన ప్రతిసారి నగరంలోకి రావాలంటే నరకం చూస్తున్నాం. - శారద, కాలనీవాసి
గ్యాస్ సిలిండర్ కూడా రాదు..
కాలనీలో సీసీ రహదారి లేకపోవడంతో గ్యాస్ సిలిండర్ కూడా రావడం లేదు. ఇక అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ వచ్చే అవకాశం లేదు. నగరానికి కూతవేటు దూరంలో ఉన్నా ఇబ్బందులు తప్పడం లేదు. - పద్మ, కాలనీవాసి