అభివృద్ధికి దూరం
ABN , Publish Date - Nov 27 , 2025 | 12:49 AM
చిత్రంలో కనిపిస్తున్నది ఎర్రగుంట కొట్టాల గ్రామం. 278 జనాభా ఉండగా, అందరూ వ్యవసాయ కూలీలే. గ్రామానికి నేటికీ రహదారి కూడా సరిగా లేదు. గ్రామంలో చాలామంది పక్కాగృహాల కోసం దరఖాస్తు చేసుకున్నా, అవి మంజూరు కాలేదు. అలాగే మరుగుదొడ్లు లేకపోవడంతో మహిళలు ఇబ్బందులు పడుతున్నారు.
సి. బెళగల్ మండలం మజరా గ్రామాల్లో ప్రజల అవస్థలు..
సీసీ రోడ్లు, డ్రైనేజీ లేదు, ఫ్లోరైడ్ నీటితో ఇబ్బందులు.. నిధులు ఇవ్వని పంచాయతీలు
సి. బెళగల్, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలోని మజరా గ్రామాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు 300లోపు జనాభాగల గ్రామాలను సమీప గ్రామ పంచాయతీలకు అనుసంధానం చేస్తారు. మొత్తం 18 పంచాయతీలు ఉండగా, మొత్తం నాలుగు మజరా గ్రామాలు ఉన్నాయి. ఎర్రగుంటకొట్టాల, క్రిష్ణదొడ్డి, బ్యాధోళి పల్‌దొడ్డి గ్రామాలను మజరా గ్రామాలుగా ఏర్పాటు చేశారు.
ప్రత్యేక నిధులు లేక అవస్థలు..
ప్రభుత్వం పంచాయతీలకు నిధులు విడుదల చేస్తుంది. మజరా గ్రామాలకు ప్రత్యేక నిదులంటూ ఉండవు. దీంతో పంచాయతీ వారు దయతిలిస్తేనే మజరా గ్రామాల్లో పనులు నిర్వహించేందుకు వీలుంటుంది. అయితే మండలంలోని మజరా గ్రామాలను అనుసంధానం చేసిన పంచాయతీల వారు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.
ఫ్లోరైడ్ నీటితో ఇబ్బందులు..
గ్రామంలో వేసిన బోర్లలో ఫ్లోరైడ్ నీరు ఉండటంతో ఇవి తాగేందుకు పనికిరావు. దీంతో ప్రజలు దూర ప్రాంతాలకు వెళ్లి నీరు తెచ్చుకోవలసి వస్తోంది. ప్రభుత్వ అధికారులు స్పందించి రక్షిత మంచినీటి పథకాన్ని మంజూరు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
గ్రామాన్ని పట్టించుకోవడం లేదు
మాది మజరా గ్రామం కావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పంచాయతీ కార్యదర్శిని అడిగితే నిధులు కొరత ఉందంటున్నారు. గ్రామంలో సీసీ రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు కూడా లేవు. - నాగమద్దిలేటి, ఎర్రగుంట కొట్టాల మజరా, బ్రాహ్మణదొడ్డి పంచాయతీ
సమస్యలను పరిష్కరిస్తాం
మండలంలో 2 పంచాయతీలు కొత్తగా ఏర్పడటంతో మజరా గ్రామాలు అభివృద్దిలో వెనుకబడ్డాయి. వచ్చే బడ్డెట్‌లో నిధులు మంజూరు చేయించి, సమస్యలను పరిష్కరిస్తాం. - మహేశ్వరి, డిప్యూటీ ఎంపీడీవో, సి.బెళగల్